గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Sep 20, 2020 , 03:04:28

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

మెండోరా : నిజామాబాద్‌ జిల్లాలోని ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నదని డీఈ జగదీశ్‌ తెలిపారు. శనివారం ఉదయం 1,46, 874 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో 32 గేట్లు ఎత్తి లక్షా 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలినట్లు చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు లక్షా 14వేల 838 క్యూసెక్కులకు తగ్గుతుండడంతో 24 గేట్ల నుంచి 75 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదిలామన్నారు. ఎస్కేప్‌ గేట్ల నుంచి 8 వేల క్యూసెక్కులు గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి 1,14,838 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నదని డీఈ వివరించారు. కాకతీయ కాలువకు రెండు వేలు, వరద కాలువకు 10,371, సరస్వతీ కాలువకు 400, లక్ష్మీ కాలువకు 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్‌ నుంచి అవుట్‌ఫ్లోగా 96,874 క్యూసెక్కులు పోతున్నదన్నారు. ఈ సీజన్‌లో ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 129.89 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చి చేరిందని డీఈ వివరించారు. గోదావరిలోకి 34.96 టీఎంసీలను  వదిలినట్లు చెప్పారు.

గోదావరికి వరద ఉధృతి

రెంజల్‌ : మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో మన రాష్ట్రంలోని రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరికి వరద ఉధృతి పెరిగింది. శనివారం ఉప్పొంగి ప్రవహిసున్నది. మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేపట్టడంతో కందకుర్తి గోదావరి, మంజీర, హరిద్రా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. నదిలో ఉన్న పురాతన శివాలయం శిఖరం రెండు అంచుల వరకు నీరు చేరితే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం నిండినట్లు అధికారుల అంచనా. శివాలయం శిఖరం మునగక పై నుంచి రెండు ఫీట్ల ఎత్తున వరద ప్రవహిస్తున్నది. ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో  సందర్శకులను అనుమతించడంలేదు. అక్కడి పరిస్థితులను రెంజల్‌ ఎస్సై రాఘవేందర్‌ పర్యవేక్షిస్తున్నారు.


logo