గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Sep 27, 2020 , 02:13:47

ప్రతిపక్షాల ఉనికి పాట్లు!

ప్రతిపక్షాల ఉనికి పాట్లు!

  • lస్థానిక సంస్థల ఎమ్మెల్సీ     ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ ఆరాటం
  • lకనీస మెజార్టీ  లేకున్నా బరిలోకి..
  • lరోజురోజుకూ తగ్గుతున్న జాతీయ   పార్టీల సంఖ్యాబలం
  • lకల్వకుంట్ల కవితకు పెరుగుతున్న  అన్ని వర్గాల మద్దతు
  • lఉప ఎన్నికల తేదీల ఖరారుతో   టీఆర్‌ఎస్‌లో కొంగొత్త హుషారు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడుతోన్న భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌కు శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో మరోసారి ఓటమి ఖాయంగా కనిపిస్తున్నది. పేరుకు జాతీయ పార్టీలైనప్పటికీ స్థానిక సంస్థల్లో కనీస బలాన్ని కైవసం చేసుకోలేక పోయాయి. 2019లో వరుసగా జరిగిన స్థానిక పోరులో గులాబీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌లలో అత్యధిక స్థానాలను దక్కించుకుని మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పీఠాలపై గులాబీ జెండాను ఎగుర వేసింది. అలాగే మున్సిపాల్టీల్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌కు స్థానిక సంస్థల్లో మెండుగా బలం చేకూరింది. కాంగ్రెస్‌, బీజేపీలకు అందనంత ఎత్తుకు స్థానిక సంస్థల సీట్లను గులాబీ పార్టీ పొందగలిగింది. ఇప్పుడా కోటాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సంఖ్యాబలం లేకున్నా పోటీకి దిగిన జాతీయ పార్టీలకు మరోమారు ఓటమి ఖాయమే. ఉమ్మడి జిల్లాలో ప్రాభవా న్ని కోల్పోతున్న కాంగ్రెస్‌, బీజేపీలు ఉనికి కోసం ఉప ఎన్నిక బరిలో నిలిచి పడరాని పాట్లు పడాల్సి వస్తుండటం విశేషం.

పరువు కోసం పాకులాట..

పేరుకు జాతీయ పార్టీలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజల నుంచి దక్కుతున్న మద్దతు కొంతే. కేవలం క్రియాశీల కార్యకర్తలను మినహాయిస్తే సామాన్య ప్రజలెవ్వరూ జాతీయ పార్టీల నైజాన్ని నమ్మడం లేదు. 2018 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి 2020 ప్రారంభంలో ముగిసిన మున్సిపాలిటీ పోరు దాక వచ్చిన ఫలితాలే దీనిని తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లో కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదులంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతుల్లో వరుసగా ఓటమి చెందుతూనే ఉన్నారు. కామారెడ్డి నుంచి షబ్బీర్‌ అలీ, బోధన్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి కనీసం ప్రజల్లో సానుభూతిని పొందలేకపోయారు. ఇక బీజేపీ  పరిస్థితి సైతం అదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోటీకి నా యకులు లేక పంచాయతీ ఎన్నికల్లో, పరిషత్‌ పోరులో ఆపసోపాలు పడింది. ఉభయ జిల్లాల్లో సగానికిపైగా ఎంపీటీసీ స్థానాల్లో నిలిపేందుకు కాషాయ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసినప్పటికీ కామారెడ్డి జిల్లాలో ఒక్క స్థానాన్ని గెలువలేక పోయింది. నిజామాబాద్‌ జిల్లాలో రెండేసి సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ అందులో ఒక్కొక్క జడ్పీటీసీ సభ్యుడు ఇప్పటికే కారెక్కేశారు. కార్పొరేషన్‌, మున్సిపాల్టీ ఎన్నికల్లోనూ అన్ని పీఠాలను గులాబీ పార్టీయే గెలుచుకుని జైత్రయాత్రను కొనసాగించగా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది.

యంత్రాంగం కసరత్తు మొదలు..

ఏడు నెలల విరామం అనంతరం వెలువడిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో ఉభయ జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. అక్టోబర్‌ 9న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధులందరూ కలిపితే 824 మంది ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాను సైతం ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్ల వారీగా అధికారులు ప్రచురించారు. తాజాగా కొవిడ్‌-19 మార్గదర్శకాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో తీసుకున్న జాగ్రత్తలు, ప్రణాళికలన్నీ మారిపోనున్నాయి. భౌతికదూరం తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఉండటంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో పోలింగ్‌ కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు మండలానికి ఒక పోలింగ్‌ కేంద్రంతోపాటు మున్సిపాల్టీ ఏరియాలో అదనంగా మరో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నందున ఉభయ జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు.


logo