శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Sep 29, 2020 , 02:10:38

పట్టణ సమస్యలకు శాశ్వత పరిష్కారం !

పట్టణ సమస్యలకు శాశ్వత పరిష్కారం !

  • lధరణి పోర్టల్‌లోకి త్వరలోనే    వ్యవసాయేతర ఆస్తుల వివరాలు..
  • lఉభయ జిల్లాల ప్రజా ప్రతినిధులతో  మంత్రి కేటీఆర్‌
  • l‘నిజామాబాద్‌, కామారెడ్డి’ పురపాలికలపై సమీక్ష

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తులపై ఉన్న టైటిల్‌ హక్కులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ధరణి పోర్టల్‌లోకి వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సైతం పొందుపర్చనున్న నేపథ్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌ గుప్తా, షకీల్‌, సురేందర్‌, డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి హాజరయ్యారు. మున్సిపాలిటీలు కలిగి ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ సమావేశంలో పుర సమస్యలపైనా చర్చించారు. గ్రామాల కన్నా పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తుల కు సంబంధించిన టైటిల్‌ సంబంధిత సమస్యలు ఉంటాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రభు త్వం ప్రయత్నం చేస్తోందని కేటీఆర్‌ వివరించారు.

వినతులు సమర్పించండి..

మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో ధరణి పోర్టల్‌లో నమోదు చేయడానికి ఇబ్బందులు ఉన్న ఇండ్ల వివరాలను వినతుల రూపంలో రెండు రోజుల్లో తమ దృష్టికి తీసుకు రావాలని ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతులను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి జీవో నంబర్‌ 58, 59 ద్వారా పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించామని కేటీఆర్‌ గుర్తు చేశారు. కొన్ని కారణాలతో పరిష్కారానికి నోచుకోని సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఈంచ్‌ భూమిని ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నం సాగుతోందన్నారు. పట్టణ ప్రజలకు వారి ఆస్తులకు సంపూర్ణ హక్కులు దక్కడంతో భవిష్యత్తులో క్రయ, విక్రయాలకు ఎలాంటి సమస్యలు ఉండకుండా చూస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.logo