ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Sep 27, 2020 , 02:13:34

పకడ్బందీగా ఎన్నికలకోడ్‌ అమలు

పకడ్బందీగా ఎన్నికలకోడ్‌ అమలు

  • lప్రచారానికి అభ్యర్థితోపాటు  ఐదుగురికి అనుమతి
  • lయంత్రాంగానికి ఎన్నికల అధికారి,     కలెక్టర్‌ నారాయణరెడ్డి  సూచన

ఇందూరు : శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులు నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. నిజామాబాద్‌లోని ప్రగతిభవన్‌లో పోలీసు అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ టీమ్‌ల నోడల్‌ అధికారులతో సమీక్షాసమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని అన్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లు, మున్సిపాల్టీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉప ఎన్నిక బరిలో టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి ఉన్నారన్నారు.  ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుమతి లేదన్నారు. ఎంసీసీ, ఎన్‌ఫోర్స్‌మెం ట్‌, స్టాటిస్టికల్‌, వీడియో సర్వైవల్‌, ఖర్చుల పర్యవేక్షణ స్కాడ్‌, ఫ్లయింగ్‌ స్కాడ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ టీమ్‌లకు నియమితులైన నోడల్‌ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరియల్‌ విధులను పకడ్బందీగా నిర్వర్తించాలన్నారు. 

సిబ్బంది కొవిడ్‌ నిబంధనలను పాటించేలా వైద్యాధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. ప్రతి మండలానికి పీహెచ్‌సీ వైద్యాధికారిని, డివిజన్‌కు డిప్యూటీ డీఎంహెచ్‌వోను, జిల్లాకు డీఎంహెచ్‌వోను నోడల్‌ అధికారిగా నియమించామని తెలిపారు.

ప్రతి మండలానికి ఎంసీసీ టీమ్‌ నోడల్‌ అధికారిగా ఎంపీడీవో, ఫ్లయింగ్‌ స్కాడ్‌  నోడల్‌ అధికారిగా తహసీల్దార్‌ వ్యవహరిస్తారని తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంట ర్‌ నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రచారం నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థితో ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. 

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్త్తికేయ మాట్లాడుతూ.. సరిహద్దుల్లోని చెక్‌పోస్టు ల్లో తనిఖీలను మరింత పటిష్టం చేస్తామన్నారు. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని అ న్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎలక్షన్‌ ప్రొటోకాల్‌ పాటించడం జరుగుతుందని, ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటుతో నిరంతర నిఘా ఉంటుందన్నారు.  కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ లత, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఉమ్మడి జిల్లాల రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎక్సైజ్‌, రవాణాశాఖల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

అభ్యర్థులు, నాయకులు కొవిడ్‌ నిబంధనలతోపాటు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఎన్నికల అధికారి నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశమయ్యారు. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, పార్టీ పేరు ఉంటుందని, పార్టీ సింబల్‌ ఉండదన్నారు. ఓటరు అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. వదంతులకు తావివ్వొవద్దని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.  మోడల్‌ కోడ్‌ను ఉల్లంఘిస్తూ సోషల్‌ మీడియాలో మెస్సేజ్‌లు పెడితే చర్యలు తప్పవని అన్నారు. వెంటనే విచారణ చేపట్టి కేసులు నమోదుచేస్తామన్నారు. సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌ను పర్యవేక్షించడానికి నిజామాబాద్‌ సీపీ, కామారెడ్డి ఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు.సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీవో సింహాచలం, ఏవో సుదర్శన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo