శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Sep 03, 2020 , 01:46:22

అహ్మద్‌పూర్‌ శైవపీఠం మఠాధిపతి శివైక్యం

అహ్మద్‌పూర్‌ శైవపీఠం  మఠాధిపతి శివైక్యం

  • l వీరశైవుల్లో విషాదఛాయలు
  • l డాక్టర్‌ శివలింగ శివాచార్యులకు నివాళులర్పించిన భక్తులు 

బోధన్‌: మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా అహ్మద్‌పూర్‌ శైవపీఠం మఠాధిపతి, వీరశైవుల ఆరాధ్యదైవం డాక్టర్‌ శివలింగ శివాచార్య మహరాజ్‌ (105) మంగళవారం శివైక్యం చెందారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని బోధన్‌, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలో ఆయన శిష్యగణం, వీరశైవుల్లో విషాదం నెలకొంది. మూడు నియోజకవర్గాల్లో చాలామంది మహరాజ్‌ ప్రవచనాల ప్రభావంతో ఏటా శివదీక్షలు తీసుకుంటుంటారు. గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రలోని మన్మథస్వామి పుణ్యక్షేత్రానికి చేపట్టిన పదో మహాపాదయాత్రను ఆయన బోధన్‌లోని పురాణే మఠం వద్ద ప్రారంభించారు. పలుమార్లు ఆయన బోధన్‌ డివిజన్‌లో పర్యటించి శైవధర్మ, శివతత్వాన్ని ప్రచారం చేశారు. 

బోధన్‌ పురాణేమఠంలో నివాళులు.. 

అహ్మద్‌పూర్‌ మహరాజ్‌ డాక్టర్‌ శివలింగ శివాచార్యులు శివైక్యం చెందారన్న వార్తతో వీరశైవులు విషాదంలో మునిగిపోయారు. పట్టణంలోని పురాణే మఠంలో మహరాజ్‌ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. పలుగ్రామాల్లోనూ వీరశైవులు ఆయన చిత్రపటాలకు నివాళులర్పించారు. పురాణేమఠంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు అజయ్‌కుమార్‌, పట్టణ జంగం సమాజ్‌ కార్యదర్శి మఠాధిపతి శంకరప్ప, గంగాధర్‌ అప్ప, నితిన్‌ పటేల్‌, యాదవరావు తదితరులు పాల్గొన్నారు.