ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Sep 25, 2020 , 02:28:32

జయహో కేసీఆర్‌

జయహో కేసీఆర్‌

  • నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా భారీ ట్రాక్టర్ల ర్యాలీ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నూతన రెవెన్యూ చట్టానికి అన్నదాతల నుంచి అద్భుత స్పందన లభిస్తున్నది. చట్టానికి మద్ధతు తెలుపుతూ కర్షకులు కదం తొక్కుతున్నారు. సీఎం కేసీఆర్‌ కృషిని గుర్తు చేసుకుంటూ భారీ ప్రదర్శనను నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది రైతన్నలు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ ట్రాక్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. వందలాదిగా ట్రాక్టర్లు కిలో మీటర్ల మేర బారులు తీరగా నిజామాబాద్‌ - కరీంనగర్‌ ప్రధాన రహదారి గులాబీమయంగా మారింది. అడుగడుగునా సీఎం కేసీఆర్‌కు రైతన్నలు జేజేలు పలికారు. పలు చోట్ల సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి వేముల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాల రైతులు భారీ ప్రదర్శనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ట్రాక్టర్లను నడుపుకుంటూ, భుజంపై ఆకుపచ్చ కండువా ధరించి అన్నదాతలంతా ఆనందంగా ముందుకు సాగారు. గడిచిన కొన్నేండ్లుగా పాత రెవెన్యూ వ్యవస్థలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ పీడ విరగడ కావడంతో వారంతా సంబురం వ్యక్తం చేయడం విశేషం.

12 కిలో మీటర్ల భారీ ర్యాలీ.. 

ట్రాక్టర్ల ర్యాలీతో బాల్కొండ నియోజకవర్గం దద్దరిల్లింది. నూతన రెవెన్యూ చట్టం తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వహించిన ప్రదర్శన కు రైతులు పోటెత్తారు. స్వచ్ఛందంగా తమ ట్రాక్టర్లకు కేసీఆర్‌ చిత్రపటాలతో దారి పొడవునా సీఎం కృషిని కీర్తిస్తూ ఆనందంగా ముందుకు సాగారు. వందలాది ట్రాక్టర్లతో నిజామాబాద్‌ - కరీంనగర్‌ ప్రధాన రహదారి గులాబీమయంగా మారింది. బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, వేల్పూర్‌, భీమ్‌గల్‌, ఏర్గట్ల, మెండోరా మండలాలకు చెందిన వారంతా ట్రాక్టర్లతో కదం తొక్కారు. ఆయా మండలాల నుంచి ఉదయం 10గంటలకు మోర్తాడ్‌ ఎక్స్‌ రోడ్డుకు చేరుకున్నారు. క్రమపద్ధతిలో ట్రాక్టర్లను వరుసలో నిలబెట్టి వేల్పూర్‌ వరకు ముందుకు సాగారు. 12 కిలో మీటర్ల మేర నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది. నూతన రెవెన్యూ చట్టంతో చేకూరబోతున్న ప్రయోజనాన్ని గ్రహించిన రైతులెంతో మంది భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రైతుల బాధలను తీర్చేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు కర్షకులు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. తమ అభిమానా న్ని భారీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో వేలాది మంది రైతులు తండోపతండాలుగా తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు జేజేలు పలికారు. మోర్తాడ్‌ మం డల కేంద్రం నుంచి మంత్రి వేముల స్వగ్రామమైన వేల్పూర్‌ మండల కేంద్రంలోని ఎక్స్‌ రోడ్డు వరకు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ సాగింది. 

సర్వత్రా మద్దతు...

వానకాలం అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన నూతన రెవెన్యూ చట్టానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.  ముఖ్యంగా రైతులు ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూముల యజమానుల  పేర్లు మార్పిడి, సాగు భూముల వివరాలు ఎక్కించడానికి వారు ఎదుర్కొన్న పాట్లు, రెవెన్యూ అధికారుల మూలంగా నిర్లక్ష్యానికి గురైన తీరుతో విసుగు చెందారు. నూతన చట్టంతో అవినీతి, అక్రమాలకు తావు లేకపోవడంతో భారీ ఊరట పొందుతున్నారు. జయహో కేసీఆర్‌ అంటూ నినదిస్తూ రైతులు తమ అభిమానాన్ని చాటి చెప్పారు. బాల్కొండ నియోజకవర్గం మొత్తం కర్షకుల ర్యాలీతో సందడిగా మారింది. ప్రధాన రహదారి వెంట ఎటు చూసినా సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి వేముల చిత్రపటాలే దర్శనం ఇచ్చాయి. పలు కూడళ్ల వద్ద రైతులు ఇరువురి ఫొటోలకు క్షీరాభిషేకంతో అభిమానాన్ని చాటారు.logo