శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Aug 29, 2020 , 02:24:47

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా ఇందూరు !.. జిల్లా అభివృద్ధిపై సీఐఐ రూట్‌మ్యాప్‌

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా ఇందూరు !.. జిల్లా అభివృద్ధిపై సీఐఐ రూట్‌మ్యాప్‌

  • l ఆహారశుద్ధి పరిశ్రమలకు అపార అవకాశాలు
  • l రాష్ట్ర జీడీపీలో నిజామాబాద్‌ జిల్లా వాటా 2.82 శాతం..
  • l పసుపు ఉత్పత్తిలో ప్రపంచంలో మన వాటా 8శాతం..
  • l ఇప్పటికే జిల్లాలో వందల ఎకరాల్లో 8 ఇండస్ట్రియల్‌ పార్కులు
  • l 112 పేజీల ప్రగతి ప్రణాళికలో భారత పరిశ్రమల సమాఖ్య వెల్లడి

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలపైనా దృష్టి కేంద్రీకరించింది. పారిశ్రామిక వృద్ధిని వికేంద్రీకరించేందుకు ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఐటీ మెరుపులతో హైదరాబాద్‌ హంగులను విశ్వవ్యాప్తం చేస్తున్న ఆయన... రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) రాష్ట్ర చాప్టర్‌ ఆయా జిల్లాలపై ప్రగతి ప్రణాళికను రూపొందించింది. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు, ఔత్సాహికులకు నిజామాబాద్‌ జిల్లా భౌగోళిక, సామాజిక, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, విద్యా, ఆరోగ్యం వంటి అంశాల్లో కూలంకషంగా వివరాలను విశదీకరిస్తూ నివేదికను రూపొందించింది. 112 పేజీల నివేదికలో జనాభా, అక్షరాస్యత, వృద్ధి రేటు, సాగు, రైతుల సంఖ్య, మానవవనరులు, విద్యాసంస్థలు, విద్యావకాశాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, అవకాశాలు ఇలా ఒకటేమిటి అనేకానేక విషయాలను సీఐఐ పొందుపర్చింది. నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఎన్‌డీపీపీ) పేరుతో రూపొందించిన ఈ ప్రణాళికలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ ప్రణాళికలోని సారాంశం, పలు ముఖ్యమైన సమాచారంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

జాతీయ, రాష్ట్ర సగటుకు సమానంగా...మానవ అభివృద్ధి సూచిలో నిజామాబాద్‌ జిల్లా పలు అంశాల్లో జాతీయ సగటుకు దరిదాపుల్లో ఉండడం కాసింత ఊరటను ఇస్తోంది. అయితే, అక్షరాస్యత వంటి విషయంలో మాత్రం గ్రామాల్లో, పల్లె ప్రజలకు విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లుగా సీఐఐ ప్రాథమికంగా నిర్ధారించింది. మానవ అభివృద్ధి సూచికలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా 0.466 స్కోర్‌తో జాతీయ సగటుకు తక్కువగా ఉండగా రాష్ట్ర సగటుకు దరిదాపుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాల పరంగా పరిశీలిస్తే 8వ స్థానంలో దిగువన చేరింది. కొనుగోలు శక్తిలో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు మేటిగా ఉన్నారు. మానవ అభివృద్ధి సూచిక(హెచ్‌డీఐ) కొనుగోలు శక్తి అంశంలో జాతీయ సగటు 0.314తో పోలిస్తే రాష్ట్ర సగటు 0.410 ఎక్కువగా ఉంది. ఒక నెలలో వ్యక్తుల కొనుగోలు శక్తి విభాగంలో మానవ అభివృద్ధి సూచిక 0.357 స్కోర్‌తో నిజామాబాద్‌ జిల్లా జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉండడం విశేషం. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే 10వ స్థానంలో ఉండడం గమనించాల్సిన అంశం. ఆరోగ్యంలో మానవ అభివృద్ధి సూచిక ప్రకారం నిజామాబాద్‌ స్కోర్‌ 0.568 ఉండగా రాష్ట్ర సగటు 0.658 స్కోర్‌ ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు సమానంగా ఉండగా నిజామాబాద్‌ జిల్లా సగటు మాత్రం ఆరోగ్యంలో కాసింత వెనుకబాటులో ఉంది. జిల్లా అభివృద్ధి సూచిక(డీడీఐ)లో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా 6వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు భేష్‌

జాతీయ రహదారి 44, 63 నిజామాబాద్‌ జిల్లాకు అనుకూలం. దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి 44 ఉత్తర, దక్షిణాది రాష్ర్టాలను కలుపుతుంది. శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. జమ్ము, కశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ర్టాలకు సులువైన వ్యాపార, వాణిజ్య సదుపాయం ఉంది. ఎన్‌హెచ్‌ 63 ద్వారా నిజామాబాద్‌ నుంచి జగదల్‌పూర్‌ వరకు కనెక్టివిటీ ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ గుండా జాతీయ రహదారి 63 విస్తరించింది. ప్రజా, సరుకు రవాణాకు నిజామాబాద్‌ జిల్లాకు చారిత్రక నేపథ్యమే ఉందని సీఐఐ వెల్లడించింది. నిజాం కాలం నుంచి ఈ ప్రాంతానికి రైల్వే, రోడ్డు కనెక్టివిటీ ఉండడంతో నేటికీ వ్యాపార, వాణిజ్యానికి మంచి అవకాశంగా పేర్కొంది. విమానయానానికి ప్రస్తుతం హైదరాబాద్‌ 200 కిలో మీటర్లు, నాందెడ్‌ ఎయిర్‌పోర్టు 110 కిలో మీటర్ల దూరంలోనే నిజామాబాద్‌ నెలకొని ఉన్నట్లుగానూ సీఐఐ పేర్కొంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 5 హెలిప్యాడ్‌లుండడం వ్యాపార పరంగానూ కలిసి వచ్చే అంశంగా సీఐఐ నివేదిక గుర్తు చేస్తోంది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 4,161 కిలో మీటర్ల మేర అన్ని రకాల రహదారులు విస్తరించి ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 169 కిలో మీటర్లు, రాష్ట్ర రహదారి 89 కిలో మీటర్లు, ప్రధాన జిల్లా రహదారులు 598 కిలో మీటర్లు, గ్రామీణ రోడ్లు 590 కిలో మీటర్లు, పంచాయతీరాజ్‌ రోడ్లు 2,715 కిలో మీటర్ల మేర ఉన్నాయి.

విత్తనోత్పత్తిలో అద్భుతం

విత్తనోత్పత్తిలో నిజామాబాద్‌ జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తోందని సీఐఐ నివేదిక పేర్కొంది. మొత్తం 9 మండలాల్లో వందకు పైగా కంపెనీలున్నట్లుగా వెల్లడించింది. ఏడాదికి విత్తనోత్పత్తి ద్వారా వస్తున్న ఆదాయం రూ.175 కోట్లుగా ఉంది. పలు రకాల విత్తనాలకు ఈ ప్రాంతం నుంచి దేశంలోని పలు రాష్ర్టాలకు, విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లుగానూ సీఐఐ ప్రణాళిక స్పష్టం చేసింది. జిల్లా లో 35 లక్షల ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లతో రాష్ట్రం లో 10వ స్థానంలో ఉంది. పౌల్ట్రీలో 8వ స్థానం ఆక్రమించింది. మొత్తం 21 లక్షల 78 వేల కోళ్లు ఉత్పత్తి అవుతుండగా 13 లక్షల పశు సంపద నెలకొంది. 161 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల నుంచి 21 వేల లక్షల లీటర్ల సామర్థ్యం పాల ఉత్పత్తికి ఆస్కారం ఉంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 498 ఉన్నాయి. వీటి ద్వారా 8వేల మందికి ఉపాధి లభిస్తోంది. ధాన్యం మిల్లులు 448 ఉన్నాయి. జిల్లా మొత్తంలో నిజామాబాద్‌, బోధన్‌, వర్ని, కోటగిరి, ఆర్మూర్‌ మండలాల్లో 69 శాతం మేర మిల్లులు నెలకొన్నాయని సీఐఐ వెల్లడించింది.

రాష్ట్ర జీడీపీలో జిల్లా వాటా 2.82 శాతం

నిజామాబాద్‌ జిల్లా 4,288 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 15.71 లక్షల మంది జనాభా ఉండగా.. ఇందులో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు. చదరపు కిలో మీటర్‌కు జన సాంద్రత 366 మంది. రాష్ట్ర జీడీపీలో జిల్లా వాటా 2.82 శాతం. జిల్లా స్థూల ఉత్పత్తి విలువ 0.21 లక్షల కోట్లు. జిల్లాలో తలసరి ఆదాయం 1.14 లక్షలు కాగా రాష్ట్ర తలసరి ఆదాయం 2.12 లక్షలు. జాతీయ తలసరి ఆదాయం 1.26 లక్షలు. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే జిల్లా తలసరి ఆదాయం ఇంచుమించు సమానంగా ఉంది. జిల్లా వృద్ధికి వ్యవసాయమే ఊపిరి. 29 శాతం మంది ప్రజలు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వరి, పసుపు, సోయాబీన్‌, జొన్న, మక్కజొన్న, టమాట వంటి ప్రధాన పంటలు ఈ నేల సొంతం. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న భిన్న రకాల పంటల్లో జిల్లా వాటా అగ్రభాగంలోనే ఆక్రమించినట్లుగా సీఐఐ నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం సాగవుతున్న వరిలో జిల్లాలోనే 18 శాతం విస్తరించి ఉంది. సోయాబీన్‌లో 25 శాతం, పసుపు పంట సాగులో రాష్ట్రంలో జిల్లా వాటా 31 శాతం మేర ఉత్పత్తి వాటాను కలిగి ఉంది.  ప్రపంచ పటంలో పసుపు ఉత్పత్తిలో జిల్లా వాటా 8 శాతంగా ఉండడం గొప్ప విషయం.

మానవ వనరులు పుష్కలం

పసుపు, నూనె గింజలు, సోయా ఉత్పత్తులు, వరి ధాన్యం, మక్కజొన్న ఉత్పత్తులు, విత్తన తయారీ, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులకు జిల్లా అనువైన ప్రదేశం. పారిశ్రామికీకరణకు ఈ ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపిస్తే సమీప భవిష్యత్తులో జిల్లా ఎనలేని వృద్ధిని సాధిస్తుందని సీఐఐ అభిప్రాయపడింది. మానవ వనరుల సూచిలో జిల్లా దిగువ స్థాయిలో కొట్టుమిట్టాడుతుండడం కాసింత ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా 10వేల మంది పట్టభద్రులు డిగ్రీ పూర్తి చేసుకుని రోడ్డెక్కుతున్నారంటే పుష్కలంగా మ్యాన్‌ పవర్‌ అందుబాటులో ఉందని సీఐఐ అంచనా వేసింది. జిల్లాలో ప్రధానంగా రైస్‌ మిల్లు, విత్తన కేంద్రాలు, టింబర్‌ డిపోలున్నాయి. వ్యవసాయం అనుబంధ ఉత్పత్తి పరిశ్రమలు, ఖనిజ వనరులు కొద్ది మేర ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా జనాభాలో పని చేసే వారు 49 శాతం మంది ఉంటే ఇందులో 55 శాతం మంది పురుషులు కాగా 43 శాతం మంది మహిళలున్నారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న పనుల్లో నిమగ్నమైన వారు 49 శాతం మంది కాగా ఇతర రంగాలతో ముడిపడి ఉన్న వారు 51 శాతం మందిగా ఉన్నారు. వ్యవసాయంలో పురుషులు 52 శాతం, స్త్రీలు 47 శాతంగా ఉన్నట్లు సీఐఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇతర రంగాల్లో పురుషులు 48 శాతం, స్త్రీలు 54 శాతం మంది పని చేస్తున్నారు. పట్టణాల్లో వర్కింగ్‌ ఫోర్స్‌ 37 శాతం మాత్రమే. ఇందులో వ్యవసాయంతో అనుబంధం ఉన్న వారు కేవలం 8 శాతం కాగా మిగిలిన 92 శాతం మంది ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. గ్రామాల్లో పని చేసే వారి శాతం 53 శాతం. ఇందులో వ్యవసాయంలో 61 శాతం, ఇతర రంగాల్లో 39 శాతంగా ఉంది.