శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Sep 10, 2020 , 03:40:08

అదనపు కలెక్టర్‌ నగేశ్‌ కేరాఫ్‌ మెండోరా..!

అదనపు కలెక్టర్‌ నగేశ్‌  కేరాఫ్‌ మెండోరా..!

  • nవివరాలు సేకరిస్తున్న ఏసీబీ..
  • nనిజామాబాద్‌, కామారెడ్డి     జిల్లాల్లో చర్చనీయాంశం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ రాష్ట్రమంతటా రెవెన్యూ వ్యవస్థ అవినీతి ప్రక్షాళనపై జోరుగా చర్చ నడుస్తున్న తరుణంలోనే భారీ అవినీతి తిమింగళం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడం సంచల నం సృష్టిస్తోంది. వీఆర్వోలు, తహసీల్దార్ల అక్రమాలతో అపకీర్తిని మూటగట్టుకున్న రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే బిల్లును బుధవారం అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టారు. అదే సమయానికి మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఏకంగా రూ.కోటీ 20 లక్షల లంచం కేసులో రూ.40లక్షలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కడం రెవెన్యూ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ వ్యవహారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ చర్చనీయాంశమైంది. అదనపు కలెక్టర్‌ నగేశ్‌ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలోని ఓ గ్రామం కాగా, కొత్త జిల్లాల ఏ ర్పాటు సమయంలో కామారెడ్డి రెవెన్యూ డివిజన ల్‌ అధికారిగా పని చేయడంతో ఆ కోణంలో ఏసీ బీ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

వివాదాస్పద భూములకు  నాలా కన్వర్షన్‌

ఏసీబీకి చిక్కిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ నూతన జిల్లాల ఏర్పాటుకు  ముందు కామారెడ్డి ఆర్డీవోగా పని చేశారు. సుమారు రెండున్నరేండ్ల పాటు ఈ ప్రాంతంలోనే విధులు నిర్వర్తించాడు. ఈయన పని చేసిన సమయంలో కామారెడ్డి డివిజన్‌ పరిధిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

2016 అక్టోబర్‌ 11న నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి పట్టణ శివారు పాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఆ సమయంలో అనేక అక్రమ వెంచర్లు వెలిశాయి. అసైన్డ్‌ భూములకు అక్రమంగా పట్టాలు పుట్టుకొచ్చాయి. జిల్లా ఏర్పాటుతో కామారెడ్డి రూపురేఖలు మారే అవకాశాలు ఉండడంతో ఎడాపెడా వెంచర్లు వెలిశాయి. ఈ సమయంలో నాలా కన్వర్షన్ల కోసం కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రూ.లక్షలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఒక్కో నాలా కన్వర్షన్‌కు రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో రద్దు అవనున్న వీఆర్వో సంఘం నాయకుడితో పాటు పలువురు తహసీల్దార్ల పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 

ఏసీబీ ఆరా..

భారీ అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కిన మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ వ్యవహారంలో లోతైన విచారణ సాగుతోంది! ఇప్పటికే ఏక కాలంలో నగేశ్‌తో సంబంధాలు నెరపిన అధికారుల నివాసాల్లో, నగేశ్‌ ఫాంహౌస్‌తోపాటు సొంతింట్లో ఏసీబీ విస్తృతంగా శోధిస్తోంది. ఈ అవినీతి అధికారి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కావడంతో ఏసీబీ అధికారులు ఆయన సొంతూరులోనూ ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. అక్రమ సంపాదనతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే సమాచారాన్ని ఏసీబీ సేకరిస్తోంది. కామారెడ్డి ఆర్డీవోగా పని చేసిన సమయంలో ఈయన చేసిన అక్రమాలపైనా వివరాలు ఆరా తీస్తుండడంతో ఆయనతో కలిసి పని చేసిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం కావడం, రాజధాని హైదరాబాద్‌కు వంద కిలో మీటర్ల దూరంలోనే ఉండడంతో రెవెన్యూ అధికారులకు ఈ ప్రాంతం కలిసి వస్తోంది. కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో పని చేసిన అనేక మంది అక్రమాలకు సులువుగా అలవాటు పడుతున్నారు. 

ఒక్కో భూమికి డబుల్‌ పట్టాలు చేసి సామాన్యులకు విక్రయించే ముఠాలు ఉండడం, కబ్జాలు, అసైన్డ్‌ భూములు మాయం చేసిన దాఖలాలు అనేకం ఇక్కడ నెలకొనడంతో ఈ ప్రాం తంలో నిత్యం ఏదో ఒక వివాదాస్పద ఘటన వెలుగు చూస్తూనే ఉంది. కామారెడ్డి ఆర్డీవోగా 2017 ఫిబ్రవరి వరకు నగేశ్‌ పని చేశారు. ఆయన తర్వాత వచ్చిన అధికారులు సైతం ఇదే పంథాను కొనసాగించడం మూలంగా ఈ ప్రాంతంలో భూముల వ్యవహారం రచ్చరచ్చగా మారుతోంది.logo