శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Sep 08, 2020 , 01:32:32

పౌష్టికాహార ప్రాధాన్యతను చాటే పోషణ మాసం

పౌష్టికాహార ప్రాధాన్యతను చాటే పోషణ మాసం

  • lఈ నెల 1 నుంచి 30 వరకు.. 
  • lఅంగన్‌వాడీ కేంద్రాల్లో  అవగాహన కార్యక్రమాలు
  • lజిల్లాలో ప్రారంభమైన  ‘పోషణ్‌ అభియాన్‌'

కోటగిరి : పోషకాల లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి తగిన ప్రొటీన్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతియేటా పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలో పోషణ మాసాన్ని సెప్టెంబర్‌ 1నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పోషకాలపై అవగాహన కల్పించడంతోపాటు వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో పెరటితోటల పెంపకం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనావ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా టీచర్లు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆయా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.  

పోషణ మాసంలో భాగంగా తీవ్ర పోషణలోపం(ఎస్‌ఏఎం), తక్కువ పోషణ లోపం(ఎంఏఎం) ఉన్న పిల్లలను గుర్తించాలి. అంగన్‌వాడీ టీచర్లు పెరటి తోటల పెంపకాన్ని ప్రాత్సహించాలి. పిల్లల్లో పోషణ లోపం గుర్తించడంలో భాగంగా వారి ఎత్తు, బరువును పరిశీలించాలి. చిన్నారులకు సంబంధించిన వివరాలను వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్‌కు రోజువారీగా సమాచారం అందించాలి. పోషణ్‌ అభియాన్‌లో భాగంగా ప్రతి గ్రామంలో పోషణలోపం ఉన్న పిల్లలను గుర్తించే పనిలో అంగన్‌వాడీ టీచర్లు నిమగ్నమయ్యారు. 

పోషణ లోపం గుర్తించడమిలా..

పిల్లల్లో పోషణ లోపాన్ని గుర్తించేందుకు ముందుగా వారి బరువు, ఎత్తును పరిశీలించాలి. కొలతలను కచ్చితంగా తెలుసుకునేందుకు సరైన యంత్రాలను ఉపయోగించాలి. పిల్లల జబ్బ చుట్టు కొలత చూడడం ద్వారా కూడా పోషణ లోపాన్ని గుర్తించవచ్చు. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో బరువు తూచే యంత్రం(సాల్టర్‌ స్కేల్‌), ఎత్తును కొలిచే పరికరం (ఇన్ఫాంటో మీటర్‌)ను ఏర్పాటు చేసుకోవాలి. చిన్నారుల జబ్బ చుట్టుకొలత 12.5 సెంటీమీటర్లు, ఆపైన ఉంటే పోషణలోపం లేనట్లుగా గుర్తించాలి. 12.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్లు ఉన్నట్లయితే పోషణ లోపం తక్కువ ఉన్నట్లుగా, 11.5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్లయితే పోషణ లోపం తీవ్రంగా ఉన్నదని గుర్తించాలి. పోషకాల లోపం ఉన్నవారు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఎదుగుదల మెరుగవుతుంది. కిశోర బాలికలు, గర్భిణుల బరువును కూడా తెలుసుకునేందుకు అనువైన పరికరాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలి. 

పెరటి తోటల పెంపకం..

పోషణ మాసంలో భాగంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పెరటి తోటల పెంపకాన్ని తప్పక చేపట్టాల్సి ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోపు పెరటితోటల పెంపకాన్ని ప్రారంభించాలి. స్థల సమస్య ఉన్నవారు టబ్బులు, బకెట్లలో తోటలను పెంచాలి. ఇంట్లో ఉండే వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా వినియోగించి ఆరోగ్యకరమైన కూరగాయలను పండించాలి. కరివేపాకు, గోంగూర, మెంతికూర, చుక్కకూర వంటి కూరగాయలను పెరట్లో సులువుగా పండించవచ్చు.