గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 25, 2020 , 01:08:34

జీవ వైవిధ్యంపై విస్తృత ప్రచారం

జీవ వైవిధ్యంపై విస్తృత ప్రచారం

నిజాంసాగర్‌ రూరల్‌ :ఆయనో కాంట్రాక్టు ఉద్యోగి. అయినప్పటికీ అంతరించిపోతున్న మొక్కలు, జంతువులు, పక్షుల సంరక్షణకు పాటుపడుతున్నారు. మండలంలోని మల్లూర్‌ గ్రామానికి చెందిన గైని చిన్నసాయిలు డిప్లొమా చదువుతూ ఎంఎస్సీ, బీఈడీ పూర్తిచేసి ప్రస్తుతం నిజాంసాగర్‌ మండల విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఐఈఆర్‌టీగా విధులు నిర్వహిస్తున్నారు. 2015 వరకు నల్లగొండ జిల్లాలో జీవవైవిధ్య సమన్వయకర్తగా విధులు నిర్వహించిన సమయంలో నిజాంసాగర్‌ మండలంలో సైతం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిజాంసాగర్‌ మండలం మల్లూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి, కొప్పర్గ పాఠశాలల్లో మొక్కల పెంపకంపై జాతీయస్థాయిలో పరిచయం చేయడం ద్వారా 2012లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా పర్యావరణ మిత్ర అవార్డును అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో 2016, 2017లో మల్లూర్‌ పాఠశాలలో మొక్కల పెంపకం చేపట్టడం ద్వారా మండల ఉత్తమ పర్యావరణ మిత్ర అవార్డును అందుకున్నారు. సాయిలు అదే స్ఫూర్తితో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. 

జీవ వైవిధ్య సదస్సు ఏర్పాటు..

2012లో హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు 193 దేశాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. సాయిలు అంతరించిపోతున్న జంతువులు, ఔషధ మొక్కల గురించి సదస్సులో చర్చించారు. 2012లో కోయంబత్తూరులో జరిగిన శిబిరానికి సాయిలుతోపాటు మరో నలుగురు సభ్యులు పాల్గొన్నారు. వీరు ఆ ప్రాంతంలో ఉన్న కొలబి అనే గ్రామంలో ల్యాండ్‌ టైల్డ్‌ మకాక్‌ అనే కోతిని గుర్తించారు. ఇలాంటి కోతులు కేవలం ఇదే గ్రామంలో 500 వరకు ఉన్నాయని వారు గుర్తించారు. అవి అంతరించిపోతుండగా, అందుకు గల కారణాలు తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును సదస్సులో ప్రదర్శించి శభాష్‌ అనిపించుకున్నారు. 

ప్రజలకు అవగాహన

ప్రస్తుతం జీవవైవిధ్య కమిటీల పనితీరుతోపాటు ప్రకృతితో కలిగే లాభాలను ప్రజలకు తెలుపుతూ వారిని ఉత్తేజపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నీరు ఏ విధంగా కలుషితం అవుతుందో వివరిస్తున్నారు. మట్టి గణపతులను వినియోగించేలా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.  logo