ఆదివారం 01 నవంబర్ 2020
Nizamabad - Sep 28, 2020 , 03:20:30

టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

ఖలీల్‌వాడి/ఎల్లారెడ్డి రూరల్‌: టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.  ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌, బీజేపీ నుంచి చాలామంది నాయకులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గూటికి వచ్చారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో జడ్పీటీసీ, కార్పొరేటర్‌ టీఆర్‌ఎస్‌లో ఆదివారం చేరగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి హైదరాబాద్‌లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్‌, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఆధ్వర్యంలో నిజామాబాద్‌ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ కె.ఉమారాణి గులాబీ గూటికి వచ్చారు. ఆయా కార్యక్రమాల్లో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డితోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు సత్యంరావు, శ్రీనివాస్‌నాయక్‌, శ్రీనివాస్‌గౌడ్‌,  నాగం సాయిబాబా, గోపీ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు షాక్‌..

జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీకి స్థానిక సంస్థల్లో బలం లేనప్పటికీ ఉనికిని కాపాడుకునేందుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో నిలిచాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితకు పోటీగా కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. ఆయన ప్రధాన అనుచరుడు ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్‌తోపాటు సందీప్‌గౌడ్‌  తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ వర్గాలు షాక్‌ తిన్నాయి.

ఎమ్మెల్యే సురేందర్‌ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్‌ చేరిక..

ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఆరో వార్డు కౌన్సిలర్‌ సంగని బాలమణి ఎమ్మెల్యే సురేందర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యం, కౌన్సిలర్లు ఇమ్రాన్‌, సాయిరాం, నాయకులు పోశయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్‌నాయక్‌ పాల్గొన్నారు. 

పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనరంజక పాలన, రైతులు, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని అన్నారు. పార్టీలోకి వచ్చినవారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. వారివారి ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకునేలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధుల వెంట పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు కూడా అండగా నిలుస్తామన్నారు.