గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Sep 29, 2020 , 02:10:40

వలసల జోరు.. ప్రతిపక్షాలు బేజారు!

వలసల జోరు.. ప్రతిపక్షాలు బేజారు!

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక పెద్ద సవాల్‌గా మారింది. బలం లేకున్నా బరిలో నిలిచిన ఆ పార్టీలు సరిగ్గా ఎన్నికలకు ముందు తమ వారిని కాపాడుకునేందుకు నా నా తంటాలు పడాల్సి వస్తున్నది.  రాష్ర్టాభి వృద్ధికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని గుర్తించి స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు వరుస కడుతుండడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. తమ వారిని కాపాడుకోలేక సతమతమవుతూ ఎన్నికలకు ముందే చేతులెత్తేసేలా పరిస్థితి మారింది. నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ అర్వింద్‌ తీరును నిరసిస్తూ అనేక మంది బీజేపీకి చెందిన లీడర్లు ఆ పార్టీని వీడుతున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వ్యక్తి మాటలను నమ్మలేక, ప్రజలకు చేసిన మోసాలను గుర్తు చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి గడ్డు కాలం ఎదురవుతోంది. నిజామాబాద్‌లో గెలిచిన రెండు జడ్పీటీసీ స్థానాల్లో ఒకరు ఇప్పటికే చేజారారు. కామారెడ్డి జిల్లాలో 8 మంది జడ్పీటీసీల్లో సగం మంది పార్టీ వీడగా మిగిలిన వారు సైతం పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నా రు. ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందే గులాబీ పార్టీలోకి  పెరుగుతున్న వలసలతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బెంబేలెత్తుతున్నాయి.

ఎంపీ అర్వింద్‌ తీరుపై వ్యతిరేకత...

బీజేపీ ఇందూరు శాఖలో అంతర్గత పోరు రాజుకుంది. కొత్త, పాత నాయకుల కలయికగా మారిన ఆ పార్టీలో నిత్యం మూ డు ఘర్షణలు, ఆరు కొట్లాటలు అన్న చందంగా మారింది. రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుండడంతో, నిజామాబాద్‌ ఎంపీగా గెలిచి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కరోనా కష్టకాలంలో జిల్లా ప్రజల మొఖమే చూడకపోగా పార్టీ నాయకులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం, నిత్యం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం వంటి కారణాలతో అనేక మంది ఎంపీపై గుర్రుగా ఉన్నారు. పార్టీలోని పాత నాయకులు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఎంపీపై ఫిర్యాదులు చేశారు. కొంత మంది పార్టీలో ఇమడలేక, ప్రజలకు సేవ చేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీయే  ముఖ్యమని అందులో చేరుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పథకాలకుఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని వారు పేర్కొంటున్నారు. 

కాంగ్రెస్‌, బీజేపీలు ఉక్కిరిబిక్కిరి...

ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది కాంగ్రెస్‌, బీజేపీల దుస్థితి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సరిగ్గా పది రోజులు సమయం ఉండగా ఆయా పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గులాబీ పార్టీలో చేరుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాలకు చెందిన 824 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకే ఎమ్మెల్సీ ఉప ఎ్ననికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. ఓటు హక్కు కలిగి ఉన్న వారిలో కామారెడ్డి జిల్లాలో 338 మంది ఉండగా నిజామాబాద్‌ జిల్లాలో 486 మందికి ఓటు హక్కు ఉంది. మెజార్టీ ఓటర్ల సంఖ్య టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉండడంతో పాటు కొద్ది రోజులుగా పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీ, కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరుతుండడంతో మరింత బలం పెరిగింది. ఉన్నవారిని కాపాడుకునేందుకు రెండు జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఉభయ జిల్లాల్లో తిరుగులేని శక్తిగా...

తెలంగాణ రాష్ట్ర సమితి మునుపెన్నడూ లేని విధంగా సంస్థాగతంగా  బలపడింది. ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలన్న సంకల్పంతో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని వరుసగా ఏ ఎన్నిక వచ్చినా ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. ప్రజల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో  అఖండ విజయాన్ని అందుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌కే ప్రజలంతా పట్టం కడుతున్నారు. శాసనసభ, పంచాయతీ, సాధారణ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో గులాబీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో కారు జోరుకు ప్రతిపక్షాలు పత్తాలేకుండా పోయాయి. తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామాల్లో పాగా వేసి తిరుగులేని శక్తిగా మారింది.  ఏ ఎన్నిక వచ్చినా విజయం ఏకపక్షమే అన్నట్లుగా మారడంతో ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ సీట్లు అత్యధికంగా టీఆర్‌ఎస్‌ కోటాలోనే ఉన్నాయి. అక్టోబర్‌ 9న జరిగే ఉప ఎన్నికల్లోనూ కారు వేగానికి కాంగ్రెస్‌, బీజేపీలు పత్తా లేకుండా పోనుండగా మరోమారు టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.


logo