శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Sep 07, 2020 , 01:45:02

ప్రమాదకరంగా మూలమలుపులు

ప్రమాదకరంగా మూలమలుపులు

  • l మల్లారం గండిలో   పెరిగిన పిచ్చిమొక్కలు,పొదలు
  • l కనిపించని సూచిక  బోర్డులు,  కల్వర్టుల చుట్టూ పిచ్చిమొక్కలు 

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని మల్లారం గండి లో రోడ్డు మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. నిజామాబాద్‌ నుంచి వర్నికి వెళ్లే రోడ్డులో ఉన్న ఈ గండి ప్రాంతంలోని మూలమలుపుల వద్ద పిచ్చిమొక్క లు, పొదలు మొలిచాయి. ఈ మూలమలుపుల వద్ద గతం లో అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు పోగొట్టుకోగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. నిజామాబాద్‌, బాన్సువాడ, వర్ని ప్రాంతాల నుంచి ఈ రోడ్డు మీదుగా ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మూలమలుపుల వద్ద చెట్ల పొదలు రోడ్డుపైకి రావడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ద్విచ క్ర వాహనదారులు, కార్లు, ఆటోల్లో ప్రయాణించే వారు భయపడుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టుల చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాద సూచికల బోర్డుల చుట్టూసైతం పిచ్చిమొక్కలు పెరిగాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి మూలమలుపులు ఉన్న ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.