శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Sep 21, 2020 , 03:17:09

అత్యవసరం నుంచి ఆఖరి మజిలీ దాకా...

అత్యవసరం నుంచి ఆఖరి మజిలీ దాకా...

  • బాల్కొండ నియోజకవర్గానికి ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్స్‌
  • మంత్రి వేముల సొంతఖర్చుతో అందుబాటులోకి..
  • ఇప్పటికే సేవలందిస్తున్న వైకుంఠరథం, ఫ్రీజర్లు
  • ఐదేండ్లలో వైకుంఠరథంపై రూ.30 లక్షల నిర్వహణ ఖర్చు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మనిషి పుట్టుకకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో... చనిపోయిన తర్వాత నిర్వహించే కార్యక్రమాలకూ అదేస్థాయి ప్రాముఖ్యత ఉంటుంది. రక్తం పంచుకుపుట్టిన వారితోపాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు.. మృతిచెందినవారిని గుర్తుచేసుకుంటూ ఆఖరిమజిలీలో సాగనంపుతారు. పట్టణాలు, నగరాల్లో వైకుంఠరథాలు అందుబాటులోకి రావడంతో చివరి మజిలీని చక్కగా నిర్వహించుకునే సౌకర్యం ఏర్పిడింది. గ్రామాల్లోనూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలువాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఐదేండ్ల క్రితమే వైకుంఠరథాన్ని బాల్కొండ నియోజకవర్గ ప్రజల కోసం వితరణ చేశారు. నియోజకవర్గంలోని ఏ మూల నుంచి ఫోన్‌ వచ్చినా వైకుంఠరథం అక్కడకు చేరుకుంటుంది. దీంతో ఆఖరి మజిలీని చక్కగా నిర్వహిస్తున్నారు. వైకుంఠరథం నిర్వహణ, ఖర్చులను సైతం మంత్రి సొంతంగా భరిస్తున్నారు. వందలాది మందికి సేవలందించిన వైకుంఠరథం సరసన మంత్రి వేముల ఔదార్యంతో అధునాతన అంబులెన్స్‌ సైతం వచ్చి చేరింది.  

చిన్న ఆలోచన... పెద్ద ప్రయోజనం...

ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభణతో ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు. కనిపించని శత్రువుతో రాష్ట్ర ప్రభుత్వం సైతం తీవ్ర పోరాటం చేస్తున్నది. పేద ప్రజలకు సకల వైద్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఏదైనా చేయాలని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జూలై 24న ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు మేలు చేకూర్చే ఆలోచనతో ఐక్యంగా ముందడుగు వేశారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆయా నియోజకవర్గాలకు అంబులెన్సులను సమకూర్చాలని మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా అధునాతన అంబులెన్స్‌ను బాల్కొండ నియోజకవర్గానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆపత్కాలంలో ఈ వాహనం సేవలు అందించనుంది. 

ఆఖరి మజిలీని గౌరవప్రదంగా నిర్వహించేలా..

తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి స్మారకార్థం మంత్రి అందజేసిన వైకుంఠరథం.. ఐదేండ్లలో నియోజకవర్గంలో సేవలందించని గ్రామమంటూ లేదు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆఖరి మజిలీని నిర్వహించేలా రూపొందించిన ఈ వాహనం ఎక్కడి నుంచి ఫోన్‌ వచ్చినా వెంటనే బాధితుల ఇంటివద్దకు చేరుకుంటుంది. రూపాయి ఖర్చు లేకుండానే గౌరవంగా కార్యక్రమాలు నిర్వహించి ఆ కుటుంబానికి సాంత్వన చేకూరుస్తోంది. వాహనానికి డీజిల్‌తోపాటు డ్రైవర్‌ వేతనం, నిర్వహణ ఖర్చు మొత్తం మంత్రి ప్రశాంత్‌రెడ్డి సొంతంగా భరిస్తున్నారు. ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు నిర్వహణ రూపంలో ఖర్చు చేశారంటే ప్రజలకు ఏమేర సేవలందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.  

నాలుగు ఫ్రీజర్ల వితరణ..

సంపన్న కుటుంబాలకు చెందినవారు మృతి చెందితే పార్థీవ దేహాన్ని బంధుగణం వచ్చేంత వరకు ఫ్రీజర్‌లో ఉంచుతారు. అలాంటి సౌకర్యం పేదలకు లేకపోవడంతో సన్నిహితులు, బంధువులు చాలామంది చివరిచూపు దక్కలేదని బాధపడతారు. ఇలాంటివారి  బాధలు మంత్రి ప్రశాంత్‌రెడ్డి చొరవతో తీరిపోయాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రభుత్వ దవాఖానలకు ఫ్రీజర్లను తన సొంత ఖర్చుతో అందించారు. నియోజకవర్గంలో ఉపాధి కోసం గల్ఫ్‌ బాటపట్టినవారు చాలామంది ఉన్నారు. వారి రక్తంపంచుకు పుట్టినవారు దురదృష్టవశాత్తు ఎవరైనా మృతిచెందితే విదేశాల నుంచి వచ్చి కడసారి దర్శించుకునే భాగ్యం కల్పించారు.  

కేటీఆర్‌ స్ఫూర్తితో.. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్సును ప్రారంభించిన మంత్రి వేముల 

వేల్పూర్‌:  మంత్రి కేటీఆర్‌ తన సొంత  సిరిసిల్ల జిల్లాకు అంబులెన్సులను సమకూర్చడం తనలో స్ఫూర్తిని కలిగించిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదిన కానుకగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కింద రూ.20లక్షల50వేలతో తాను అందజేసిన అంబులెన్స్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదివారం వేల్పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకోసం అంబులెన్సును అందజేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని అన్నారు.  డీఎంహెచ్‌వో, 108, వేల్పూర్‌లోని తన కార్యాలయంలో సంప్రదిస్తే వెంటనే అంబులెన్సు సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, డీఎంహెచ్‌వో సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌, ఆరోగ్య కేంద్రం వైద్యుడు అశోక్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.

ప్రజల అవసరాన్ని గుర్తించి నాన్న వేముల సురేందర్‌ రెడ్డి స్మారకార్థం వైకుంఠరథాన్ని, ఆ తర్వాత నాలుగు ఫ్రీజర్లను అందించాను. ఇప్పుడు రూ.20.50 లక్షలతో అంబులెన్సును ప్రజల ముంగిటకు తీసుకు వచ్చాను. ఆపత్కాలంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటాను. వారికి సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తున్నది. -వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రిlogo