గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Sep 02, 2020 , 02:48:49

గడువు దాటితే గండమే!

గడువు దాటితే గండమే!

  • nఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం
  • nఅక్టోబర్‌ 15వరకు గడువు పెంపు
  • nజీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • nఅవగాహన కల్పిస్తున్నా..     ఆసక్తి చూపని పట్టణవాసులు
  • nఅక్రమ ప్లాట్లు, లే అవుట్లపై ‘నుడా’ నజర్‌
  • nక్రమబద్ధీకరణపై ప్రభావం చూపుతున్న కరోనా 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అక్రమ లేఅవుట్‌లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి మూలంగా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 15 వరకు తుది గడువుగా నిర్ణయించగా, ఆగస్టు 28, 2020 వరకు సేల్‌ డీడ్‌ ఉన్న వాటికే ఈ అవకాశం వర్తించనుంది. ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు అనుసరించకుండానే అక్రమార్కులు నిజామాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు ఏర్పాటుచేస్తున్నారు. అమాయక ప్రజలు వీరి మాటలు నమ్మి రూ.లక్షలు ముట్టజెప్పి చేతులు కాల్చుకుంటున్నారు. సరైన మౌలిక వసతులు లేని ఖాళీ స్థలాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అక్రమ వెంచర్ల ఆట కట్టించేందుకు నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) సిద్ధమైంది. ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును ప్రభుత్వం మరోమారు పెంచడంతో ప్రజలకు మొదట అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నది. అక్టోబర్‌ 15 తర్వాత ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేకుండా కఠిన నిబంధనలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించనుంది. నుడా అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 64 ఎకరాల భూమిని అక్రమ వెంచర్లుగా చేసినట్లుగా నుడా గుర్తించింది.

కరోనా ప్రభావం...

ఎల్‌ఆర్‌ఎస్‌(లే అవుట్‌, రెగ్యులరైజేషన్‌ స్కీం) 2018లో ప్రారంభించారు. 2018, మార్చి 30లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో అనుమతించారు. మొదట 2018, సెప్టెంబర్‌ నెలాఖరు వరకు గడువు విధించారు. ఆ తర్వాత ఈ   ఏడాది జనవరి 31 వరకు ప్రస్తుతం అక్టోబర్‌ 15 వరకు గడువు పెంచారు. ప్రజల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పందన ఆశించినంత రావడంలేదు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ జీపీల నుంచి మున్సిపాలిటీలుగా మారినా ప్రజల ఆలోచన విధానం మారలేదు. ప్రతి శనివారం మున్సిపల్‌ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నా స్పందన కరువైంది. క్రయ, విక్రయాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ ముఖ్యమనే విషయం అవగాహన చేసుకోలేకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారే అధికంగా ఉండడంతో కొన్నిచోట్ల ముందుకు రాలేక పోతున్నారు. మార్చి నెలలో లాక్‌డౌన్‌ ప్రభావం కూడా బాగా పడింది. 

భవిష్యత్తులో ఇక్కట్లే...

ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రభుత్వం కొన్ని నిబంధనలు నిర్దేశించింది. నదులు, సరస్సుల సరిహద్దులకు లే అవుట్‌ 30 మీటర్ల దూరం ఉండాలి. నాలాలకు రెండు మీటర్ల దూరంలో లే అవుట్‌ ఉండాల్సి ఉంటుంది. 10 హెక్టార్లలోపు సరస్సులు, కుంటలు, శిఖం భూములకు 9 మీటర్లు దూరంలో లే అవుట్‌లు ఉండాలి. మూడు వేల గజాల వరకు ఉన్న భూమికి మార్కెట్‌ విలువలో 25శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు, 3001 నుంచి ఐదు వేల గజాల వరకు ఉన్నభూమికి మార్కెట్‌ విలువలో 50శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 5001 గజాల నుంచి 10 వేల గజాల వరకు ఉన్నభూమికి మార్కెట్‌ విలువలో 75శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీ వర్తిస్తుంది. పది వేల గజాలకు పైగా భూమికి మార్కెట్‌ విలువలో 100శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీ భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ముగిసిన తర్వాత అక్రమ వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసే వారికి ఇక్కట్లు ఎదురు కానున్నాయి. ఎకరాల కొద్దీ స్థలాలు, వెంచర్లను ఇకపై కచ్చితంగా లే అవుట్‌ చేయాల్సిందే. లేదంటే ప్లాట్లుగా విభజించి విక్రయించినా రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైనా ఇలాంటి స్థలాలను కొనుగోలు చేస్తే ఇబ్బందుల్లో పడడం ఖాయమ ని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్‌ వంటి నగరాల్లో శివారు ప్రాంతాల్లో నుడా జారీ చేసిన లేఅవుట్‌ అనుమతి ఉందో లేదో పరిశీలించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించే అవకాశం ఉండదు. పైగా కరెంట్‌, నల్లా కనెక్షన్లు ఇవ్వరు. ఎల్‌ఆర్‌ఎస్‌కు రాకపోతే వాటిపై కఠిన నిబంధనలు అమలు చేస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.