మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Sep 12, 2020 , 03:10:35

జయహో..

జయహో..

  • n నూతన రెవెన్యూ చట్టానికి శాసనసభ ఆమోదం
  • n అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని త్వరలోనే అమల్లోకి
  • n దశాబ్దాల గోసకు కొత్త చట్టంతో ఊరట
  • n ఇక నుంచి సేవల్లో పారదర్శకత, కచ్చితత్వం 
  • n వీఆర్వోలకు ఇతర శాఖల్లో విధులు కేటాయింపు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతుల పట్టాదారు పాస్‌బుక్కుల్లో భూముల వివరాల నమోదులో గతంలో అవకతవకలు.. తహసీల్‌ కార్యాలయాల్లో మితిమీరిన అవినీతి.. భూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డులు మాయం చేయ డం.. తక్కువ భూములను ఎక్కువ ఉన్నట్లుగా పట్టాలివ్వడం, ఎక్కువ భూములున్న వారికి తక్కువ భూములు చూపించడం వంటి ఘటనలు కోకొల్లలు. తమ చేతుల్లో ఉన్న అధికారాలను దుర్వినియోగం చేయడం ద్వారా రైతులకు ము ప్పుతిప్పలు పెట్టి రూ.లక్షలు వసూలు చేశారు. వీఆర్వో, తహసీల్దార్లు చేతులు కలిపి రియల్‌ వ్యాపారులతో, బడాబాబులతో చీకటి ఒప్పందాలతో అభంశుభం తెలియని కర్షకులకు కన్నీళ్లు తెప్పించారు. ఈ అక్రమ తంతును గమనించిన సీఎం కేసీఆర్‌ రెవెన్యూ ప్రక్షాళనకు పూనుకున్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థలకు మించి వీఆర్వోలతో సాగుతున్న అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట పడేలా కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. దీనికి పారదర్శకత, కచ్చితత్వం ఉండేలా అధునాతన సాంకేతికతను జోడించారు. బుధవారం అసెంబ్లీలో వీఆర్వోల రద్దు బిల్లు, నూతన రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టగా శుక్రవారం సుదీర్ఘ చర్చ తర్వాత ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆమోదం... ఆనందం...

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బి ల్లు శాసనసభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చలో శాసనసభ్యులందరూ తమ సలహాలు, సూచనలు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ దానిపై సమాధానాలు ఇచ్చారు. బిల్లులో పొందుపర్చిన అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. అనంతరం నూతన రెవె న్యూ బిల్లుకు సంబంధించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్కుల బిల్లు 2020, తెలంగాణ గ్రామ అధికారుల రద్దు బిల్లు 2020 ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లుగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఎలాంటి సవరణలు లేకుండానే కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొం దింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సర్కారు చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో తహసీల్‌ కార్యాలయాల్లో అవినీతి బట్టబయలైంది. అమాయకులైన రైతులను ముంచి అక్రమంగా రూ.కోట్లు సంపాదించడంతో ప్రక్షాళనకు మూడేండ్ల కిందటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి వెబ్‌సైట్‌ను అమలు చేయగా నూతన ప్రక్రియ సక్సెస్‌ కావడం విశేషం. ఇప్పుడీ వ్యవస్థనే అధునాతన రీతిలో అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో అమల్లోకి రానుంది.

త్వరలోనే కార్యరూపంలోకి...

ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల బదలాయింపు పెద్ద సమస్యగా ఉండేది. ఈ క్రమంలో ఒ కరి పేరిట పట్టా ఉండగా, కాస్తులో మరొకరు ఉండడంతో తగాదాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న వివాదమే అదునుగా పలువురు రెవెన్యూ అధికారులు తమ జేబులు నింపుకొని అక్రమాలకు పాల్పడడంతో ఆ వివాదం మరింత పెద్దదైన సందర్భాలున్నాయి. అసైన్‌మెంట్‌ భూములు, సర్వేలో సమస్యలు ఇలా భూ వివాదాలు కోకొల్లలు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లక్షలాది మంది రైతుల్లో ప్రతి ఒక్కరూ రెవెన్యూ అధికారులకు బాధితులుగా మారినవారే. ఏదో ఒక సందర్భంలో పాస్‌బుక్కుల్లో పేర్ల మార్పిడి, భూ వివరాల నమోదు, సర్వే నంబర్లను సరిచేయడం వంటి పనులతో వీఆర్వో, తహసీల్దార్ల చేతుల్లో బలైనవారే ఎక్కువ మంది ఉన్నారు. చివరకు రెవెన్యూ చిక్కులు ఎంతకు తీసుకెళ్లాయంటే హత్యలు, పరస్పర దాడులు, ఆత్మహ త్యల వరకు వెళ్లిన దాఖలాలు అనేకం. ఉమ్మడి కుటుంబాల్లో భూముల పంపకాల్లో రెవెన్యూ ఉద్యోగులు పెట్టిన చిచ్చు తీరని నష్టాలను సైతం మిగిల్చింది. ఇందుకు వందలాది ఘటనలు ఉదాహరణలుగా నిలిచినాయి.

పారదర్శకతకు పెద్దపీట...

కొత్త చట్టంలో సాంకేతికతకు పెద్ద పీట వేశారు. ప్రతీది ఆన్‌లైన్‌ చేయడం ద్వారా భూ రిజిస్ట్రేషన్‌ దగ్గర నుంచి మిగతా అన్ని రెవెన్యూ సేవలు సులువుగా అయ్యే విధంగా ధరణి వెబ్‌సైట్‌ను సైతం తీర్చిదిద్దుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 29 మండలాలు, కామారెడ్డి జిల్లాలో 22 మండలాలున్నాయి. నిజామాబాద్‌ నగరంలోని రెండు రెవెన్యూ అధికారులకు తప్ప మిగిలిన వారందరికీ పూర్తి స్థాయిలో తహసీల్దార్‌ అండ్‌ జాయింట్‌ రిజిస్ట్రార్‌ హోదాలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం దక్కినట్లే. ఇక నుంచి కేవలం నివాస స్థలాలు, ఇండ్ల రిజిస్ట్రేషన్లకే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్‌ కార్యాలయా ల్లో చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రెవెన్యూ శాఖలో పారదర్శకత పెరిగే అవకాశాలున్నాయి. నూతన చట్టంతో రెవెన్యూ శాఖలో అవినీతి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంకేతికంగా ఎలాంటి పొరపాట్లు చేసేందుకు అవకాశాలు లేవు. 


logo