బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Sep 08, 2020 , 01:33:10

లాభాలు ‘పట్టు’

లాభాలు ‘పట్టు’

  • lసంప్రదాయ వ్యవసాయ  పద్ధతులు వీడి.. వాణిజ్య పంటలపై దృష్టి సారిస్తున్న రైతు
  • lఆదర్శంగా నిలుస్తున్న ధర్పల్లికి చెందిన రాజేశ్వర్‌

ధర్పల్లి : మూస ధోరణితో ప్పుడూ ఒకే రకమైన పంట వేసి లాభాలు రావడం లేదని, గిట్టుబాటు కావడం లేదని బాధపడేకన్నా భిన్నంగా ఏదైనా లాభం వచ్చే పంట వేయాలి లేదా ఇంకేదైనా చేయాలని ఆలోచించాడు. అతని ఆలోచనలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం వరి పంటలే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని అవగాహన కల్పిస్తుండడంతో పట్టు పంట వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మండలానికి వచ్చిన సెరికల్చర్‌ అధికారులను కలిసి మల్బరీ తోటల పెంపకం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. పట్టుదల ఉంటే కానిది లేదన్నట్లు అనుకున్నదే తడవుగా తన వ్యవసాయ క్షేత్రంలో మల్బరీ తోటను పెంచడం ప్రారంభించి మేలిమి పట్టును ఉత్పత్తి చేస్తూ.. లాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన పాలెం రాజేశ్వర్‌. 

రూ. 6 లక్షల పెట్టుబడితో..

రాజేశ్వర్‌ తనకున్న మూడెకరాల వ్యవసాయ క్ష్రేత్రంలో పట్టు పరిశ్రమ స్థాపన కోసం సుమారు రూ.ఆరు లక్షల వరకు పెట్టుపడి పెట్టాడు. పట్టు పరిశ్రమ అధికారుల సహకారంతో పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి 250 నుంచి 300 పట్టు పురుగుల గుడ్ల (డీఎఫ్‌ఎల్‌ఎస్‌)కు సరిపడా ప్రత్యేక షెడ్డును వేసి మల్బరీ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. దీనికి సంబంధించిన మల్బరీ తోటను ఎకరాకు ఒక్క యూనిట్‌గా పెంచుకుంటున్నాడు.

లాభాల పంట ‘పట్టు’...

పట్టు గూళ్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయిస్తారు. అక్కడ పట్టు గూళ్ల నాణ్యత బట్టి ధర చెల్లిస్తారు. బహిరంగ వేలం ద్వారానే పట్టు గూళ్ల విక్రయం జరుగుతుంది. 100 గుడ్లకు సుమారు 50 నుంచి 80 కేజీల పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. కేజీకి సుమారు రూ. 270 నుంచి రూ. 500 ధర పలుకుతుంది. కిలో పట్టు గూళ్లకు ప్రభుత్వం రూ. 75 రాయితీ అందిస్తున్నది. 250 గుడ్లను పెంచడం ద్వారా అంటే లక్షా 50 వేల పట్టు పురుగుల పెంపకం ద్వారా 1.50 కింటాళ్ల నుంచి 2 క్వింటాళ్ల వరకు పట్టు పంట చేతికందుతుంది. సుమారుగా నెలకు 40 నుంచి 50 వేల ఆదాయాన్ని గడించవచ్చు.   

పట్టు దశ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పట్టు పురుగుల పెంపకంలో పరిశుభ్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 100 పట్టు గుడ్లకు రూ. 750తో పాటు ప్రయాణఖర్చులు, వంద గుడ్లలో సుమారు 60 వేల పట్టు పురుగులు ఉంటాయి. వీటిని అతి సున్నితంగా పోషించాలి. పట్టు పురుగులను పెంచుతున్న షెడ్డులోకి ఎవరు వెళ్లాల్సి వచ్చినా.. తప్పకుండా వారి కాళ్లు, చేతులను బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన మంచి నీటితో కడుక్కొని వెళ్లాలి. పరిశుభ్రంగా షెడ్డులోకి వెళ్లి పట్టు పురుగుల పెరుగుదలను పరిశీలించడం, వాటికి దాణాను పరిశీలించడం, నరికిన (ఫ్రూనింగ్‌) మల్బరీ మొక్కలను వాటికి వేయడం చేయాలి. టన్నుల కొద్దీ మల్బరీ మొక్కల్ని తిన్న పట్టు పురుగులు గూళ్ల దశకు వచ్చే సరికి వాటికి చంద్రిక (గూళ్లు కట్టుకునే రంధ్రాలు గల ప్లాస్టిక్‌ మ్యాట్‌)లను వేయాలి. వీటిలోకి పట్టు పురుగులు వెళ్లి గూళ్లను అల్లుతాడయి. 30 నుంచి 35 రోజుల్లో పట్టు పురుగుల పంట ఇలా చేతికందుతుంది.  

మల్బరీ తోట సాగువిధానం.. 

పట్టు పురుగులకు కావాల్సిన దాణ అయిన మల్బరీ మొక్కలను పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సూచనల మేరకు పట్టు పరిశ్రమను స్థాపించిన ఇతర జిల్లాల రైతుల నుంచి తీసుకువచ్చాడు. ముందుగా మొక్కలను నర్సరీలో పెంచాడు. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత చదరం మూడు ఫీట్ల దూరం పద్ధతిలో ఎకరానికి మొత్తం 5500 మొక్కలు నాటాడు. అనంతరం వాటికి డ్రిప్‌ పైపులను బిగించాడు. డ్రిప్‌ ద్వారా ప్రతి రోజూ మొక్కలకు నీరు పట్టిస్తున్నాడు. ఈ పంట మొదటిసారి అయితే 80 నుంచి 90 రోజుల వ్యవధిలో చేతికందుతుంది. తర్వాత 45 రోజుల నుంచి 50 రోజులకో పంట వస్తుంది. దీని ప్రకారం పట్టు పెంపకం చేపట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి నాటిన మల్బరీ మొక్క 15 సంవత్సరాల వరకు మల్బరీ పంటను ఇస్తుంది. ఒక్కసారి నాటితే 15 సంవత్సరాల వరకు వాటి కొమ్మలను వంతుల వారీగా పట్టు పురుగులకు మేతగా వాడుకోవచ్చు. పంటను సాగు చేసేందుకు రాజేశ్వర్‌, అతడి తండ్రి, కుటుంబసభ్యులు కలిసి కృషి చేస్తున్నారు. మల్బరీ మొక్కలను పశువులు తినవు. దీంతో వాటికి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా లేదు. 

ప్రభుత్వం ప్రొత్సాహం అందించాలి..

ప్రభుత్వం పట్టు పరిశ్రమ నిర్వహణకు ప్రోత్సాహకాన్ని అందించాలి. పట్టు పరిశ్రమను నెలకొల్పే ముందు బాగా ఆలోచించా. కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. షెడ్డుకు ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 80 నుంచి రూ. 90 వేలు ఇస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం షెడ్డు ఏర్పాటు చేసుకోవడం కోసం 50 శాతం రాయితీ ఇవ్వాలి. ప్రోత్సాహకం అందిస్తే రైతుకు లాభం చేకూరుతుంది. దీనితో పాటు కిలో పట్టు గూళ్లకు రూ. 75 ఇన్సెంటివ్‌ను కూడా అందించాలి.logo