శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Sep 12, 2020 , 03:10:37

విద్యా ప్రమాణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి ప్రశంసనీయం

విద్యా ప్రమాణాల అభివృద్ధికి  సీఎం కేసీఆర్‌ కృషి ప్రశంసనీయం

బోధన్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే రాష్ట్రంలో విద్యాభివృద్ధికి, విద్యారంగంలో నాణ్యతాప్రమాణాలను పెంచేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి ప్రశంసనీయమని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ అన్నారు. గురుకుల పాఠశాలల నిర్వహణ, సొంత భవనాల నిర్మాణం తదితర అంశాలపై అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదన్నారు. ఇంగ్ల్లిష్‌ మీడియంలో చదువుకోవాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేదిశగా రాష్ట్రంలో విద్యాప్రమాణాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 608 ఉండగా,  ఎన్ని పాఠశాలలకు నూతన భవనాలు మంజూరయ్యాయో తెలుపాలని సంబంధితశాఖ మంత్రిని షకీల్‌ కోరారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రైవేట్‌ భవనాల్లో కొనసాగుతున్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అద్దె చెల్లించాల్సి వస్తున్నదన్నారు. అద్దె భవనాల్లో సరైన వసతులు ఉండడం లేదన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలను కల్పిస్తున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని, దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ ఏడాది నుంచి రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ తరగతులను ప్రారంభిస్తున్నారా? లేదా? తెలుపాలని సంబంధిత శాఖ మంత్రిని ఎమ్మెల్యే షకీల్‌ కోరారు. 


logo