బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 28, 2020 , 02:36:25

అందుబాటులో ఆక్సిజన్‌ నిల్వలు

 అందుబాటులో  ఆక్సిజన్‌ నిల్వలు

  • lఐదింతలు పెరిగిన వినియోగం
  • lరెండు రోజులకు 4200 క్యూబిక్‌ మీటర్ల వాడకం
  • lఇప్పటి వరకు 66 శాతం మంది రికవరీ
  • lఇమ్యూనిటీ పెరిగేందుకు పౌష్టికాహారం

ఖలీల్‌వాడి : జిల్లా ప్రభుత్వ దవాఖానలో కరోనా రికవరీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న పటిష్ట చర్యలతోనే ఇది సాధ్యమవుతోంది. కరోనా బాధితుల్లో అవసరమైన వారికి ఆక్సిజన్‌ అందించి ఊపిరి పోస్తున్నారు. దవాఖానలో రెండు రోజులకు 4200 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. నెలకు 63 వేల క్యూబిక్‌ మీటర్లు అవసరమవుతోంది. గతంలో 10 రోజులకు సరిపడే ఆక్సిజన్‌ ప్రస్తుతం రెండు రోజులకు సరిపోతోంది. రోజుకు 10 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రోజుకు 3వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వాడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా చికిత్స అందిస్తున్న 300 ప్రధాన దవాఖానల్లో నిజామాబాద్‌ దవాఖాన ఉంది. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న ఆక్సిజన్‌తో పోల్చుకుంటే జిల్లా దవాఖానలో రోజుకు 0.3 శాతం ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో మొత్తం 776 పడకలు ఉన్నాయి. ఇందులో జనరల్‌ పడకలు 118, సింగిల్‌ లైన్‌ ఆక్సిజన్‌ 580, మూడులైన్ల ఆక్సిజన్‌ 49, మూడు లైన్ల ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ 29, కొవిడ్‌కు 272 పడకలు, జనరల్‌ పడకలు 38, ఆక్సిజన్‌ 210, మూడు లైన్ల ఐసీయూ పడకలు 24 ఉన్నాయి. త్వరలోనే మూడు లైన్ల ఆక్సిజన్‌ బెడ్‌లు 50కి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో 597 మంది కరోనా బాధితులకు చికిత్స అందించారు. ఇందులో 396 మంది కోలుకున్నారు. మిగతావారికి చికిత్స అందిస్తున్నారు. రికవరీ అయిన కేసుల్లో 300 వరకు క్రిటికల్‌ కేసులే. వైద్యులు సమర్థవంతంగా చికిత్స అందించి బాధితులు కోలుకునేలా చూశారు. నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 66 శాతం మంది రికవరీ కాగా, 34 శాతం మంది చికిత్స పొందుతున్నారు.  

బాధితులకు మెరుగైన వైద్యం

కరోనా బాధితులకు జిల్లా దవాఖానలో మెరుగైన వైద్యం అందుతోంది. ఖరీదైన ఇంజక్షన్లను కొనుగోలు చేసి అవసరమైన వారికి వినియోగిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించడంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత, కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రెమెడెసివర్‌, టోసిలుజిమబ్‌, ఫాబిఫ్లూ వంటి ఇంజక్షన్లను ఖరీదు చేస్తున్నారు. వీటి విలువ రూ.13 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. కరోనా పాజిటివ్‌ క్రిటికల్‌ పేషెంట్లకు వీటిని ఇస్తున్నారు. గాంధీ దవాఖాన తర్వాత ఇక్కడ మాత్రమే ఈ ఇంజక్షన్లను వినియోగిస్తున్నారు. మెరుగైన వైద్యంతోపాటు త్వరగా కోలుకునేందుకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్‌ పెరిగేందుకు బాదం, పిస్తా, ఇడ్లి అందిస్తున్నారు. ఒక్కో రోగికి రూ.లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జిల్లా దవాఖానలో అందుతున్న సేవలపై పలువురు ప్రశంసిస్తున్నారు.

అన్ని సదుపాయాలు ఉన్నాయి

ప్రభుత్వ దవాఖానలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన ఇంజక్షన్లు రోగులకు ఇస్తున్నాం. మూడు లైన్ల ఆక్సిజన్‌తో 50 పడకల మరో ఐసీయూను అందుబాటులోకి తెస్తున్నాం. క్రిటికల్‌గా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు. మంత్రి, మాజీ ఎంపీ, కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 

-ప్రతిమారాజ్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ దవాఖాన


logo