బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Sep 17, 2020 , 02:53:05

చెక్కు చెదరని ‘పోచారం’

చెక్కు చెదరని ‘పోచారం’

  •  ప్రాజెక్టు నిర్మించి 102 ఏండ్లు
  •  రైతుల పాలిట వరంలా జలాశయం
  •  రెండు జిల్లాల వారధి పోచారం బ్రిడ్జి

నాగిరెడ్డిపేట్‌ : నూట రెండేండ్లు దాటినా చెక్కు చెదరకుండా పోచారం ప్రాజెక్టు నిర్మాణం ఇంజినీరింగ్‌ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. మంజీర నదికి ఉప నది అయిన ఆలేరు వాగుపై నిజాం ప్రభుత్వం 1916 నుంచి 1918 వరకు ప్రాజెక్టు నిర్మించింది. ఆనాటి నుంచి నేటి వరకు వానకాలం, యాసంగి రెండు పంటలకు ఈ పోచారం జలాశయం సాగునీరు అందిస్తోంది. సాగునీటితోపాటు తాగునీరు అందిస్తోంది. అప్పట్లోనే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు నీరందించేలా రూపకల్పన చేయడం ఇంజినీర్ల పనితీరుకు అద్దం పడుతోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి రెండు మండలాలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. కామారెడ్డి జిల్లాలోని ఎగవ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట్‌, గుండారం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగానే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుంది. నాగిరెడ్డిపెట్‌ మండలంతోపాటు ఎల్లారెడ్డి మండలం కలిపి 18వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. 13 కాలువల ద్వారా పంటలకు నీరందుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు (1464 ఎంసీఎఫ్‌టీ) ఉంది.

రెండు జిల్లాల సరిహద్దులో నిర్మాణం

రెండు జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు నిర్మితమైంది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి మండలాలకు నీరందిస్తూ మెదక్‌ జిల్లాలోని బుర్గుపల్లి, వాడి, రాజిపేట్‌ గ్రామాలకు బోరుబావులకు పోచారం నీళ్లే ఆధారం. పోచారం ప్రాజెక్టు నిండిన తరువాత పొంగి ప్రవహించిన నీరు వృథా కాకుండా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వెళ్లే విధంగా రూప కల్పన చేశారు. రెండు జిల్లాలకు సరిహద్దులో నిర్మించిన జలాశయం ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు రెండు పంటలకు నీరందిస్తోంది. మెదక్‌ జిల్లా ఘన్‌పూర్‌ కెనాల్‌ నుంచి పోచారం ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. అప్పట్లో కేవలం, డంగుసున్నం, రాయితో ప్రాజెక్టు నిర్మించారు. 102 సంవత్సరాలు దాటినా నేటికీ చెక్కు చెదరకుండా ఇంజినీరింగ్‌ అధ్భుతానికి మచ్చుతునకగా నిలుస్తోంది.  

అద్భుత ఇంజినీరింగ్‌ నైపుణ్యం

పోచారం ప్రాజెక్టు అద్భుత ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కామారెడ్డి  మెదక్‌ జిల్లాలను కలుపుతూ ప్రాజెక్టుకు అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. నిత్యం వందలాది వాహనాలు ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. 18 ఏండ్ల క్రితం 

మావోయిస్టుల బాంబుదాడిని ఎదుర్కొని ప్రాజెక్టు చెక్కు చెదరకుండా నిలబడగలిగింది. పటిష్టమైన నిర్మాణం కావడంతోనే ఇప్పటికీ ఎలాంటి పగుళ్లు లేకుండా ప్రాజెక్టు దృఢంగా ఉందని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

కట్టి పడేసే ప్రాజెక్టు అందాలు

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగానే నీరు మత్తడి దూకుతుంది. ప్రాజెక్టు అందాలను తిలకించడానికి ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జాలువారుతున్న నీటిలో జలకాలాడుతూ సరదాగా గడుపుతారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రాజెక్టు జలసవ్వడులను ఆస్వాదిస్తుంటారు. కామారెడ్డి జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్‌, నర్సాపూర్‌, రామాయంపేట్‌, తుప్రాన్‌, చేగుంట, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల సందడితో ప్రాజెక్టు మినీ పిక్నిక్‌ స్పాట్‌గా మారుతుంది. ప్రాజెక్టు మొత్తం కలియదిరిగి కొత్త అనుభూతికి లోనవుతుంటారు. ఇక్కడి అందాలను తమ సెల్‌ కెమెరాలో బంధించి తమ మిత్రులతో పంచుకొని సంబురపడుతుంటారు. 


logo