గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 01, 2020 , 04:28:57

దండిగా దరఖాస్తులు

దండిగా దరఖాస్తులు

  • రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన.
  • కేటీఆర్‌ హామీ మేరకు జీవో సవరణతో ఊరట
  • అనుమానాలు నివృత్తి చేయడంలో పుర సిబ్బంది వైఫల్యం
  • అధికారులు తీరుపై మండిపడుతున్న సామాన్య జనం
  • భూక్రమబద్ధీకరణకు అక్టోబర్‌ 15 ఆఖరు తేదీ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భూ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) చార్జీలను ప్రభుత్వం తగ్గించిన తర్వాత ఉమ్మడి జిల్లాల్లో దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. నిజామాబాద్‌ నగరపాలక సంస్థతో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఆదరణ లభిస్తున్నది. పట్టణాలతో పాటు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. అక్టోబర్‌ 15వ తేదీ వరకు గడువు ఉండడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తుల రూపంలో పురపాలికలు, పంచాయతీలకు ఆదాయం కూడా భారీగా చేకూరుతున్నది. కరోనా కారణంగా   మొన్నటి వరకు స్పందన అంతంత మాత్రంగానే ఉండగా .. గడువు సమీపిస్తుండడంతో ప్రజలంతా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో విలీనమైన గ్రామాల్లో ఆయా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు గందరగోళానికి గురవుతున్నారు. తా ము కొనుగోలు చేసిన ప్లాటు ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి వస్తుం దా? రాదా? తెలియక పురపాలక అధికారులను సంప్రదించినా స్పందన ఉండడం లేదు. ఫిర్యాదుల కేంద్రం నంబర్లు స్విచ్ఛాఫ్‌ ఉండడం, కార్యాలయాల్లో  స్పందించే వారు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 

గడువు దాటితే కష్టమే...

భూ క్రమబద్ధీకరణ పథకానికి ప్రభుత్వం ఇదే చివరి అవకాశంగా చెబుతున్నది. అక్టోబర్‌ 15 తర్వాత అక్రమ వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసే వారికి ఇక్కట్లు ఎదురు కావడం ఖా యంగా కనిపిస్తున్నది. ఎకరాల కొద్దీ స్థలాలు, వెంచర్లను ఇకపై లే అవుట్‌ చేయాల్సిందే. లేదంటే ప్లాట్లుగా విభజించి విక్రయించినా రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైనా ఇ లాంటి స్థలాలు కొనుగోలు చేస్తే ఇబ్బందుల్లో పడడం ఖాయం. నిజామాబాద్‌ వంటి నగరాల్లో శివారు ప్రాంతాల్లో నుడా జారీ చేసిన లేఅవుట్‌ అనుమతి ఉందో లేదో పరిశీలించుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. గుడ్డిగా లేఅవుట్‌ అప్రూవల్‌ లేని వెంచర్లలో పెట్టుబడి పెడితే ఇక అం తే సంగతి. భవిష్యత్తులో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించే అవకాశం ఉండదు. పైగా కరెంట్‌ కనెక్షన్‌, నల్లా కనెక్షన్‌ ఇవ్వరు. ఎల్‌ఆర్‌ఎస్‌కు రాకపోతే వాటిపై కఠిన నిబంధనలు అమలు చేస్తారని అధికారిక వర్గాలు చెబుతుండడంతో భయంతో అనేక మంది దరఖాస్తులు చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు  ప్రభుత్వం కొన్ని నిబంధనలు నిర్దేశించింది.

మున్సిపాలిటీల్లో ఇలా...

బోధన్‌ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 41 లే అవుట్లు అక్రమమని తేల్చగా 5 లేఅవుట్లకు మాత్రమే అనుమతులున్నాయి. భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో 8 అక్రమ లేఅవుట్‌ వెంచర్లలో 99 అక్రమ ప్లాట్లు గుర్తించగా పూర్తి స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. బాన్సువాడలో 14 లే అవుట్లలో 400 ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 82 అక్రమ లేఅవుట్లు గుర్తించారు. ఇందులో 6,991 ప్లాట్లున్నాయి. ఇప్పటి వరకు సగానికి దరఖాస్తులు వచ్చాయి. ఎల్లారెడ్డిలో 6 అక్రమ వెంచర్లున్నాయి. ఇందులో భారీగా 526 ప్లాట్లు   చేశారు.  ఇప్పటి వరకు ఇక్కడ 366 దరఖాస్తులు వచ్చాయి. 

పాత గణాంకాల మేరకు నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 157 అక్రమ లేఅవుట్లు గుర్తించారు. వీటిలో 13వేల ప్లాట్లు ఉన్నాయి. ఆర్మూర్‌ మున్సిపాలిటీలో 213 అక్రమ వెంచర్లు గుర్తించగా వీటిలో 888 ప్లాట్లు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ఇదే చివరి అవకాశమని  ప్రభుత్వం ప్రకటించడంతో చాలా సంవత్సరాల క్రితం ప్లాట్లను కొనుగోలు చేసిన వారూ దరఖాస్తు చేస్తున్నారు. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొని అనుమతి లేకుండా ఇండ్లు నిర్మించుకునే వారు, ప్లాట్‌ను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యం లో దరఖాస్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నది. అక్రమ లే అవుట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ నామమాత్రంగానే సేవలు అందిస్తున్నారు. పట్టణా లు, పంచాయతీల్లో వందల్లో లే అవుట్లు  ఉన్నాయి. వీటిలో వేల ఎకరాలను అనుమతి లేకుండా ప్లాట్లు చేసి విక్రయించారు. పురపాలిక, పంచాయతీ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో రియల్టర్లు అనుమతులు తీసుకోకుండానే విక్రయాలు చేశారు. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే. పంచాయతీలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగానే వస్తున్నాయి. 

మొన్న వెలవెల... నేడు కళకళ...

ఎల్‌ఆర్‌ఎస్‌(లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) 2018లో ప్రా రంభించారు. 2018, మార్చి 30లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో అనుమతించారు. మొదట 2018, సెప్టెంబర్‌ నెలాఖరు వరకు గడువు విధించారు. ఆ తర్వాత జనవరి 31, 2020 వరకు ప్రస్తుతం అక్టోబర్‌ 15 వరకు గడువు పెంచారు. ప్రజల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంటున్నది.  దీనికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే.. బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ వంటి గ్రామ పంచాయతీలు నుంచి మున్సిపాలి టీలుగా మారినా ప్రజల ఆలోచనా విధానం మారలేదు. ప్రతి శనివారం మున్సిపాలిటీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నా, స్పందన లేదు.

 క్రయ, విక్రయాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ ముఖ్యమనే విషయం అవగాహన చేసుకోలేకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారే అధికంగా ఉండడంతో కొన్ని చోట్ల ముందుకు రాలేక పోతున్నారు. మార్చి నెలలో లాక్‌డౌన్‌ ప్రభావం కూడా బా గా పడింది. ఆర్థికంగా పలువురి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కరోనా మూలంగా మొన్నటి వరకు స్పందన అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ... ప్రస్తుతం దరఖాస్తుల సంఖ్య దండిగా పెరుగుతుండడం విశేషం. 


logo