శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Sep 20, 2020 , 03:03:27

అండగా ఉంటూ.. ఆకలి తీరుస్తూ..

అండగా ఉంటూ.. ఆకలి తీరుస్తూ..

  • lజాగృతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం
  • lజిల్లా కేంద్ర దవాఖానతోపాటు ఆర్మూర్‌, బోధన్‌లో అమలు
  • lనాణ్యమైన భోజనం, రోజువారీ మెనూలో మార్పులు
  • lకరోనా కష్టకాలంలోనూ వేలాదిమంది కార్మికుల  ఆకలితీర్చిన జాగృతి వ్యవస్థాపకురాలు కవిత

ఖలీల్‌వాడి:వైద్య సేవల కోసం వచ్చే నిరుపేదలతోపాటు వారి వెంట వచ్చిన సహాయకుల ఆకలి తీరుస్తున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా కడుపునిండా భోజనం అందిస్తున్నారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కవిత. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానతోపాటు ఆర్మూర్‌,బోధన్‌ ప్రభుత్వ దవాఖానలకు వచ్చే నిరుపేదలకు కడుపునిండా భోజనం పెడుతున్నారు. జిల్లా కేంద్ర దవాఖానలో నాలుగేండ్ల క్రితం ఆమె నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిరోజూ వేలాది మందికి నాణ్యమైన భోజనం అందిస్తుండగా, రోజువారీ మెనూలో తాజాగా కొత్త వంటకాలను చేర్చారు. వడ్డించేవారికి సైతం డ్రెస్‌కోడ్‌ అమలుచేస్తుండడం విశేషం. నాణ్యమైన భోజనం అందించడానికి ఆమె ఎప్పటికప్పుడు జాగృతి నాయకులతో చర్చిస్తున్నారు. రోజువారీ మెనూతోపాటు బుధవారం పులిహోర, శనివారం మినుప వడ, ఆదివారం క్యారెట్‌ హ ల్వా అదనంగా అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించగా ఎక్కడకూడా ఆహారం దొరకని పరిస్థితుల్లో నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా పేదల ఆకలితీర్చారు. 

365 రోజులూ అన్నదానం

ఆకలితో ఉన్న పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ కవిత 2017 నవంబర్‌ 8వ తేదీన జిల్లా దవాఖానలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా కేంద్ర దవాఖానతోపాటు బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వ దవాఖానల్లోనూ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోధన్‌లో 2018 ఏప్రిల్‌ 25న, ఆర్మూర్‌లో జూలై 5న, జిల్లా గ్రంథాలయంలో చదువుకునే  విద్యార్థులు, నిరుద్యోగుల కోసం అన్నదానం కార్యక్రమాన్ని జూలై 15 ప్రారంభించిన ఆమె తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇలా నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. కరోనా కష్టకాలంలో కార్మికులకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆమె జాగృతి ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారికి భరోసాను ఇస్తున్నారు. వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 

ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటారు..

రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనుఉన్నానంటూ ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి కవిత. ఆమె ఆదేశాల మేరకు నిత్యాన్నదాన కార్యక్రమం సన్న బియ్యంతోపాటు వివిధ కూరగాయలతో నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. అదనంగా పులిహోర, మినుప వడ, క్యారెట్‌ హల్వా ఇస్తున్నాం . దవాఖానకు వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి కవితక్కను ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటి వరకు ఎక్కడా నిర్వహించలేదని చెప్పవచ్చు.

         -అవంతిరావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు  


logo