మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Sep 14, 2020 , 01:12:52

ఎస్సారెస్పీ, పోచారం ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ, పోచారం ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

మెండోరా /రెంజల్‌/నాగిరెడ్డిపేట : ఎగువ ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతా ల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 25,982 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు డీఈ జగదీశ్‌ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను యథాతథంగా అంతే స్థాయిలో కాలువలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. వరద కాలువకు 17,493 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మి కాలువకు 300, సరస్వతీ కాలువకు 600, అలీసాగర్‌కు 540, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగు తుందన్నారు. మిషన్‌ భగీరథ తాగు నీటి అవసరాల కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని, ఆవిరి, లీకేజీ రూపంలో 627 క్యూసెక్కులు పోతున్నదని డీఈ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1090.60 అడుగుల (88.61 టీఎంసీల)కు చేరిందన్నారు. 

త్రివేణి సంగమం వద్ద పెరిగిన నీటి మట్టం 

రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద నీటి మట్టం పెరిగింది. పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది.  

పోచారం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో  

నాగిరెడ్డిపేట్‌ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని ఇరిగేషన్‌ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం  కురవడంతో ప్రస్తుతం 377 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు. ప్రధాన కాలువ ద్వారా దిగువకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.   


logo