గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Sep 30, 2020 , 02:45:09

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

  • దసరాలోపు రైతువేదికలు పూర్తి కావాలి
  • రోడ్లు, కమ్యూనిటీ భవన నిర్మాణాలపై ఆరా..
  • నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్ష

వేల్పూర్‌(కమ్మర్‌పల్లి): రైతువేదిక నిర్మాణ పనులను దసరాలోపు పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాస న సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సీడీపీ, ఎస్‌డీఎఫ్‌ ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. సీడీపీ నిధులతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.7.51 కోట్లతో 190 పనులు మంజూరు కాగా, ఇందులో రూ. 4.46 కోట్లతో 148 పనులు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 23 పనులు పురోగతిలో ఉన్నాయని,19 పనులు మొదలు కావాల్సి ఉన్నాయని తెలిపారు.

 పురోగతిలో ఉన్నవి త్వరగా పూర్తి చేయించాలని, ప్రారంభం కానివి త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఉపాధి ద్వారా చేపట్టిన రోడ్లు, వైకుంఠధామాలు, రైతువేదిక నిర్మాణ పనులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతు వేదికలను దసరాలోపు పూర్తిచేయించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ పరిధిలో నియోజకర్గంలో కొనసాగుతున్న ఇతర పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో ఈఈ మురళి, డీఈ మహేందర్‌, ఏఈ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. logo