శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Oct 02, 2020 , 02:30:27

పశువుల కృత్రిమ గర్భధారణకు ఆదరణ

పశువుల కృత్రిమ గర్భధారణకు ఆదరణ

నిజామాబాద్‌ రూరల్‌ / ఎల్లారెడ్డి రూరల్‌ :నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం (నేషనల్‌ ఆర్టిఫిషియల్‌ ఇన్‌సెమినేషన్‌ ప్రోగ్రాం - ఎన్‌ఏఐపీ) విజయవంతంగా కొనసాగుతున్నది. గతేడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి కృత్రిమ గర్భధారణ కార్యక్రమం నిర్వహించారు. మేలు జాతి పశు సంపదను అభివృద్ధి పరిచి పశుపోషకులకు రెట్టింపు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. గర్భధారణకు అవసరమైన ఘనీకృత వీర్యం, లిక్విడ్‌ నైట్రోజన్‌ తదితర సామగ్రిని జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) అందజేస్తున్నది. నిజామాబాద్‌ నగరంలోని సారంగాపూర్‌ శివారులో ఉన్న జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఒక్కో జిల్లాలో 100 గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో ఎదకు రాని 200 పాడిపశువులకు కృత్రిమ గర్భధారణ చేసి ఎదకు వచ్చేలా కృషి చేశారు. ఈ లెక్కన ఒక్కో జిల్లాలో ఎదకు రాని 20వేల పశువులకు గర్భధారణ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అధికారులు, సిబ్బంది కృషితో లక్ష్యాన్ని ముందుగానే అధిగమించారు. 2019 సెప్టెంబర్‌ 20న కార్యక్రమం ప్రారంభం కాగా 2020 మార్చి 15వ తేదీ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేశారు. రెండో విడుత ఇప్పటికే ప్రారంభం కాగా వచ్చే ఏడాది మే 31 వరకు కొనసాగనుంది.

ఈ యేడు రెండు జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో..

గతేడాది తొలివిడుతగా రెండు జిల్లాలో 100 గ్రామాల చొప్పున ఎంపిక చేయగా ఈ యేడు అన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాలో 50 వేల పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేసి ఎదకు వచ్చేలా చేపట్టే కార్యక్రమం ఆగస్టు 1 నుంచి ప్రారంభమైంది. 2021 మే 31వ తేదీ వరకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండో విడుత కార్యక్రమంలో ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో 6,500 పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్లు ఉమ్మడి జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ సచిన్‌ దేశ్‌పాండే తెలిపారు. నిర్దేశించిన లక్ష్యసాధనను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా 18 మంది గోపాలమిత్రలను, కామారెడ్డి జిల్లాలో నలుగురు గోపాలమిత్రలను నియమించడానికి దరఖాస్తులను డీఎల్‌డీఏ అధికారులు స్వీకరించారు. 

కృత్రిమ గర్భధారణతో లాభాలు

మేలుజాతి మగ పశువుల వీర్యాన్ని సేకరించి నాణ్యతను పరీక్షంచిన తరువాతే దానిని వినియోగిస్తారు. దీంతో పుట్టే దూడలు ఆరోగ్యంగా ఉంటాయి. సహజ సంపర్కంతో గర్భకోశ వ్యాధులు వస్తాయి. కృత్రిమ గర్భధారణతో ఈ సమస్యను నివారించవచ్చు. అలాగే ఏవైనా గర్భకోశవ్యాధులు ఉంటే వాటిని గుర్తించి వెంటనే వైద్యం చేసేందుకు వీలుంటుంది. ఘనీకృత వీర్యం రవాణా చాలా సులభం. మారుమూల ప్రాంతాల్లోనూ సులభంగా కృత్రిమ విధానంలో గర్భధారణ చేయవచ్చు.

నిజామాబాద్‌ జిల్లాలో 22 వేల పశువులకు.. 

నిజామాబాద్‌ జిల్లాలో 20వేల పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని లక్ష్యం కాగా 22వేల పశువులకు గర్భధారణ నిర్వహించారు. కార్యక్రమంలో 45 మంది గోపాలమిత్రలు, 55 మంది పశుసంవర్ధక శాఖ సాంకేతిక సిబ్బంది సేవలు అందించారు. పాడిరైతుల ఇంటి వద్దకే వెళ్లి ఎదకు రాని పాడిపశువులకు గర్భధారణ చేశారు. అప్పటి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ బాలిక్‌ అహ్మద్‌, డీఎల్‌డీఏ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ బస్వారెడ్డి, క్యాటిల్‌ బ్రీడింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఖదీర్‌ అహ్మద్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 

కామారెడ్డి జిల్లాలో 22,078 పశువులకు..

కామారెడ్డి జిల్లాలో 20వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డీఎల్‌డీఏ పర్యవేక్షణలో 56 మంది గోపాలమిత్రలు, 44 మంది పశు సంవర్ధక శాఖ సాంకేతిక సిబ్బంది సమష్టి కృషితో 22,078 పశువులకు గర్భధారణ చేశారు. 

కృత్రిమ గర్భధారణ అంటే..

పాడి పశువులలో జన్యు లక్షణాల మెరుగుదలకు అనుసరించే సాంకేతిక పద్ధతుల్లో కృత్రిమ గర్భధారణ ప్రధానమైనది. అత్యుత్తమ లక్షణాలు కలిగిన దున్నపోతులు, ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ద్రవరూప నత్రజని కంటైనర్లలో నిలువ ఉంచుతారు. ఆవులు, గేదెలు గర్భధారణకు అనుకూలమైన సమయంలో ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి నాళంలో ఆ వీర్యాన్ని ప్రవేశపెడతారు. పశువు ఎదకొచ్చిన లక్షణాలను గుర్తించి ఆ సమయంలో ఎద సూది ఇస్తారు. ఆవుల్లో ఎదకు వచ్చిన 12 నుంచి 14 గంటల మధ్య గర్భధారణ చేస్తారు. ఇలా చేస్తే పశువులకు ఒక్కసారికే నిలువవచ్చు. లేకపోతే మళ్లీ అవి 21 రోజుల తర్వాత ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిసారి ఎదకు వచ్చిన పశువు బరువు అంచనా వేసుకొని, మూడడుగుల ఎత్తుంటే కృత్రిమ గర్భధారణ చేయాలి. లేకపోతే పశువు ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంటుంది.