బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nizamabad - Sep 16, 2020 , 03:10:55

ఉభయ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం

ఉభయ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ వానలు మరోమారు దంచికొట్టాయి. ఉభయ జిల్లాల వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. ఆదివారం జల్లులతో మొదలైన వాన సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఫలితంగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అనేక జలాశయాలు కొంగొత్త అందాలు సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతానికి మించి వానలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లాలోని రెండు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 27 మండలాల్లో సాధారణ వర్షపాతానికి ఎక్కువగానే వానలు పడ్డాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారి గేట్లు ఎత్తగా... నిజాంసాగర్‌ ప్రాజెక్టు మాత్రం వరద లేక బోసిపోతోంది. కామారెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. కళ్యాణి, సింగీతం, పోచారం, కౌలాస్‌ నాలా ప్రాజెక్టుల గేట్లు సైతం ఎత్తగా దిగువకు భారీగా వరద కొనసాగుతోంది. మూడు రోజులుగా కురిసిన వానలతో మంజీర నదిలో మరోమారు జలకళ ఉట్టిపడుతోంది.

ఒకే సీజన్‌లో రెండు సార్లు అలుగు

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌ ముగియక ముందే అనేక చోట్ల సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా వాన కురిసింది. ఆగస్టు మొదటి వారం నుంచి అందుకున్న వరుణుడు భారీ వానతో విజృంభించాడు. నెల రోజుల క్రితమే కురిసిన వానలతో సగానికి ఎక్కువ తటాకాలు నిండుకుండలా మారాయి. సెప్టెంబర్‌ నెల ప్రారంభంలో కనిపించని వరుణుడు ఆదివారం నుంచి వరుసగా ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షపాతంతో ఆయా మండలాల్లో చెరువులు, కుంటలు మత్తడి పారుతున్నాయి. ఒకే సీజన్‌లో వందలాది చెరువులు రెండు, మూడు సార్లు మత్తడి దుంకుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ మండలంలో అత్యధికంగా 10.7 సెంటీ మీటర్ల వాన కురిసింది. ఎల్లారెడ్డిలో 8.8, భిక్కనూరులో 8.7, బిచ్కుందలో 8.5, నాగిరెడ్డిపేటలో 8.3, మద్నూర్‌లో 8.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అత్యల్పంగా మాచారెడ్డిలో 1.3 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 3.0 సెంటీమీటర్లు వాన కురిసింది. కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా 14 మండలాల్లో సాధారణ వర్షపాతం రికాైర్డెంది. నిజామాబాద్‌ జిల్లాలో కోటగిరిలో 10 సెంటీ మీటర్లు, బోధన్‌లో 7.6, మోస్రా, ఎడపల్లిలో 6.5 సెంటీ మీటర్ల వాన కురిసింది. వర్ని, బాల్కొండలో లోటు వర్షపాతం కనిపిస్తోంది. 26 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

ఎస్సారెస్పీ కొత్త అందాలు

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాది గేట్లు తెరుచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి సెప్టెంబర్‌ రెండో వారానికే గేట్లు తెరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు అధికారుల అంచనాలకు భిన్నంగా మహారాష్ట్ర నుంచి వరద భారీగా రావడంతో సోమవారం నాలుగు గేట్లు ఎత్తారు. వరద ఉధృతి పెరగడంతో 26 గేట్లు ఎత్తి వరదను నియంత్రించారు. ఎస్సారెస్పీ గేట్ల నుంచి పాల పొంగులా ఎగిరి దుంకుతున్న జలాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ఉరకలు వేస్తూ వరద దిగువకు పరుగులు తీస్తోంది. కామారెడ్డి జిల్లాలోని మరో చారిత్రక ప్రాజెక్టు నిజాంసాగర్‌ మాత్రం నీళ్లు లేక బోసిపోతోంది. ఎగువ నుంచి వరద స్వల్పంగానే కొనసాగుతోంది. సింగూరు నుంచి వరద అంతగా రావడం లేదు. అంతో ఇంతో పోచారం ప్రాజెక్టు నుంచి మాత్రమే నిజాంసాగర్‌కు వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1240 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా ప్రస్తుతం 2.55 టీఎంసీలు నిల్వ ఉంది. 1405 అడుగుల నీటి మట్టానికి 1385 అడుగుల నీటి మట్టం ఉంది.

ఉప్పొంగిన కౌలాస్‌, కల్యాణి, సింగీతం, పోచారం

కామారెడ్డి జిల్లాలోని మధ్యతరహా జలాశయాలు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ఉప్పొంగాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానలతో వరద వస్తుండడంతో కౌలాస్‌ నాలా ఒకే సారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వరదను వదిలి పెట్టారు. 458 అడుగుల నీటి మట్టం ఉన్న కౌలాస్‌ నాలా ప్రాజెక్టులో 1.21 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అదే స్థాయిలో ఆరు గేట్ల ద్వారా ఔట్‌ ఫ్లోను కొనసాగిస్తున్నారు. కౌలాస్‌ ప్రాజెక్టు నుంచి వరద వదలడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్‌, పిట్లం మండలాల్లో జన జీవనానికి ఇబ్బందులు తలెత్తాయి. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకోగా ఈ సీజన్‌లో రెండో సారి గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు సైతం పూర్తి స్థాయి నీటి మట్టంతో సరికొత్త అందాలను సంతరించుకుంది. నెల రోజుల్లో మరోమారు మత్తడి పారింది. సింగీతం ప్రాజెక్టు సైతం గేట్లు ఎత్తి వస్తున్న వరదను వచ్చినట్లే దిగువకు పంపిస్తున్నారు. 663 క్యూసెక్కుల వరద పోటెత్తుతుండగా అదే స్థాయిలో మూడు గేట్లు ఎత్తి వరదను దిగువకు పంపుతున్నారు.logo