మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Sep 24, 2020 , 01:38:59

యాసంగికి ఢోకా లేదు

యాసంగికి ఢోకా లేదు

  • n నిజాంసాగర్‌లోకి  కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
  • n ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు 
  • n ఆరు టీఎంసీలకు చేరువలో నీటి మట్టం 
  • n నిండుకుండలా  సింగూరు ప్రాజెక్టు

నిజాంసాగర్‌: మంజీర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వారం రోజుల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టు నీటి మట్టం ఆరు టీఎంసీలకు చేరువైంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజీర ఎగువ ప్రాంతంలో వర్షాలు లేక మూడేండ్లుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి  ఇన్‌ఫ్లో లేకపోవడంతో నిరాశలో ఉన్న ఆయకట్టు రైతులు ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌ నుంచి అలీసాగర్‌ వరకు ఉన్న 1.85 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఇక యాసంగికి ఎలాంటి ఢోకా లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2016లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా,  ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదు. 2017లో ప్రాజెక్టులోకి 4 టీఎంసీల నీరు రావడంతో యాసంగి పంటలను సాగు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి  ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నిరాశలో ఉన్న ఆయకట్టు రైతులకు వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఊపిరిపోసినట్లయింది.  

ముందుగానే యాసంగి

నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద గల ఆయకట్టులో నిజాంసాగర్‌, బాన్సువాడ,  బీర్కుర్‌, నస్రుల్లాబాద్‌ మండలాలు మొదటి ఆయకట్టు కింద ఉండగా ఈ ప్రాంత రైతులు కేవలం నిజాంసాగర్‌ పైనే ఆధారపడి పంటలను సాగు చేస్తారు. మిగిలిన ప్రాంతాలకు చెందిన రైతులకు నిజాంసాగర్‌తో పాటు బోరుబావులు ఆధారం. మొదటి విడుత ఆయకట్టు రైతులు మాత్రం కేవలం నిజాంసాగర్‌ పైనే ఆధారపడి ఉన్నారు. ఈ ఏడు  ఎన్నడూ లేని విధంగా ముందుగానే పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 5.85 టీఎంసీల నీరు నిలువ ఉండడం ప్రాజెక్టులోకి 3736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో యాసంగి పంటలకు ఢోకా లేదనే భరోసాతో యాసంగి పంటల సాగుకు శ్రీకారం చుట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. 

నిండుకుండలా సింగూరు

నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా పిలిచే  సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలకు  19.429 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఎగువ భాగం నుంచి ప్రాజెక్టులోకి 8,245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న  నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. 

దీనికి తోడు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సైతం ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి మ ట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, రెండు ప్రా జెక్టుల్లో నీటి నిలువలు ఉండడంతో ఈ ఏడాది యా సంగిలో ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగు కానుంది.

సింగూరు ప్రాజెక్టు : సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 523.600 మీటర్లు(29.917 టీఎంసీలు) కాగా

ప్రస్తుతం 521.350 మీటర్ల (19.429 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.


logo