శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Aug 24, 2020 , 00:48:29

వీధి వ్యాపారులకు చేయూత

వీధి వ్యాపారులకు చేయూత

ఆర్మూర్‌ : కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వారికి రుణాలు అందించి ఆదుకునేందుకు నిర్ణయించింది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల చొప్పున బ్యాంకు ద్వారా రుణాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.  

నిజామాబాద్‌ జిల్లాలో 14,675 మంది గుర్తింపు 

నిజామాబాద్‌ నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో  బల్దియా, మెప్మా అధికారులు వీధి వ్యాపారుల గుర్తింపు కోసం సర్వే చేపట్టారు. జిల్లాలోని ఒక కార్పొరేషన్‌, 3 మున్సిపాలిటీల్లో సర్వే చేపట్టిన అధికారులు 14,675 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. ఇందులో 1,703 మంది వ్యాపారులకు రూ.10వేల చొప్పున రూ.కోటీ 70లక్షల 30వేల రుణాలను అధికారులు అందజేశారు. 

సక్రమంగా చెల్లిస్తే... రెన్యువల్‌ 

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద జిల్లా లో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న పలువురు వీధి వ్యాపారులకు రుణాలను బ్యాంకు అధికారులు అందజేశారు. ఈ రుణాలు అతికొద్ది వడ్డీతో 12నెలల్లో చెల్లించేలా అధికారులు అవకాశం క ల్పించారు. వీధి వ్యాపారులు రుణాలను సక్రమంగా చెల్లించడంతో పాటు  డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగిస్తే వ్యాపారులకు రూ.1200  తిరిగి ఇవ్వడంతో పాటు వచ్చే సంవత్సరం రుణసహాయం మరింత పెంచే అవకాశముంటుంది. 

రుణాలు సక్రమంగా చెల్లించాలి.. 

వీధి వ్యాపారులు బ్యాంకులు అందిస్తున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి. అదే విధంగా డిజిటల్‌ లావాదేవీలతో రూ.1200 పొందే అవకాశం ఉంటుంది. రుణాలు సకాలంలో చెల్లిస్తే వచ్చే ఏడాది రుణ మొత్తాన్ని పెంచే అవకాశం ఉంటుంది. 

-రమేశ్‌, మున్సిపల్‌ ప్రాజెక్టు అధికారి, ఆర్మూర్‌

అర్హులందరికీ రుణాలు  

అర్హులైన వీధి వ్యాపారులందరికీ రుణాలు అందేలా చూస్తాం. వీధి వ్యాపారులను గుర్తించడానికి  మున్సిపల్‌, మెప్మా అధికారులతో సర్వే చేస్తున్నాం. ఆర్మూర్‌ మున్సిపల్‌లో 2225 మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.    

- శైలజ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్మూర్‌