గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Sep 26, 2020 , 02:05:34

కరోనా కష్టకాలాన్ని అధిగమిస్తూనే బతుకు పోరాటం

కరోనా కష్టకాలాన్ని అధిగమిస్తూనే బతుకు పోరాటం

  • lమాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరంతో జాగ్రత్తలు
  • lఎవరి పనిలో వారు నిమగ్నం 
  • lసాధారణ పరిస్థితుల్లోకి జనజీవనం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కంటికి కనిపించని కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని నేటికీ వణికిస్తున్నది. సమాజానికి కొంగొత్త అనుభవాలను నేర్పిన మహమ్మారి... రోజురోజుకూ విస్తరిస్తూనే జనజీవనాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నది. వైరస్‌ విస్తృతి పెరిగిన తొలి రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ తలుపులు మూసుకున్నాయి. దాదాపుగా లాక్‌డౌన్‌ పేరుతో ఎక్కడి వారు అక్కడే అన్నచందంగా సమస్తం స్తంభింప జేశారు. వైరస్‌ విస్తృతిని అడ్డుకునేందుకు జనసంచారాన్ని నిలువరించారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను నిలిపేశారు. ఒకటేమిటి అనేకానేక జాగ్రత్తలు తీసుకోవడంతో ఆర్థిక రంగం అస్తవ్యస్తమైంది. పేద, మధ్యతరగతి వర్గాలైతే రోడ్డున పడే దుస్థితికి చేరింది. కరోనాకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని గ్రహించిన దరిమిలా అన్‌లాక్‌ ప్రక్రియ భారతదేశంలో అమలవుతూ వస్తున్నది. మూతపడిన వ్యవస్థలన్నీ ఒక్కోటి తెరుచుకుంటూ ప్రస్తుతం జనజీవన చక్రం తిరిగి ప్రారంభమైంది. కరోనా వైరస్‌ మాత్రం మన నుంచి వెళ్లక పోయినప్పటికీ ప్రభుత్వాలు చెప్పినట్లుగా ప్రజలంతా సహజీవనం చేస్తూ తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుండడం విశేషం.

స్వచ్ఛంద బంద్‌ నుంచి జాగ్రత్తలు...

మొదట్లో కరోనా కేసులు పట్టణాలు, నగరాలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలసలతో విస్తరించింది. క్రమేణా విదేశాల నుంచి వచ్చిన వారితోనూ వైరస్‌ ఇతరులకు అంటుకుంది. ఐసొలేషన్‌, క్వారంటైన్‌ పాటించినప్పటికీ మహమ్మారి విస్తృతి మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. జన సంచారం పెరుగుతున్న క్రమంలోనే వైరస్‌ అందరినీ చుట్టు ముట్టింది. క్రమేణా అర్బన్‌ ఏరియా నుంచి వైరస్‌ గ్రామాలను చుట్టుముట్టడం మొదలవ్వడంతో ఎక్కడికక్కడే ప్రజలంతా స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు, బంద్‌లు పాటించారు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేకపోవడంతో ఆయా వర్గాలు తమ ప్రయత్నాలను విరమించుకుని జాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌ను ఎదుర్కొంటున్నారు. ఎవరికి వారు భౌతికదూరం పాటించడం, ని త్యం శానిటైజర్లు వాడడం, మాస్కులు ధరించ డం వంటివి తప్పనిసరిగా పాటిస్తూ కరో నా బారిన పడకుండా ఎవరికి వారు అప్రమత్తంగా జీవనం సాగిస్తున్నా రు. బయటి ప్రాంతాల్లో కలియ తిరుగుతున్న సందర్భాల్లోనూ అపరిచితులతో జాగ్రత్తగా మెసులుకుంటున్నారు.

బస్సులు, రైళ్లు రయ్‌ రయ్‌..

అన్‌లాక్‌ అమలైన తొలి రోజుల్లో ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వలేదు. పరిస్థితి మెల్లిగా కుదుట పడిన తర్వాత ఆర్టీసీ బస్సులు, రైళ్లు తిప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు రైళ్లు, బస్సులు  రయ్‌ మంటూ దూసుకు పోతున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ప్రజా రవాణాకు సిద్ధమైనప్పటికీ మొదట్లో ఎవరూ బస్సెక్కి ప్రయాణం చేసే సాహసం చేయలేకపోయారు. దీంతో బస్సులు వెలవెల బోయాయి. ఆర్టీసీ నిత్యం నష్టాలను మూట గట్టుకుంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి క్రమంగా బస్సుల్లో ప్రజా రవాణా పెరిగింది. ఫర్వాలేదు అన్నట్లుగా ఆదాయం సమకూరుతున్నది. దూర ప్రయాణాలకు చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు రద్దీతో నడుస్తున్నాయి. నిజామాబాద్‌ - వరంగల్‌ సర్వీసుల్లో ఆక్యుపెన్సీ రోజురోజుకూ పెరుగుతున్నది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు రాకపోకలు విపరీతంగా పెరిగాయి. కొద్ది మంది సొంత వాహనాలను వినియోగిస్తుండగా మరికొంత మంది రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు చేసేది లేక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. రద్దీ పెరుగుతుండడంతో రోడ్డు రవాణా సంస్థ జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.

రెస్టారెంట్లు, దాబాల్లో రద్దీ...

లాక్‌డౌన్‌ అనంతర కాలంలో మూసేసిన అన్ని రంగాలు తెరుచుకోవడంతో అనేక మంది వినోదం, విందు కోసం తహతహలాడుతున్నారు. ఆరు నెలలుగా చేతులు కట్టేసుకుని కూర్చున్న వారంతా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మొన్నటి వరకూ టిఫిన్‌ సెంటర్లు, మెస్‌లు, రెస్టారెంట్లు మూతపడి కనిపించాయి. ఆయా పనుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి, గ్రామాలకు వచ్చి వెళ్లే వారు ఆకలిని తీర్చు కునేందుకు మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత హోటళ్లకు వెళ్లాలంటేనే చాలామంది భయపడగా ఇప్పుడు ఎక్కడా భయమే కనిపించడం లేదు. ఇక రెస్టారెంట్లు, దాబాలు రద్దీగా మారుతున్నాయంటే నమ్మశక్యం కాదు. నెల రోజుల క్రితం వరకు ఈ ప్రాంతాల్లో నిలబడాలంటేనే జంకే దుస్థితి ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని ఆరగిస్తున్నారు. మరికొందరైతే అందుబాటులో ఉన్నటువంటి ఆన్‌లైన్‌ సర్వీసులను వినియోగించుకుంటూ ఇంట్లోనే బయటి వంటకాలను కుటుంబంతో సహా ఆస్వాదిస్తున్నారు. 


logo