శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Sep 22, 2020 , 02:14:37

నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి

నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి

  • పశువైద్య, పశు సంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌  లక్ష్మారెడ్డి

నిజామాబాద్‌ సిటీ: ఈ నెల 15 నుంచి 26  వరకు నిర్వహించే గొర్రెలు, మేక పిల్లలకు పీపీఆర్‌ వ్యాధి నివా రణ టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పశువైద్య, పశు సంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌ ఎల్‌ లక్ష్మారెడ్డి అధికారులకు  సూచిం చారు. సోమవారం జిల్లా పశు, వైద్య సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం,  ఉపాధి హామీ పథకంలో గొర్రెలు, మేకలకు పాకల నిర్మాణం, ఏక, బహు వార్షిక పశు గ్రాసాల సాగు, నీటి తొట్టెల నిర్మాణం, పశువులలో సోకే ముద్దచర్మ వ్యాధి నివారణ తదితర అంశాలపై జిల్లా సంచాలకుడు డాక్టర్‌ ఎల్లన్నను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా మండల పశు వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం గొర్రె, మేక పిల్లలకు టీకాలు వేశారు. సమావేశంలో సహాయ సంచాలకుడు డాక్టర్‌ బాలిక్‌ అహ్మద్‌, డాక్టర్‌ ఖైసర్‌ అహ్మద్‌, డాక్టర్‌ నసీర్‌ అహ్మద్‌, డాక్టర్‌ సచిన్‌ దేశ్‌పాండే, పశు వైద్యాధికారులు  పాల్గొన్నారు.  

గొల్ల, కుర్మల సంక్షేమానికి కృషి

డిచ్‌పల్లి : గొల్ల, కుర్మల జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశువైద్య, పశు సంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని నడ్పల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు  పీపీఆర్‌ వ్యాధి నివారణ టీకాల శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 15 నుంచి 26 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వ్యాధి నివారణ టీకాల శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.  ఈ అవకాశాన్ని  సద్వినియోగపర్చుకోవాలని సూచించారు.  డిసెంబర్‌లో గాలికుంటు నివారణ టీకాలను వేస్తామన్నారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ సతీశ్‌, మండల ప్రజాపరిషత్‌ ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు, మండల కుర్మ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌, గ్రామ అధ్యక్షుడు మల్లయ్య, గొల్ల, కుర్మ కులస్తులు పాల్గొన్నారు. 

జీవాలకు నట్టల నివారణ టీకాలు

జక్రాన్‌పల్లి:  పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  చేపట్టిన గొర్రె, మేకలకు నట్టల నివారణ టీకాల కార్యక్రమం మండలంలోని పలు గ్రామాల్లో మూడో రోజూ కొనసాగింది. ఇందులో భాగంగా సోమవారం  బ్రాహ్మణపల్లి, తొర్లికొండ గ్రామాల్లో పశువైద్య సిబ్బంది జీవాలకు టీకాలు వేసిట్లు  మండల పశు వైద్యురాలు శిరీష తెలిపారు.