మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Sep 09, 2020 , 02:25:20

పల్లె ప్రగతి పనులు సకాలంలో పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు సకాలంలో పూర్తి చేయాలి

  • డీఎల్‌పీవో నాగరాజు

నిజామాబాద్‌ రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని డీఎల్‌పీవో నాగరాజు సూచించారు. మంగళవారం ఆయన రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిజామాబాద్‌ రూరల్‌, మోపాల్‌ మండలాల్లోని జీపీ కార్యదర్శులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లుగానే  పల్లెప్రకృతి వనాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇంటి పన్ను వసూళ్లపై కార్యదర్శులు, కారోబార్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధిదీపాలు, వాటర్‌ వర్క్స్‌కు సంబంధించిన కరెంట్‌ బిల్లులను ప్రతినెలా సక్రమంగా చెల్లించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ఉమ్మడి మండలాల ఎంపీవోలు మధురిమ, ఎక్బాల్‌  పాల్గొన్నారు.

గ్రామాల్లో ‘వెంచర్ల’ వివరాలు సేకరించాలి

ధర్పల్లి : గ్రామాల్లోని కార్యదర్శులు ఎలాంటి అనుమతులు లేని రియల్‌ వెంచర్ల వివరాలు సేకరించాలని నిజామాబాద్‌ డీఎల్‌పీవో నాగరాజు సూచించారు. మంగళవారం ఆయన మండల కార్యాలయంలో ధర్పల్లి, సిరికొండ రెండు మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిన ‘ఎల్‌ఆర్‌ఎస్‌'పై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. కార్యదర్శులు గ్రామాల్లోని వెంచర్ల వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం డీఎల్‌పీవో నాగరాజును ఎంపీపీ నల్ల సారికారెడ్డి, ఎంపీడీవోలు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీడీవోలు నటరాజ్‌, లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, ఎంపీటీసీ షుజావుద్దీన్‌, మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ కృష్ణకుమారి, ఎంపీవో రాజేశ్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  logo