శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Aug 31, 2020 , 01:03:03

కీచులాట!

కీచులాట!

కరోనా కష్టకాలంలో యావత్‌ దేశం మహమ్మారి వైరస్‌తో పోరాటం చేస్తున్నది. కొవిడ్‌ 19ను అంతం చేసేందుకు రాష్ట్రంలోనూ కేసీఆర్‌ సర్కార్‌ కంకణం కట్టుకుని పని చేస్తున్నది. రాష్ట్ర రోడ్లు,  భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎవరికి వారు తోచిన సాయం అందిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.  కష్టకాలంలో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల కన్నీళ్లు తుడుస్తుండగా... భారతీయ జనతా పార్టీలో మాత్రం పదవుల పందేరం పేరుతో జరుగుతున్న హడావిడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర కార్యవర్గం కూర్పుతో బీజేపీలో రచ్చకెక్కిన ఇరు వర్గాల తీరుతో  ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. తాజాగా మరోమారు జిల్లా స్థాయిలో పలు కార్యవర్గాల కూర్పుతో పాత, కొత్త వర్గం మధ్య చోటుచేసుకున్న కీచులాట తారా స్థాయికి చేరడం మరింత అగ్గి రాజేస్తున్నది. పార్టీ పదవులు పొందలేక పోయిన వారంతా సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ ముఖ్య నేతలపై దుమ్మెత్తి పోస్తుండగా... మరికొందరైతే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు..

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖలో మరోమారు గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఆగస్టు మొదటివారంలోనే రాష్ట్ర కార్యవర్గ కూర్పులో మా జీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు చోటు దక్కడంతో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వర్గం భగ్గుమన్నది. తమకు తెలియకుండానే పార్టీ పదవులు కట్టబెట్టడం సరికాదంటూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫిర్యాదు సైతం చేశారు. ఈ విషయంపై యెండల వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి బీజేపీ జెండాలు మోసిన తమకు పదవులు రావడంపై కొత్తగా పార్టీలోకి వచ్చి పదవుల్లో స్థిరపడిన వారు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ ఒంటికాలిపై లేస్తున్నారు. ఇలా మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండడంతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రేణుల్లో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ప్రకటించిన నగర కమిటీపైనా అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమలంలో కీచులాట మరోమారు వెలుగు చూసినట్లయ్యింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి పెత్తనం ఏమిటంటూ చాలాకాలం నుంచి బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తున్న వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ అసంతృప్తిగా ఉన్న నాయకుల సంభాషణలు సైతం చక్కర్లు కొడుతుండడంతో కమలం పార్టీ శ్రేణులు విసుగు చెందుతున్నాయి.  

ధర్మపురి అర్వింద్‌ తీరుపై అసంతృప్తి...

దేశం, రాష్ట్రంలో రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంకట పరిస్థితి దాపురించింది. ఎంపీ అర్వింద్‌ తీరుతో ఇప్పటికే ప్రజల్లో తిరగలేక పోతున్న కమలం నేతను అంతర్గత కుమ్ములాటలు మరింతగా కుంగదీస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కీచులాటలతో విసుగు చెందుతున్న అనేక మంది కమలాన్ని వదిలి కారు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వేళ పసుపు బోర్డు ప్రకటన చేసి రైతులను మాయ చేసిన ప్రస్తుత నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ మాట నిలబెట్టుకోలేక పోవడంతో శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఓట్ల వేటలో పసుపు పంటకు కనీస మద్దతు ధర, పసుపు బోర్డు ప్రకటనలు చేసిన నాయకులే ఇప్పుడు నోరు విప్పకపోవడంతో బీజేపీలోని సె కండ్‌ క్యాడర్‌ నాయకులంతా తిరుగుబాటును ప్రదర్శిస్తున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నామని బీజేపీ పెద్దల ముందు బాహాటంగానే తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి రైతుల ముందు దోషులుగా నిలబడడం తమతో కావడం లేదని మొన్నటి వరకు ఎన్నికల్లో బీజేపీ జెండాలు మోసిన వారు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మొత్తానికి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యవహరిస్తున్న తీరుతో విసుగెత్తిపోతున్నట్లుగా సమాచారం.

గులాబీ గూటికి కమలం నేతలు...?

ఏడాదిన్నర కాలంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వరుస ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంటున్నది.  స్థానిక సంస్థల ఎన్నికలు, పురపాలక ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండానే రెండు జిల్లాల్లో రెపరెపలాడింది. అత్యధిక సీట్లతో మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే సారథులయ్యా రు. కనీస సీట్లను పొందలేకపోవడంతో పాటుగా సగానికి ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేని దుస్థితి కనిపించింది. తీవ్ర నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న కమల దళానికి ఆది నుంచి ఊరట దక్క డం లేదు. పైగా ఈ మధ్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కూర్పు జరిగినప్పటికీ అందులో జెండాలు మోసి న అనేకులకు మొండిచేయి మిగిలింది. తిరిగి జిల్లా, నగర, పట్టణ కమిటీల్లోనూ స్థానం ఆశించిన అనేకులు వరుసగా భంగపాటుకు గురవుతున్నారు. దీంతో చేసేది లేక పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కారెక్కారు. వారి బాటలోనే గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు నిజామాబాద్‌ నగరంలోని ముఖ్య లీడర్లంతా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


logo