శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Sep 19, 2020 , 02:21:11

కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వ కానుక

కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వ కానుక

  • lఉభయ జిల్లాలకు చేరుకుంటున్న బతుకమ్మ చీరెలు
  • lపది డిజైన్లు, పది విభిన్న  రంగుల్లో సరికొత్తగా తయారీ
  • lఉభయ జిల్లాలో 8లక్షల  మంది మహిళలకు  పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు  
  • lకామారెడ్డిలో 3.45లక్షలు,  నిజామాబాద్‌లో   4.48 లక్షల మంది అర్హులు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  మన రాష్ట్రంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని, సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సర్కారు కొనసాగిస్తున్నది. ఆడపడుచులకు అందించే సారెను సర్కారే ముందుండి ఇస్తున్నది. పెద్ద మనసుతో రూ. వందల కోట్లు ఖర్చు చేసి మహిళల కోసం చీరెలను పంపిణీ చేసింది. వాస్తవానికి ఆడబిడ్డకు చీరె పెట్టడమనేది తెలంగాణ సంస్కృతిలో భాగంగా చూస్తారు. ఇప్పటి వరకు పుట్టంటి వాళ్లు మాత్రమే ఆడబిడ్డను పిలిచి చీరె పెట్టేవాళ్లు. ఇప్పుడు ఆ బాధ్యతను కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్నది.  బతుకమ్మ అంటేనే ఆడబిడ్డను సత్కరించుకోవడం కాబట్టి ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూసేందుకు... వాళ్లను గౌరవించుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కులమతాలకు అతీతంగా అందరికీ బతుకమ్మ చీరెలను అందిస్తుండడంతో ప్రభుత్వాన్ని మహిళలంతా  అభినందిస్తున్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడడంతో పాటు చేనేత కుటుంబాలకు చేయూతను అందించేందుకు సర్కారు తీసుకున్న ఈ వి నూత్న విధానం అందరి మెప్పు పొందుతుండడం విశేషం. కరోనా వంటి కష్టకాలంలోనూ బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు సర్కారు రెడీ అయ్యింది.

ఆడబిడ్డలకు సత్కారం..

రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ, బోనాల పండుగలను సీఎం కేసీఆర్‌ అధికారికంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగలుగా గుర్తించి వాటికి సంబంధించిన ఏర్పాట్లను సర్కారే వైభవంగా నిర్వహిస్తున్నది.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిలువుటద్దం లాంటి బతుకమ్మ అంటే ఆడబిడ్డలకు ఉత్సాహం నింపే పండుగ.  ఆటాపాటలతో, కోలాహలంగా సాగే పూల పండుగ రోజు ఆడబిడ్డలకు సర్కారు తరఫున చీరెలను కానుకల రూపంలో అందించే కార్యక్రమం  2017 నుంచి మొదలైంది. వరుసగా నాలుగోసారి ఈ కార్యక్రమం జో రుగా నిర్వహించేందుకు  సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సిరిసిల్ల చేనేత మగ్గాలపై కోట్లాది మీటర్ల అందమైన రంగుల్లో, భిన్నమైన డిజైన్లలో చీరెలు రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మ ఉత్సవానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో చీరెల పంపిణీకి  శ్రీకారం చుట్టేందుకు ఉభయ జిల్లాల యంత్రాంగం సన్నద్ధం అవుతున్నది. 

కరోనా కష్ట కాలంలోనూ...

యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్నది. భారతదేశంలోనూ రోజురోజుకూ లక్షల్లో కేసులు నమోదు అవుతున్న విపత్కర స్థితిలోనూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెలను ఆపడం లేదు. కరోనా సాకును చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు బ్రేక్‌ వేస్తున్న ది. రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను నిలిపేసి రాజకీయం చేస్తున్న  సమయంలోనూ సీఎం కేసీఆర్‌ మాత్రం తెలంగాణ ఆడబిడ్డల పండుగకు ఏ లోటు లేకుండా జరగాలని నిర్ణయించారు. చీరెలను బతుకమ్మ పండుగకు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందించడానికి కోటి చీరెలు అవసరం కాగా వీటి తయారీ ఇప్పటికే పూర్తి అయినట్లుగా తెలుస్తున్నది. సిరిసిల్ల మరమగ్గాలపై బతుకమ్మ చీరెల తయారీ చురుకుగా కొనసాగించారు. అక్కడ తయారైన వాటిని ప్రాసెసింగ్‌ పూర్తి చేసి జిల్లాలకు ఇప్పటికే రవాణా చేస్తున్నారు. వచ్చే నెలలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతలోపే చీరెలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది.  ఈ సారి కూడా బతుకమ్మ చీరెలను రెండు సైజుల్లో తీర్చిదిద్దారు. 6.3 మీటర్లు, 9 మీటర్ల చీరెలు అందుబాటులోకి తెచ్చారు. 6.3 మీటర్ల చీరెలో జాకెట్‌ 80 సెంటీ మీటర్లుగా ఉంటుంది. 

ఉభయ జిల్లాల్లో 8లక్షల మంది మహిళలకు...

బతుకమ్మ చీరెలు ఉభయ జిల్లాలకు చేరుకుంటున్నాయి. నిజామాబాద్‌ జిల్లాకు 4లక్షల 48వేల చీరెలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 3లక్షల 25వేల చీరెలు జిల్లాకు చేరుకోగా  ఆయా రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో నిల్వ చేశారు. కామారెడ్డి జిల్లాకు 3లక్షల 45వేల 248 మందికి చీరెలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను 2లక్షల 10వేల చీరెలు జిల్లాకు వచ్చేశాయి. నియోజకవర్గ కేంద్రాల్లో గోదాములు అందుబాటు లో లేకపోవడంతో మండల కేంద్రాల్లోని ఐకేపీ భవనాల్లో బతుకమ్మ చీరెలను భద్రపరిచారు. చీరెలు పాడవకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నారు. నాలుగైదు రోజుల్లోనే నిజామాబాద్‌ జిల్లాకు రావాల్సిన 1.59 లక్షల చీరెలు, కామారెడ్డి జిల్లాకు 1.35లక్షల చీరెలు సైతం చేరుకోనున్నాయి. ఉభయ జిల్లాల్లో మొత్తం 8లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నారు. 

విభిన్న రూపాల్లో చీరెలు..

నాలుగో ఏడాది బతుకమ్మ చీరెల పంపిణీని కొనసాగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన యువతులతో పాటుగా మహిళలందరికీ చీరెలను బతుకమ్మ సారెగా సర్కారు తరపున అందిస్తున్నారు.  ఖర్చు ఎంతైనా నాణ్యమైన చీరెలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నది. మూడేండ్లుగా  వీటి ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడంతో పాటుగా చేనేత కార్మికులకు రోజంతా పని లభించేలా చర్యలు చేపట్టింది. సిరిసిల్లలోని వందలాది మంది చేనేత కుటుంబాల జీవితాల్లో బతుకమ్మ చీరెల తయారీ వెలుగులు నింపుతున్నది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో దసరా పండుగకు ముందే ఇటు చేనేత కార్మికులు, మరోవైపు తెలంగాణ ఆడబిడ్డలందరూ సంతోషం వ్యక్తం చేస్తుండడం విశేషం. ముచ్చటగా నాలుగోసారి అమలవుతున్న బతుకమ్మ చీరెలను వినూత్న డిజైన్లలో రూపొందించారు. విభిన్న రంగుల్లో వీటిని తయారు చేయడమే కాకుండా అనేక రకాల డిజైన్లను జోడించారు. వందకు పైగా భిన్నమైన రీతుల్లో బతుకమ్మ చీరెలు యావత్‌ తెలంగాణ మహిళాలోకాన్ని ఆకర్షిస్తున్నాయి.

త్వరలోనే బతుకమ్మ చీరెల పంపిణీ...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఏటా రాష్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఉండేందుకు ఆడపడుచులు అందరికీ సారె కింద చీరెలు పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిశ్చయించారు.   3.41 లక్షల చీరెలను ఇప్పటి వరకు జిల్లాకు చేరాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనేపంపిణీ చేస్తాం.

- ఎం.శ్రీనివాస్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, నిజామాబాద్‌