శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Sep 21, 2020 , 03:25:19

రాష్ట్రంలో నిర్మాణాత్మక అభివృద్ధికి కృషి

రాష్ట్రంలో నిర్మాణాత్మక అభివృద్ధికి కృషి

నిజామాబాద్‌ సిటీ: రాష్ట్రంలో 50 ఏండ్లుగా  జరుగని విధంగా ఐదేండ్లలోనే  నిర్మాణాత్మకమైన అభివృద్ధి, మార్పునకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి ప్రశంసనీయమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఐదు శాతం అటవీ విస్తీర్ణం పెరిగి దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలోకి రాబోతున్నదని తెలిపారు. కరోనా కేసుల రికవరీలో రాష్ట్రం ముందున్నదని  చెప్పారు. జడ్పీ కార్యాలయంలో ఆదివారం నాల్గో సర్వసభ్య సమావేశం చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన నిర్వహించారు.ముఖ్యఅతిథిగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొన్నటి వరకు 24శాతం గ్రీన్‌ కవరేజీ ఉండగా.. ఈ ఐదేండ్లలో నాలుగున్నర శాతం పెరిగిందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గ్రీన్‌ కవరేజీ పెరుగలేదని, ఇదే స్ఫూర్తితో మూడేండ్లు పనిచేస్తే  మరో పదిశాతం అడవుల విస్తీర్ణం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నా రు. కరోనా విషయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారని, దీంతో జిల్లాలో కరోనా రికవరీ రేటు బాగా పెరిగిందన్నారు.  అన్ని పీహెచ్‌సీల్లో  సుమారు వందకు పైగా ఐసొలేషన్‌ కిట్లు అం దుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కిట్లు లేకపోతే వెంటనే కలెక్టర్‌, జిల్లా వైద్యశాఖ అధికారికి సమాచారం అందిస్తే వెంటనే ఏర్పాటు చేస్తారని తెలిపారు. జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో గాంధీ దవాఖాన తర్వాత మన జిల్లా దవాఖానలో కొవిడ్‌ రోగులకు అన్ని మందులు, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ బారినపడిన గర్భిణులను జాగ్రత్తగా చూసుకొని మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌కు సూచించారు. రాష్ట్రంలో ఒక్క గ్రామంలోనూ  ఫ్లోరైడ్‌ నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి ప్రకటించిందని, ఇది కేవలం మిషన్‌ భగీరథ ద్వారానే సాధ్యమైందని గుర్తుచేశారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్‌తోపాటు ఇతర ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని, కాలువల ద్వారా అన్ని గ్రామాలకూ సాగునీరు అందిస్తామని తెలిపారు. ఏటా వానకాలం సీజన్‌లో 70 శాతం దొడ్డురకం వరి వేసేవారని, ఈ సారి 30 శాతం దొడ్డురకం, 70 శాతం సన్నరకం సాగుచేయడం అభినందనీయమని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని, దీంతో గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. జిల్లా అభి వృద్ధిలో అందరూ భాగస్వా ములు కావాలని కోరారు. 

ఇందూరు : ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పట్టణ, పల్లె ప్రగతిలో రాష్ట్రంలోనే నిజామాబాద్‌ జిల్లా రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఆదివారం ఆయన జడ్పీ కార్యాలయంలో పలు అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణంలో లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు తెలిపారు. విలేజ్‌ పార్కుల నిర్మాణం అద్భుతంగా జరుగుతోందన్నారు. ప్రజామరుగుదొడ్లు, ఓపెన్‌ జిమ్‌, ప్లాంటేషన్‌ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పంటల సాగునీటికి ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 5 టీఎంసీల నీరు రావడంతో ఇబ్బందులు తప్పాయన్నారు. సోయా కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారని చెప్పారు. కొవిడ్‌ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందుతోందన్నారు.  ప్రజలు కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి  సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలన్నారు.