ఆదివారం 01 నవంబర్ 2020
Nizamabad - Sep 28, 2020 , 03:15:35

కోడ్‌.. ‘కొవిడ్‌'.. రెండూ కీలకమే..!

 కోడ్‌.. ‘కొవిడ్‌'..  రెండూ కీలకమే..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎలక్షన్‌ కోడ్‌ను, కొవిడ్‌-19 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి స్పష్టంచేశారు. కరోనా కారణంగా యావత్‌ ప్రపంచమే ఇబ్బంది పడుతున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, రాజకీయపక్షాలు కోడ్‌కు, కొవిడ్‌ నిబంధనలకు లోబడే వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను 50కి పెంచాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలను పంపామని వెల్లడించారు. ఎన్నికలకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికకు 11 రోజుల విరామం మాత్రమే ఉన్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణరెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:

కొవిడ్‌-19 కారణంగా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పలు వాయిదాల అనంతరం చివరి ఘట్టానికి చేరుకుంటున్నది. ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తికాగా, పోలింగ్‌ మాత్రమే మిగిలింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ వెలువడడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. ఉపఎన్నిక నోటిఫికేషన్‌ రావడంతో రాజకీయ పార్టీల సందడి మొదలైంది. పార్టీల ప్రచారానికి అక్టోబర్‌ 7వ తారీఖు వరకు అవకాశం ఉండడంతో కోడ్‌ ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నిజామాబాద్‌, కా మారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమై న చర్యలకు సిద్ధమైంది. భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 9న జరిగే ఉప ఎన్నికలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ బూత్‌లు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా రాజీలేకుండా చర్యలు తీసుకుంటున్నామని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ ఉపఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. అన్ని దశల్లోనూ అటు కొవిడ్‌ మార్గదర్శకాలను, ఇటు ఎన్నికల నిబంధనావళిని పాటించేలా చూస్తామని ఆయన స్పష్టంచేశారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

నమస్తే: కరోనా ఎమ్మెల్సీ ఉపఎన్నికపైనా తీవ్రంగా ప్రభావం చూపింది. పలు వాయిదాల అనంతరం పోలింగ్‌కు యంత్రాంగం ఎలా సిద్ధమవుతోంది?

కలెక్టర్‌: కంటికి కనిపించని కరోనా వైరస్‌ మూలంగా యావత్‌ ప్రపంచమే ఇబ్బందులు పడుతోంది. 2020 మార్చి 5న వెలువడిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఆధారంగా ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు మొదలవగా.. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఉపఎన్నికలు వాయిదాపడ్డాయి. ఎన్నికల కమిషన్‌ తిరిగి రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు ప్రారంభించాం. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను నిర్వహిస్తాము.

కరోనాకాలంలో తెలంగాణలో జరుగుతున్న తొలి ఉపఎన్నిక ఇదీ. ఈసీ మార్గదర్శకాల మేరకు పోలింగ్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఓటరుకు కరోనా ఉంటే ఎలా?

కరోనా నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పక పాటి స్తాం. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాం. వారికి పూర్తిగా సూచనలు, సలహాలు అందించాము. రివైజ్డ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా పోలింగ్‌బూత్‌లో శానిటైజర్లు, మాస్కుల వాడకం తప్పనిసరి. అలాగే భౌతికదూరం అన్నది అతి ముఖ్యమైనది. పోలింగ్‌కు ముందురోజు వరకు ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఈ మేరకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించబోతున్నాము. ఓటరుకు కరోనా ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తాం. లేదంటే చివరిగంటలో ఓటు వేసేలా అవకాశం కల్పిస్తాం.

సమావేశాలు, సభల నిర్వహణలో రాజకీయ పక్షాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాజకీయ పార్టీలు నడుచుకోవాలి. ఎవరైనా కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయి. సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలంటే తప్పకుండా అనుమతులు తీసుకోవాలి. సమావేశాలు నిర్వహించుకునే రాజకీయ పార్టీలు కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా ప్రతి ఒక్కరినీ చెక్‌ చేయాలి. మాస్కులు, శానిటైజర్లు వాడాలి. భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి. కొవిడ్‌-19 నిబంధనలు పాటించకపోతే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు?

ఉప ఎన్నికకు మూడు రాజకీయ పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అమలు చేసేందుకు మండల స్థాయిలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, ఫ్లైయింగ్‌ స్కాడ్స్‌ను నియమించాం. నియోజకవర్గస్థాయిలో 9 స్టాటిక్‌ సర్వేలైన్స్‌ టీములు ఏర్పాటు చేశాము. ఎన్నికల ఖర్చులపై పర్యవేక్షణకు అకౌంటింగ్‌ టీమ్‌లను రంగంలోకి దించాము. ఏ రాజకీయ పార్టీలైనా క్యాంపులు పెట్టడానికి వీల్లేదు. ఇదీ ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. ఫిర్యాదులు వస్తే కఠినచర్యలుంటాయి. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఉపఎన్నికకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాము. 08462 - 220183 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేయవచ్చు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటుహక్కు వినియోగించుకునే వారికి మీరిచ్చే సలహాలు, సూచనలు?

ఇతర ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగానికి తేడా ఉంటుంది. ఈ ఎన్నికల్లో స్వస్తిక్‌ ఉండదు. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థుల పేర్ల వద్ద 1, 2, 3 అంకెలను ప్రాధాన్యతను సూచిస్తూ ఓటు వేయాల్సి ఉంటుంది. టిక్కులు కొట్టడం, సంతకాలు చేయడం, పేర్లు రాయడం వంటివి చేస్తే ఆ ఓటు పనికి రాదు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా మొత్తం 824 మంది ఓటర్లున్నారు. వీరికి ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించబోతున్నాం.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా, రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల వద్ద నిఘా ఏర్పాటు చేశాము. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులతోపాటుగా పొరుగు జిల్లాల సరిహద్దుల వద్ద ఉపఎన్నిక నేపథ్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా మొత్తం 5 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాము. వీటిలో నిజామాబాద్‌ జిల్లాలో మూడు, కామారెడ్డి జిల్లాలో రెండు చెక్‌పోస్టులు ఉన్నాయి.