గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 31, 2020 , 01:03:01

బాల్య వివాహాలకు చెక్‌

బాల్య వివాహాలకు చెక్‌

బాన్సువాడ : పేదరికం.. పోషణ భారం.. పెండ్లికి బోలెడు ఖర్చు.. ఇలా ఓ పేదింట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఆ కుటుంబంలో భయం మొదలయ్యేది. దీంతో చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆడ పిల్లలను చిదిమేసిన సంఘటనలు కూడా అప్పట్లో కోకొల్లలు. మరికొందరు పెండ్లీడు రాకముందే అమ్మాయికి పెండ్లి చేసి అత్తారింటికి సాగనంపేవారు. ఇందు కు నిరక్షరాస్యత కూడా ఒక కారణం. 

కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో బాల్య వివాహాలకు దాదాపు అడ్డుకట్ట పడింది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో పేద వారికి ఆడ పిల్ల పెండ్లి చేయడం సులభంగా మారింది. ప్రభుత్వ పథకాలతో పెండ్లి చేయడం భారం కాదు బాధ్యత అనుకునే స్థాయికి పేదవారు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేరిట అందిస్తున్న ఆర్థిక సహాయంతో బాల్య వివాహాలకు దాదాపు ఫుల్‌స్టాప్‌ పడింది. ముక్కుపచ్చలారక ముందే వివాహాలు చేయడాన్ని నియంత్రించడంలో అధికారులు కూడా విజయం సాధిస్తున్నారు. 

కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు నెల వరకు ఎనిమిది నెలల కాలంలో మొత్తం 24 బాల్య వివాహాలకు అధికారులు అడ్డుకట్ట వేశారు. జనవరి నుంచి మార్చి 20వ తేదీ వరకు 15 బాల్య వివాహాలను చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు అడ్డుకున్నారు. కరోనా నేపథ్యంలో మార్చి 21వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో దీనిని ఆసరాగా చేసుకొని పెండ్లీడుకు రాని వివాహాలు చేయాలని చూసిన మరో తొమ్మిది పెండ్లిలకు అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు, మార్చిలో ఆరు, ఏప్రిల్‌లో రెండు, మేలో ఏడు, జూన్‌లో రెండు, జూలైలో మూడు కలిపి మొత్తం జిల్లావ్యాప్తంగా 24 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ బీర్కూర్‌, ఎల్లారెడ్డి, గాంధారి, మాచారెడ్డి, మద్నూర్‌, దోమకొండ మండలాల్లో కలిపి తొమ్మిది వివాహాలను అడ్డుకున్నామని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించామని పేర్కొన్నారు. 

అధికారుల విశేష కృషి.. 

బాల్య వివాహాలను నియంత్రించడానికి ప్రభుత్వం చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రివెన్షన్‌ ఆఫీసర్‌(సీఎంపీవో)తో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులకు బాధ్యతలను అప్పగించింది. మూడు విభాగాల అధికారులు కలసి పనిచేస్తుండడంతో గ్రామాల్లో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడుతున్నది. తమకు అందిన సమాచారంతో అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్థాయిలో ఉండే అధికారులకు తమ పల్లెల పరిధిలో జరిగే కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉంటుంది. గ్రామస్థాయి అధికారులు ఈ విషయంలో తగిన విధంగా స్పందిస్తే బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి.. 

ఆడ పిల్లల సంరక్షణకు, అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నది. ప్రభుత్వ ప్రవేశ పెట్టిన పథకాలపై, ఆడ పిల్లలకు ఉన్న హక్కులపై అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది. విద్యాహక్కు చట్టం, చిన్న పిల్లలపై నేరాలు  శిక్షలు, బేటీ బచావో.. బేటీ పడావో, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర పథకాలపై నిరక్షరాస్యులకు, పల్లె ప్రజలకు అవగాహన ఉంటే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గ్రామస్థాయిలో కమిటీలు వేస్తే పెండ్లీడు రాకముందు చేసే వివాహాలను ఆపే అవకాశాలు ఎక్కువగా ఉం టాయి. గ్రామ స్థాయిలో వీఆర్వో, కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్‌, మండల స్థాయిలో తహసీల్దార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, డివిజన్‌ స్థాయిలో ఐసీడీఎస్‌ సీడీపీవో, ఆర్డీవో, జిల్లా స్థాయిలో బాల్య వివాహాల నిర్మూలన అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. వీరందరూ సమష్టిగా కృషి చే స్తే బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. వివాహా న్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి అని గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తే అసలు బాల్య వివాహాలే జరగవనే అభిప్రామాన్ని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. 

బాల్యవివాహాలతో సమస్యలు అనేకం.. 

శారీరక, మానసిక వికాసం తక్కువ. మేధస్సు మందగిస్తున్నది. పది నుంచి 15 ఏండ్ల వయస్సు ఉన్న బాలికను 25 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న పురుషుడికి ఇచ్చి వివాహం చేయడంతో ఇద్దరి మధ్య వయో భేదం ఏర్పడుతుంది. వారి అభిరుచులు కలవవు. జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వయో భేదంతో తొందరగా వితంతుగా మారే ప్రమాదం ఉంటుంది. శారీరక ఎదుగుదల లేకపోవడంతో మాత, శిశు మరణాల రేటు అధికంగా ఉంటుంది. 

చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. 

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన మైన శిక్షలను అమలు చేస్తున్నది. 2006 బాల్య వివాహాల చట్టం (జీవోఎంఎస్‌ 10) ప్రకారం రెండేండ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. బాల్య వివాహాన్ని సరైన ఆధారాలతో ఎవరైనా నిలిపి వేసే హక్కు ఉంది. బాల్య వివాహం జరుగుతున్న విషయం తెలిస్తే 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించవచ్చు. బాలికలను జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరిచి ప్రభుత్వ బాలల సదనాలకు తరలిస్తారు. అక్కడ విద్యతో పాటు వృత్తివిద్యపై ప్రత్యేక శిక్షణను ఇస్తారు. కస్తూర్బా విద్యాలయాల్లో చేర్పించి ఉచితంగా విద్యను అందిస్తారు. బాల్య వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు పెండ్లికి ప్రోత్సహించిన వారు, బంధువులు చట్ట ప్రకారం శిక్షార్హులు.


logo