బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Sep 07, 2020 , 01:45:06

ఎంపీ అర్వింద్‌ అబద్ధాలు...!

ఎంపీ అర్వింద్‌ అబద్ధాలు...!

  • n తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల మేలుపై విష ప్రచారం
  • n రైతుబంధు, రైతుబీమాపై కేంద్ర మంత్రుల మెచ్చుకోలు
  • n ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం
  • n కేంద్ర ఆధీనంలోని సంస్థ నివేదికపై ఎంపీకి అవగాహన లేమి
  • n పసుపు బోర్డు, మద్ధతు ధర ఊసెత్తకుండా మక్కజొన్నపై రాద్ధాంతం
  • n రెండు నెలల తర్వాత నిజామాబాద్‌ జిల్లాకు రాక

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సరిగ్గా రెండు నెలల తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో అడుగు పెట్టారు. జూన్‌ 26న దిశ మీటింగ్‌ అనంతరం ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ సుమారుగా 60 రోజులుగా జిల్లా ప్రజలకు చూద్దామన్నా కనిపించలేదు. సోషల్‌ మీడియాలో పోస్టులు మినహా ప్రజలకు అందుబాటులో  లేకుండా పోయారు. ఆపన్నహస్తం కోసం సాయం అడిగిన వారికి ఎంపీ తరఫున మొండి చేయి మాత్రమే మిగిలింది. ట్విట్టర్‌లో చిన్న పోస్టుకే మానవీయ దృక్పథంతో స్పందిస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంతో మందికి అండగా నిలుస్తూ మన్ననలు పొందుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తన పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు వచ్చినప్పటికీ ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ పా ల్గొనలేదు. కొవిడ్‌ 19 పరిస్థితులపై కేంద్రం నుంచి అందే సాయంపైనా ఊసెత్తలేదు. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో జిల్లా పరిస్థితిని అంచనా వేయలేదు. నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ముప్పావు గంట ప్రెస్‌మీట్‌ పెట్టి తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపారు. విశేషమేమంటే ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలన్నీ ఎన్డీయే సర్కారులోని పెద్దల మాటలకు విరుద్ధంగానే ఉన్నాయి.

అబద్ధాలు @ 45 నిమిషాలు...

రైతు ఆత్మహత్యలపై ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో 2019 వరకు రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర సర్కారు అనుబంధ సంస్థ ఎన్‌సీఆర్‌బీ(నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో) వెల్లడించింది. రైతు ఆత్మహత్యల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలు అనేకం ఉన్నాయి. ఆ రాష్ర్టాల్లో రైతుకు అందుతున్న అండదండలు శూన్యం. సాగుకు ప్రోత్సాహం లేకపోవడంతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు తనువు చాలిస్తున్నా రు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్‌, పుష్కలంగా సాగు నీళ్లు, పారదర్శకంగా పంటల కొనుగోళ్లు వంటి కారణాలతో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. గత ప్రభుత్వాల హయాంలో రైతులను చిన్నచూపు చూడడంతో ఎంతో మంది బలయ్యారు. కానీ ఇప్పుడు రైతులు సాగును పండుగలా మార్చుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి రైతు సంక్షేమ పథకాలకు రాష్ట్రం ఆదర్శమని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌, హరిత విప్లవానికి నాంది పలికిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌, నాబార్డు, చైర్మన్‌ గోవింద రాజులు, మోదీ హయాంలో ఆర్బీఐ చైర్మన్‌గా పని చేసిన రఘురాం రాజన్‌, భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎస్‌. పరోడాతో పాటు ఎంతో మంది మేధావులు రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను కీర్తిస్తుండగా అవగాహన లోపంతోనే ఎంపీ అర్వింద్‌ నోరు పారేసుకుంటున్నారని సామాన్య రైతులు చర్చించుకుంటున్నారు.

పసుపు వదిలి మక్కవైపు...

పసుపు రైతుల నుంచి అడుగడుగునా ఎదురు దాడి ఎక్కువ అవుతుండడంతో నిజామాబాద్‌ ఎంపీ తాజాగా రూట్‌ మార్చారు. పసుపు రైతుల గురించి, పసుపు పంటపై మాటెత్తితే వివాదాస్పదం అవుతుందనే కారణంతో శనివారం నాటి ఓ సమావేశం లో ధర్మపురి అర్వింద్‌ తనదైన శైలిలో మక్కజొన్నపై లేని పోని ప్రకటనలు చేసి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏడాదిన్నర కిందట తానిచ్చిన పసుపు బోర్డు, పసుపు పంటకు కనీస మద్దతు ధర హామీలపై నోరు ఎత్తని ఎంపీ... మక్కజొన్న పంట విషయంపై మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకు వస్తానని చెప్పిన బీజేపీ ఏమీ చేయలేక కొంగొత్త రీతిలో రైతులను రాజకీయ అస్త్రంగా మార్చుకుంటూ పబ్బం గడుపుతున్నదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆర్మూర్‌, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురవుతున్నది.  పసుపు బోర్డు ఏమైందంటూ నిలదీతలు పెరుగుతున్నాయి.

ఎంపీ అర్వింద్‌ తీరు మార్చుకోవాలి 

జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీరు మార్చుకుని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఎంపీ అర్వింద్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మానుకుని సాధ్యమైతే రైతుల సంక్షేమానికి అవసరమైన నిధులు విడుదల చేయించాలి. కేంద్రంతో మాట్లాడి రాష్ర్టానికి యూరియా తెప్పించేందుకు  ఎంపీ చొరవ తీసుకోవాలి. 

-ఎం.రవి, రైతు, గోవింద్‌పేట్‌, ఆర్మూర్‌logo