శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Sep 11, 2020 , 03:05:07

మిడ్‌మానేరుకు ఎస్సారెస్పీ జలాలు

మిడ్‌మానేరుకు ఎస్సారెస్పీ జలాలు

  • lవరద కాలువకు నీటివిడుదల 

మెండోరా: ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో నీటిని వృథా చేయకుండా మిడ్‌మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ముప్కాల్‌ శివారులోని వరద కాలువకు గురువారం నీటి విడుదలను ప్రారంభించారు. వరద కాలువ నుంచి నీటివిడుదల ఈ సీజనులో తొలిసారి కావడంతో ప్రాజెక్టు ఈఈ రామారావు, డీఈ జగదీశ్‌, ముప్కాల్‌ ఎంపీపీ సామపద్మ, జడ్పీటీసీ బద్దం నర్సవ్వ ముందుగా పూజలు చేశారు. అనంతరం వరద కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ రామారావు మాట్లాడుతూ..  మిడ్‌ మానేరుకు ఏడు టీఎంసీల నీటిని అందిస్తామని,  వరద కాలువ ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వరద కాలువకు 5,340 క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించి, సాయంత్రానికి 10,530 క్యూసెక్కులకు పెంచినట్లు తెలిపారు. అనంతరం ఎంపీపీ సామ పద్మ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించిన విధంగా రైతులు సకాలంలో పంటలు వేసుకోవడం కలిసివచ్చిందని అన్నారు. సీజన్‌ ప్రారంభంలోనే ఎస్సారెస్పీలోకి ఆశించినస్థాయిలో వరదలు వచ్చి నిండుకుండలా మారడం ఆనందంగా ఉందన్నారు. ఆయకట్టులో రెండు పంటలకూ ఢోకా లేదని రైతులు పూర్తిభరోసాతో ఉన్నారని తెలిపారు.