సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Sep 30, 2020 , 02:45:12

ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు

ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు

  •  అందుబాటులోకి మరో ఆరు రకాల సేవలు 
  • కార్యాలయానికి వెళ్లకుండానేపనులు
  • సమయం, డబ్బు ఆదా 
  • తప్పనున్న దళారుల బెడద

కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సేవలు సులభతరం చేయడంతో పాటు సమయం, డబ్బు ను ఆదా చేసే విధంగా ఆన్‌లైన్‌ సేవలు అందజేస్తున్నాయి. దీంట్లో భాగంగా  రవాణా శాఖలో సైతం ఆన్‌లైన్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను  కార్యాలయానికి రాకుండానే ఇంటి వద్ద నుంచే అందించేందుకు చర్యలు తీసుకున్నది. ఇప్పటికే రెండు నెలల క్రితం ఐదు సేవలను ఆన్‌లైన్‌ చేసిన ప్రభుత్వం తాజాగా మరో ఆరు సేవలను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ చేసింది. దీంతో రవాణా శాఖ కార్యాలయాలకు రాకుండానే స్మార్ట్‌ ఫోన్‌ లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని సేవలను పొందే అవకాశం కల్పించింది. రవాణా శాఖలో వాహన దారులకు మొత్తం 59 సేవలను అందిస్తున్నారు. టీ యాప్‌ ఫోలియో ద్వారా ఈ సేవలను పొందే అవకాశం వినియోగదారులకు కల్పించారు.  ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు 100 నుంచి  150 వరకు వాహన రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. 

తాజాగా మరో ఆరు సేవలు ఆన్‌లైన్‌లో

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రభుత్వం ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందించేందుకు ముందుకు వస్తున్న ది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో  జూన్‌ 24 నుంచి ఐదు సేవలను రవాణా శాఖ అందిస్తుండగా తాజాగా మరో ఆరు సేవలను అందిస్తుంది. రవాణా శాఖలో ఉన్న 70 ప్రజా సంబంధ వ్యవహారాల ద్వారా సేవలను అందిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీఏ  కార్యాలయాల నుంచి 59 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను రూపుమాపడానికి 2009 నుంచే కంప్యూటరైజ్డ్‌ నెట్‌వర్క్‌ సిస్టిమ్‌కు ప్రాథమికంగా శ్రీకారం చూట్టారు. 2015 నుంచి రవాణా సేవలను అందించడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ప్రా రంభించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ తదితర సేవలకు స్పాట్‌ బుకింగ్‌ ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో కాకుండా ఈ సేవ కేంద్రాల్లో కూడా బుకింగ్‌, జరిమానాలు, చలాన్ల చెల్లింపును చేపట్టారు. కాగా కరోనా మూలంగా కార్యాలయానికి రాకుండా పూర్తి స్థాయిలో తాజాగా తెచ్చిన ఆరు సేవలతో కలిపి మొత్తం 11 సేవలను  ఇంటి వద్ద నుంచే పొందే అవకాశాన్ని కల్పించారు. 

ఆన్‌లైన్‌ సేవలు ఇవే

కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌కు అనుసంధానిస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నది.  వీటిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ,  అడ్రస్‌ మార్పు, ప్రమాదకర వస్తువులను తరలించే వాహనాల లైసెన్స్‌ తీసుకోవడం, గడువు ముగిసిన లర్నింగ్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్తది తీసుకోవడం, వాహన కేటగిరి మారినప్పుడు కొత్త లర్నింగ్‌ లైసె న్స్‌ పొందడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిపోతే మళ్లీ లైసెన్స్‌ జారీ లాంటి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా గంటల తరబడి రవాణా కార్యాలయంలో నిరీక్షించవలసిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తుదారుడు కోరుకున్న సేవలకు సంబంధించి పూర్తి వివరాలు సక్రమంగా ఉంటే రవాణా శాఖ అధికారులు ఆ పనిని పూర్తి చేసి డాక్యుమెంట్లు కూడా ఇంటికే పోస్టు ద్వారా పంపించే ఏర్పాట్లు చేసింది. దీంతో వాహన వినియోగ దారులకు పనులు సులువుగా అవుతాయి. 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవలను దశల వారీగా ప్రజలకు పూర్తిస్థాయిలో అందిస్తున్నాం. ఇంటి వద్ద నుంచే అన్ని సేవలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

-వాణి, డీటీవో, కామారెడ్డి


logo