మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Sep 03, 2020 , 01:46:25

కబడ్డీ... కబడ్డీ

కబడ్డీ... కబడ్డీ

  • lఇందూరు సత్తా చాటుతున్న గ్రామీణ క్రీడాకారుడు
  • lకోచ్‌గా రాణిస్తున్న మీసాల ప్రశాంత్‌
  • lరాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు 

ఇందూరు : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ఢీకంపల్లికి చెందిన మీసాల ప్రశాంత్‌ది వ్యవసాయ కుటుంబం. కబడ్డీలో రాణిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాడు. ప్రశాంత్‌ తల్లిదండ్రులు లక్ష్మి-మారుతి సాధారణ కుటుంబమైనప్పటికీ కొడుకును ఆటల్లో తనకున్న నైపుణ్యాన్ని గ్రహించి ప్రోత్సహించడం విశేషం. ప్రశాంత్‌ ఒకటి నుంచి 10వ తరగతి వరకు నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో ఉన్న విజ్ఞాన్‌ హైస్కూల్‌లో చదివాడు. ఇంటర్‌ ఎస్‌వీ జూనియర్‌ కళాశాలలో, హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రశాంత్‌ పాఠశాల స్థాయిలోనే ఆటలపై మక్కువ పెంచుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్‌ జయసింహాగౌడ్‌ ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయులు బొబ్బిలి నరేశ్‌, సంజీవ్‌ సహకారంతో అథ్లెట్‌గా అరంగేట్రం చేశాడు. అండర్‌-10 క్రాస్‌ కంట్రీలో జిల్లా తరఫున హైదరాబాద్‌లో పాల్గొని 5వ స్థానం సాధించాడు. హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొన్నాడు. ఖోఖో, కబడ్డీలోనూ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. లింగన్న, సుబ్బారావు, నాగరాజు సహకారంతో కబడ్డీ రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడు. ప్రతిభ చాటి అప్పటి మంత్రి మండవ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నాడు. అనతికాలంలోనే ఎన్నో విజయాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 

కబడ్డీ నేపథ్యం కలిగిన కొలంబస్‌ సినిమాలో హీరో సుమంత్‌ అశ్విన్‌కు కబడ్డీ కోచ్‌గా పలు సూచనలిస్తూ సినిమాలో క్రీడాకారుడిగా నటించి సినిమా కబడ్డీ సన్నివేశాన్ని రక్తి కట్టించడంలో ప్రధానపాత్ర పోషించాడు. 

lఏషియన్‌ పెయింట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు మొదటి స్థానం సాధించి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసలు అందుకున్నారు. 

lకోచ్‌గా ఎంతోమంది క్రీడాకారులను తయారుచేసి గ్రామాల్లోని విద్యార్థులకు కబడ్డీ పైన అవగాహన కల్పించి ఉచిత శిక్షణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. 2017లో హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ శిక్షణ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం కబడ్డీ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మారుమూల క్రీడాకారులకు కబడ్డీపై మెళకువలు అందిస్తూ వారిలో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు.  


logo