మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nizamabad - Sep 16, 2020 , 03:10:54

‘పథకాలను సద్వినియోగం చేసుకుంటే స్వర్ణయుగమే’

‘పథకాలను సద్వినియోగం చేసుకుంటే స్వర్ణయుగమే’

  • - ప్రణాళికాబద్ధంగా  గ్రామాల అభివృద్ధి జరగాలి
  • - కలెక్టర్‌ నారాయణరెడ్డి

ధర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధ్ది చేసుకోవాలనుకునే వారికిది స్వర్ణయుగమని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ వద్ద ఎకరం స్థలంలో ప్రకృతివనం ఏర్పాటులో భాగంగా మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఆర్మూర్‌ పెద్ద బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  కలెక్టర్‌ నారాయణరెడ్డి.. జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఎంపీపీ నల్ల సారికారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. పల్లె ప్రకృతివనాల ఏర్పాటు చాలా మంచి కార్యక్రమమని అన్నారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందించాలని పేర్కొన్నారు. నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులను చేపట్టాలని అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా అభివృద్ధి పనులు చేపడితే కూలీలకు సైతం పనులు కల్పించిన వారవుతారని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వన సేవకులకు ఒక్క రోజుకు రూ.7 లక్షలు చెల్లిస్తున్నామని అన్నారు. సాకులు చెప్పకుండా ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధ్ది చేసుకోవాలని సూచించారు. అనంతరం దుబ్బాక రోడ్డులో కొనసాగుతున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలతో మాట్లాడారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డీవో రవి, రైతు బంధుసమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్‌ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కే.నవీన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ చిన్నారెడ్డి, ఎంపీడీవో నటరాజ్‌, ఎంపీటీసీలు సుజావుద్దీన్‌, పెండ గంగాధర్‌, శేఖర్‌, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. 

డైనమిక్‌ సీఎం కేసీఆర్‌

దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను అమలు చేస్తున్న డైనమిక్‌ సీఎం కేసీఆర్‌ అని జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ అన్నారు. డైనమిక్‌ కలెక్టర్‌ను జిల్లాకు కేటాయించారని, ఆయన సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు           చేపడతామన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజా ప్రతినిధులకు ఎంతో సహకరిస్తున్నారని, రూరల్‌ నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని అన్నారు.


logo