శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Oct 02, 2020 , 02:30:27

కారు జోరు.. స్పీడ్‌ గేరు..

కారు జోరు..  స్పీడ్‌ గేరు..

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందే కారు జోరు హోరెత్తుతోంది. ప్రతిపక్ష నేతలు మాత్రం ఉన్న కొద్దిమంది ఓటర్లనూ కాపాడుకోలేక తలలు పట్టుకుంటున్నారు. గెలిచేంత సంఖ్యాబలం లేని కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలో చేరేందుకు వరుస కడుతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించి టీఆర్‌ఎస్‌ ఖాతాలో మరో చారిత్రక విజయాన్ని చేర్చాలని టీఆర్‌ఎస్‌ పెద్దలు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర నాయకులతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొంగొత్త హుషారు కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీల హడావిడి మచ్చుకు కనిపించకపోవడం విడ్డూరంగా మారింది. మరోవైపు ఎంపీటీసీలకు కరోనా టెస్టులు కొనసాగుతుండగా.. మండలాల్లో ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు మూకుమ్మడిగా కవితకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారు. జిల్లా పోలింగ్‌ తేదీకి సరిగ్గా వారంరోజులే గడువు ఉండడంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం సైతం ఏర్పాట్లపై సీరియస్‌గా దృష్టి సారించింది.

తీర్మానాల హోరు...

ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు మూకుమ్మడి తీర్మానాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పలు మండలాల్లో నేతలంతా కలిసి మద్దతు నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కవితకు గంపగుత్తగా మొదటి ప్రాధాన్యతా ఓటుతో విజయం చేకూర్చేతి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రి వేముల అధ్యక్షతన జరిగిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలు కిందిస్థాయికి తీసుకుపోవడంతో పాటుగా ఉపఎన్నికల్లో పొరపాట్లకు తావు లేకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌, బోధన్‌ నియోజకవర్గంలోని ఎడపల్లి, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి, రూరల్‌ మండలాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు కవితకు మద్దతుగా మూకుమ్మడిగా తీర్మానాలు చేశారు. 

రోజుకో భంగపాటు...

జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్‌, బీజేపీలకు రోజుకో భంగపాటు తప్పడం లేదు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ బుధవారం ప్రెస్‌మీట్‌ పెట్టి వెళ్లిన మరుక్షణమే.. ఆ పార్టీకి చెందని నిజామాబాద్‌ నగర కార్పొరేటర్‌ బీజేపీని వీడి కారెక్కారు. అర్వింద్‌ వైఖరిని నిరసిస్తూ చాలామంది గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్‌ నుంచీ వలసలు భారీగానే కొనసాగుతున్నాయి. చేరికల పర్వం నిర్విరామంగా సాగుతుండటంతో ఎమ్మెల్సీ బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ ఏమీ చేయలేక మిన్నకుండి పోతున్నారు. ఆ పార్టీల నాయకులు సైతం అటు ప్రచారం చేయలేక, ఇటు ఉన్నవారిని కాపాడుకోలేక సతమతమవుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున చేరికలతో టీఆర్‌ఎస్‌ బలం పుంజుకున్నది. స్వతహాగా ఉన్న సంఖ్యాబలంతోనే ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఖాయం కాగా, అదనంగా ఇతర పార్టీల స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల మద్దతుతో టీఆర్‌ఎస్‌ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘స్థానిక’ ఓటర్లకూ పోస్టల్‌ బ్యాలెట్‌...

సాధారణ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉద్యోగులకు మాత్రమే అందిస్తారు. వారికి ఓటుహక్కు ఉన్నప్పటికీ విధుల్లో భాగంగా రాజ్యాంగ బద్ధమైన హక్కును కోల్పోకుండా ఎన్నికల కమిషన్‌ కల్పించిన చక్కని అవకాశం. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేవారు ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వచ్చినా.. లేదంటే 65 ఏళ్లు పైబడి పోలింగ్‌ బూత్‌కు రాలేకపోయినా.. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వేసేలా సౌకర్యం కల్పించనుంది. 824 మంది ఓటర్లలో ఏ ఒక్కరూ కరోనా కారణంగా ఓటు వేయకుండా ఉండకూడదని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నది. అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీటీసీలకు ఇప్పటికే కరోనా పాజిటివ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ 9న పోలింగ్‌ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఓటేసేందుకు సమయాన్ని కేటాయించారు.