శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Aug 16, 2020 , 01:53:54

విడవని ముసురు!

విడవని ముసురు!

  • lఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేని వాన
  • lప్రాజెక్టులోకి పోటెత్తుతున్న వరద..
  • lపొంగిప్రవహిస్తున్న వాగులు, వంకలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఐదా రు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గత ఆది, సోమవారాల్లో దంచికొట్టిన వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతరం మోస్తరు వర్షం కురుస్తుండడంతో జలాశయాల్లోకి వరద భారీగా మొదలైంది. పలు చెక్‌డ్యాంలు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు మినహాయిస్తే మిగిలిన నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరద పోటెత్తుతున్నది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లా సగటు వర్షపాతం 2.22 సెంటీ మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో 5.08 సెంటీ మీటర్లు, చందూర్‌లో 5.30 సెంటీ మీటర్లు, నిజామాబాద్‌ నగరంలో 4.17 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో శనివారం సగటు వర్షపాతం 2.0 సెంటీ మీటర్లుగా నమోదైంది. కామారెడ్డి పట్టణంలో 4.2 సెంటీ మీటర్లు, మాచారెడ్డిలో 3.7 సెంటీ మీటర్లు, గాంధారిలో 2.6 సెంటీ మీటర్లు, సదాశివనగర్‌లో 2.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఉభయ జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉండగా చిరుజల్లులతో కూడిన వాన ఏకధాటిగా కురుస్తోంది. ఎస్సారెస్పీలోకి 12,929 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 42.702 టీఎంసీలతో శ్రీరాంసాగర్‌ కళకళలాడుతోంది. మహా రాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్‌ నుంచి 9,500 క్యూసెక్కుల మిగులు జలాలను శుక్రవారం అర్ధరాత్రి దిగువకు విడుదల చేశారని డీఈ జగదీశ్‌ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 211 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తోంది. కామారెడ్డి జిల్లాలోని సింగీతం, కళ్యాణి వంటి మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి.logo