ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Aug 22, 2020 , 00:40:07

కొవిడ్‌-19పై ఆందోళన వద్దు

కొవిడ్‌-19పై ఆందోళన వద్దు

ఆర్మూర్‌ : కరోనా వైరస్‌ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నదని, ఈ నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మండలం పిప్రి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని పేర్కొన్నారు. బాధితులు ఐసొలేషన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు సూచించిన మేరకు మందులను వాడుతూ షౌష్టికాహారం తీసుకుంటే వ్యాధి నుంచి బయటపడొచ్చని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని, మాస్కులను ధరించాలని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని పేర్కొన్నారు. శానిటైజర్‌ వాడాలని, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. పిప్రి పరిసర గ్రామాల ప్రజలు పిప్రి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించా రు. శుక్రవారం 20 మందికి పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటి వ్‌ రిపోర్టు వచ్చిందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో గోపిబాబు, తహసీల్దార్‌ సంజీవ్‌రావు, సర్పంచ్‌ అసపురం దేవిరెడ్డి, ఉపసర్పంచ్‌ అసపురం శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ సోమ హేమంత్‌రెడ్డి, ఎంపీటీసీలు సామెర సురేశ్‌, దేగాం ఎర్రవ్వ, వీఆర్వో జైపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం ఆయన ఆర్మూర్‌ పట్టణంలోని రాంమందిర్‌, పెర్కిట్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 పరీక్ష కేంద్రాలను సందర్శించారు. వ్యాధి సోకిందని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని సంబంధిత వైద్యులకు సూచించారు. ఆర్మూర్‌ బల్దియా కమిషనర్‌ శైలజ, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో రమేశ్‌, వైద్యాధికారిణి అయేషా ఫిర్దోస్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు చంద్రశేఖర్‌, అనవాల, టీపీవో రమేశ్‌ పాల్గొన్నారు. 


logo