గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Sep 27, 2020 , 02:13:48

ఆన్‌లైన్‌ తరగతులకు విశేష స్పందన

ఆన్‌లైన్‌ తరగతులకు విశేష స్పందన

  • lటీ శాట్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యాబోధన
  • l కామారెడ్డి జిల్లాలో డిజిటల్‌ తరగతులు వింటున్న 60,174 మంది విద్యార్థులు 

విద్యానగర్‌ : కరోనా నేపథ్యం లో ఐదు నెలల కాలంగా పాఠశాలలు తెరుచుకోలేదు. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల ప్రభావంతో విద్యావిధానంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యాబోధనను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించింది. దీనికి విశేష స్పందన లభిస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో ఉన్న మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు దూరదర్శన్‌, టీ శాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 66 వేల మంది విద్యార్థులు ఉండగా.. 60,174 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలను వింటున్నారు. దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా 51,435 మంది, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా 5,590, గ్రామ పంచాయతీల్లోని టీవీల ద్వారా 3,149 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలను వింటున్నారు. 

డిజిటల్‌ తరగతుల నిర్వహణపై సూచనలు..

డిజిటల్‌ తరగతులపై జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల, లోకల్‌ బాడీ పాఠశాలలు, కేజీబీవీలు, ట్రైబల్‌, గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పలు సూచనలు, సలహాలను అందజేశారు. ప్రతి విద్యార్థి రీసోర్స్‌ మ్యాపింగ్‌, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవడం తదితర ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు 92 శాతం మంది విద్యార్థులకు టీవీ అందుబాటులో ఉందని సర్వే రిపోర్టుల్లో తేలాయి. టీవీ అందుబాటులో లేని వారికి తరగతి ఉపాధ్యాయుడి అలాట్‌మెంట్‌ సోర్స్‌ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులను ఎంతమంది వింటున్నారనే రిపోర్టును ప్రతి రోజూ ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు పంపుతున్నారు. ఈ నెల ఒకటి నుంచి 14వ తేదీ వరకు మొదటి షెడ్యూల్‌ పూర్తయిందని, 14 నుంచి 28వ తేదీ వరకు రెండో షెడ్యూల్‌ కొనసాగనుందని డీఈవో రాజు తెలిపారు. మూడో షెడ్యూల్‌ వివరాలు నేడు లేదా రేపు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

సందేహాల నివృత్తికి ప్రత్యేక నంబర్లు..  

ఆన్‌లైన్‌లో పాఠాలు విన్న విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫోన్‌ నంబర్ల (040-23540 326, 040-23540726, 18004254039)ను ఏర్పాటు చేసింది. 8,9,10వ తరగతి విద్యార్థులు ప్రతి శనివారం (రెండో శనివారం, పబ్లిక్‌ హాలీడే తప్ప) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఆయా సబ్జెక్టులోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గణితంలో సందేహాల నివృత్తి కోసం ఉదయం 11 నుంచి 11.30 వరకు, 11.30 నుంచి 12 గంటల వరకు భౌతిక శాస్త్రం, 12 నుంచి 12.30 వరకు జీవశాస్త్రం,12.30 నుంచి ఒంటి గంట వరకు సాంఘిక శాస్త్రంలో విదార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. 

తరగతులు వినేలా చర్యలు చేపడుతున్నాం..

విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ తరగతులు వినేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి రోజూ గ్రామాల్లోని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న తీరును పరిశీలిస్తున్నాం. పాఠ్యాంశాల్లో వారి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు పలు సూచనలు చేస్తున్నాం. విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతున్నది. 

- రాజు, డీఈవో, కామారెడ్డి  logo