బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Aug 21, 2020 , 00:21:37

ఇంట్లోనే ఆరోగ్య పరీక్షలు

ఇంట్లోనే ఆరోగ్య పరీక్షలు

  • lమార్కెట్లో అందుబాటు ధరల్లో లభిస్తున్న హెల్త్‌ చెకప్‌ కిట్లు
  • lజ్వరమొచ్చినా.. బీపీ పెరిగినా ఇంటిలోనే టెస్టులు

ఒళ్లు కాలిపోతోంది.. ఆ సమయంలో జ్వరం ఎంతో ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఎలా? బీపీ, షుగర్‌ లెవల్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుంటే ఆ మేరకు మందులు వాడవచ్చు. కానీ ప్రతిసారి సమీపంలోని దవాఖానకు పరుగెత్తాల్సిందేనా? ఇదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. థర్మామీటర్‌, బీపీ ఆపరేటర్‌,  గ్లూకో మీటర్‌ ఇలా వివిధ వైద్య పరీక్షా పరికరాలు మార్కెట్‌లో అందు బాటులోకి  వచ్చాయి. ధరలు మార్కెట్‌లో తక్కువగానే ఉండడంతో సామాన్యులు సైతం ఈ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోనే వైద్య పరీక్షలు చేసుకుని దవాఖానకు వెళ్లక ముందే ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు.

-కోటగిరి/ఖలీల్‌వాడి

బ్లడ్‌ గ్లూకో మీటర్‌

షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకునేందుకు ప్రతిసారి ల్యాబ్‌కు వెళ్లడం, రక్త నమూనాలు ఇవ్వడం కుదరని వారికి బ్లడ్‌ గ్లూకో మీటర్‌ను ఉపయోగించడం మంచి అవకాశం. పలు కంపెనీలు బ్లడ్‌ గ్లూకో మీటర్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. కంపెనీలను బట్టి వీటి ధర రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఈ పరికరంలో ఒక డివైస్‌ ఉంటుంది. దీనిపై ఉండే తొమ్మిది రంగుల గుర్తుల ఆధారంగా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బ్లడ్‌ శాంపిల్‌ తీసుకోవడానికి ఈ డివైస్‌తో పాటు స్టిక్‌ వస్తుంది. ఈ స్టిక్‌ ద్వారా నొప్పి లేకుండా రక్త నమూనాను తీసుకుని టెస్ట్‌ స్క్రీన్‌పై బ్లడ్‌ అప్లికేషన్‌ ఏరియాలో ఉంచి ఆన్‌బటన్‌ ప్రెస్‌ చేయగానే గ్లూకోస్‌ శాతం కనిపిస్తుంది. ఈ పరికరాలు ఖచ్చితమైన నివేదిక ఇస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

 థర్మామీటర్‌

 జ్వరం ఇతర సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవాలనుకునే వారికోసం మార్కెట్‌లోకి థర్మామీటర్లు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీలను బట్టి వీటి ధర రూ.60 నుంచి రూ.100 వరకు లభిస్తున్నాయి. పాదరసం లేకుండా సోలార్‌ పవర్‌ ద్వారా పనిచేసే థర్మామీటర్‌ను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ పరికరం నోట్లో పెట్టుకున్న కొద్ది సేపటికి బీప్‌ అనే శబ్దం వస్తుంది. వెంటనే బయటికి తీస్తే డిజిటల్‌ స్క్రీన్‌ మీద శరీర ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఇండ్లల్లో వృద్ధులు,  చిన్నపిల్లలు ఉన్న వారికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆటోమేటిక్‌  బీపీ ఆపరేటర్‌

ఇంట్లోనే ఉండి ఈ పరికరం ద్వారా బీపీని తెలుసుకోవచ్చు. వివిధ కంపెనీలను బట్టి రూ.600 నుంచి రూ.2 వేల వరకు ఈ పరికరాలు లభిస్తున్నాయి. పలు కంపెనీలు లైఫ్‌ టైం వాలిడిటీ ఇస్తున్నాయి. పెద్ద వైర్‌తోపాటు చేతికి చుట్టే పౌచ్‌ వస్తుంది. ఈ పౌచ్‌ను చేతికి చుట్టుకొని పరికరాన్ని ఆన్‌ చేస్తే పౌచ్‌లోకి గాలి వచ్చి స్క్రీన్‌పై బీపీ నమోదవుతుంది.

ఆక్సీమీటర్‌.. అందరికీ అవసరమే!

కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రాథమిక దవాఖానల్లో ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు అందజేస్తున్నారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నవారు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి పలు సూచనలు చేస్తున్నారు. కరోనా సోకిన వారికి ఆక్సిజన్‌ ప్రధాన సమస్యగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆక్సిజన్‌ సరైన మోతాదులో రక్తంలో చేరకపోవడంతో శ్వాస సమస్య ఉత్పన్నమై మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రక్తంలో సరైన మోతాదులో ఆక్సిజన్‌ ఉందా ! ఎంత ఉండాలి! పల్స్‌ రేట్‌ ఎంత ఉండాలి.. అనే విషయాలు తెలుసుకోవడానికి మెడికల్‌ షాపుల్లో, ఆన్‌లైన్‌లో ఆక్సీమీటర్లను కొనుగోలు చేస్తున్నారు. కరోనా ముప్పును ముందుగా గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సీమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌లో వివిధ రకాల ఆక్సీమీటర్లు రూ.1000 నుంచి రూ.3500 వరకు అందుబాటులో ఉన్నాయి. 


logo