గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 04, 2020 , 00:17:27

చేతికొస్తున్న సిరుల ‘పంట’

చేతికొస్తున్న సిరుల ‘పంట’

  •  ఉమ్మడి జిల్లాలో  మొదలు కానున్న వరి కోతలు
  •  ధాన్యం కొనుగోలు కేంద్రాల  ఏర్పాటుకు యంత్రాంగం సన్నద్ధం
  •  నిజామాబాద్‌లో 557, కామారెడ్డిలో 330 సెంటర్లు అందుబాటులోకి..
  •  కొవిడ్‌-19 నేపథ్యంలో జాగ్రత్తలు  పాటిస్తూ ధాన్యం సేకరణ
  •  భారీగా ధాన్యం దిగుబడులు వచ్చే  అవకాశాలున్నట్లు అంచనా
  •  నియంత్రిత సాగుతో పెరుగనున్న సన్నరకాల దిగుబడి

కరువుదీరా కురిసిన వానలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. నియంత్రిత సేద్యంతో మారిన సాగు ముఖచిత్రం.. ఫలితంగా ధాన్యపు దిగుబడి ఈసారి గణనీయంగా పెరుగనుంది. ఈ నేపథ్యంలో పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం రెడీ అవుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో 9లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు.. 557 కొనుగోలు కేంద్రాల ద్వారా  7లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక కామారెడ్డి జిల్లాలో 5.92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడికిగాను 4.95 లక్షల మెట్రిక్‌ టన్నులను 330 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిన నియంత్రిత సాగు విధానాన్ని రైతులు మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఫలితంగా ఉభయ జిల్లాల్లోనూ ఈసారి సన్నరకం వరి సాగు గణనీయంగా పెరిగింది.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌లో రైతులు తమకున్న గుంట భూమిని కూడా వ్యవసాయానికి వినియోగించుకున్నారు. పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులను గణనీయంగా రాబట్టారు. రైతుబంధుతో పెట్టుబడులకు ఆర్థిక సాయం  చేకూరింది. గతంలో సీజన్‌ సమయం ఆసన్నమవుతుండగా రైతు చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఇప్పుడేకంగా చెంతకే రైతుబంధు రూపంలో ఎకరాకు రూ.5వేలు చొప్పున నగదు రావడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. మరోవైపు 2020 వానకాలంలో వర్షాలు పుష్కలంగా కురిశాయి. జలాశయాలు పొంగి పొర్లడంతో పాటుగా పంటలకు ఢోకా లేకుండానే కాలం కలిసి వచ్చింది. దీంతో పంటల దిగుబడులు భారీగా వచ్చే అవకాశం ఏర్పడింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సుమారుగా 8లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, సన్నరకం, దొడ్డు రకాలకు చెందిన వరి సాగు భారీగానే విస్తరించింది. ధాన్యం ఊహించిన దాని కన్నా ఎక్కువే వచ్చే అవకాశాలుండడంతో పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. నిజామాబాద్‌ జిల్లాలో 557 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 330 కేంద్రాలు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు.

ఊరూరా కొనుగోలు కేంద్రాలు...

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఈసారి వరి కొనుగోలు కేంద్రాలను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్న యాసంగిలో కరోనా కష్టకాలంలో సాగిన కొనుగోళ్ల మాదిరిగానే భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూనే ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 9లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుండగా 7లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 557 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 7 నుంచి కొనుగోళ్లకు సిద్ధం కావాలని పౌరసరఫరాల సంస్థకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇందులో సన్నాలు సుమారుగా నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించే అవకాశాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 5.92లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనాలుండగా 330 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.95 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించనున్నారు. ఇందులో 3లక్షల మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం కాగా 2లక్షల మెట్రిక్‌ టన్నులు దొడ్డు రకంగా ఉండబోతున్నది.

మురిసిన నేల తల్లి...

వానకాలం సీజన్‌ రైతులకు కలిసి రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు భారీగా పెరిగింది. ఇందులో సన్నాలు అగ్రభాగాన్ని అధిగమించాయి. సామాన్యంగా వానకాలంలో ఇంటి అవసరాల కోసం రైతులు సన్నాలు వేసుకుంంటారు. ప్రభుత్వ సూచనల మేరకు మరింతగా విస్తీర్ణాన్ని పెంచారు. 2020 వానకాలం సీజన్‌లో వరి సాధారణ విస్తీర్ణం 2,38,138 ఎకరాలు ఉంది.  అమాంతం 2,77,065 ఎకరాల్లో (దాదాపుగా 116 శాతం) వరి సాగవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సన్న రకాల సాగులో తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్‌), హెచ్‌ఎంటీ, బీపీటీ 5201, జై శ్రీరాం, గంగా-కావేరి వంటి రకాలను రైతులు ఎంచుకున్నారు. పెసర్లు 220 ఎకరాల్లో, మినుములు 222 ఎకరాల్లో, కంది 5,034 ఎకరాల్లో, సోయా లక్ష ఎకరాలకు 80వేల ఎకరాల్లో సాగైంది. పత్తి 2,745 ఎకరాల్లో, పసుపు 33,346 ఎకరాల్లో, మక్కజొన్న 20,780 ఎకరాల్లో సాగు కావడం విశేషం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్‌లో పత్తిని 55,120 ఎకరాల్లో తెల్ల బంగారం పంటను సాగు చేశారు. 17,389 ఎకరాల్లో కంది సాగుకు నోచుకుంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 266 శాతం అధికంగా కందిని సాగు చేయడం విశేషం. సోయా 77,448 ఎకరాల్లో, పెసర్లు 13,870 ఎకరాల్లో, మినుములు 12,699 ఎకరాల్లో, చెరుకు 10వేల ఎకరాల్లో సాగు చేశారు. వరి పంటలో 60శాతం వరకు సన్నాలే వేశారు. వరి 1,09,226 ఎకరాల్లో సాగైంది.

సర్కారు చేయూత...

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. రూ.కోట్లు ఖర్చు చేస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. సాగును పండుగగా మారుస్తూ కర్షకుల కన్నీళ్లు తుడుస్తోంది. ఈ వానాకాలం సీజన్‌లో వానలు అనుకూలించడంతో జిల్లాలో అంచనాకు మించి వరి పంట సాగు కావడంతో ఆలస్యంగా పంటలు వేసినప్పటికీ దిగుబడి అంచనాలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గత వానకాలం సీజన్‌లో వచ్చిన ధాన్యం రాబడి కన్నా ఎక్కువే పంట దిగుబడులు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు మద్దతు ధర అందించడంలో ముందస్తుగా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో సాగు నీటి వసతి గతంతో పోలిస్తే మెరుగైంది. కాలువలు ఆధునీకరించడం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించడంతో సాగుకు  కలిసి వచ్చింది. వానకాలం సీజన్‌ వచ్చిందంటే సమైక్య పాలనలో ఎంతో నిర్లక్ష్యం. రైతుల్లోనూ ఎడతెగని నిరాశ. అచ్చిరాని కాలంతో పాటుగా సాగు నీళ్లకు కటకటతో పంటలు వేయాలంటేనే భయం. అలాంటి దుస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలతో  రాష్ట్రం అంతటా పచ్చని మాగాణంలా మారింది. తద్వారా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సాగు భళా అనిపించేలా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీడు భూములే కనిపించకుండా పంటలు సాగవడం ఇటు రైతుల్లోనూ సంతోషాన్ని నింపింది.

కొనుగోళ్లకు సిద్ధం..

ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు దాదాపుగా పూర్తయ్యింది.  కోతలకు సమయం ఆసన్నం కావడంతో యంత్రాంగం రెడీ అవుతోంది. కోతలు మొదలవ్వగానే కేంద్రాలను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తాం. కొవిడ్‌ -19 జాగ్రత్తలు తీసుకుంటూనే ధాన్యాన్ని సేకరిస్తాం.

- యాదిరెడ్డి, అదనపు కలెక్టర్‌, కామారెడ్డి జిల్లా


logo