ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nizamabad - Aug 13, 2020 , 01:54:42

మెడి‘కిల్‌' దందా!

మెడి‘కిల్‌'  దందా!

  • lనిబంధనలకు  విరుద్ధంగా వ్యవహారం
  • lపలు మందుల దుకాణాలకు తాఖీదులు ఇచ్చిన అధికారులు
  • lరాష్ట్ర మంత్రి వేముల ఆదేశాలతో ముమ్మరంగా దాడులు
  • lఅధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి  : డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ

కొవిడ్‌- 19 కష్టకాలాన్నీ సొమ్ముచేసుకుంటున్న మందుల దుకాణాల్లో.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోణాలెన్నో వెలుగు చూస్తున్నాయి. సగానికి పైగా మెడికల్‌ దుకాణాల్లో ఫార్మాసిస్టులే లేరు. మందులపై కాస్త అనుభవమున్న వ్యక్తులు ఎలాంటి అర్హత లేకపోయినా అమ్మకాలు సాగిస్తున్నారు. ఆగస్టు 3వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘దవా దగా’ కథనంతో నిజామాబాద్‌లోని ఔషధ దుకాణాలపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఔషధ విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించడంతో అధికారులు దాడులు జరిపారు. మెడికల్‌ షాపుల నిర్వహణలో అనేక లోపాలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. ఫార్మాసిస్టులు లేని దుకాణాలపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఔషధ విక్రయాలు చాలా సున్నితమైన అంశం. సంబంధిత విద్యార్హత కలిగిన వారితోనే మెడికల్‌ షాపులు నిర్వహించాలి. అంతేకానీ ఎవరు పడితే వారితో మందుల దుకాణాలు నడపడం చట్టవిరుద్ధం. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో సుమారు 2వేలకు పైగా మెడికల్‌ ఏజెన్సీలు, మెడికల్‌ షాపులుంటాయి. వీటిల్లో విద్యార్హత కలిగిన వారితో సంబంధం లేకుండా పార్ట్‌ టైం ఉద్యోగులతో పని చేయించుకుంటున్నారు. తద్వారా అనేక లోపాలు అక్కడక్కడ బహిర్గతం అవుతున్నాయి. మెడికల్‌ షాపుల్లో ఫార్మసీ కోర్సులు చదివిన వారే విధులు నిర్వర్తించాలి. తద్వారా ప్రజలకు మేలైన సేవలు అందుతాయి. లేదంటే పొరపాట్లు దొర్లి ఒక ఔషధానికి బదులు మరొకటి వినియోగదారుడి చేతికి అందితే జరగరాని నష్టం జరుగుతుంది. సాధారణ మెడికల్‌ దుకాణాలతో పాటుగా ప్రైవేటు దవాఖానలకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపుల్లోనూ ఇదే తంతు కొనసాగుతున్నది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కువే ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలోనే తేటతెల్లం అవుతున్నది.  

మంత్రి వేముల ఆదేశాలతో...

కొవిడ్‌-19కు సంబంధించిన ఔషధాల విక్రయాలపై ఎలాంటి ఉల్లంఘనలు ఉండొద్దంటూ రాష్ట్ర మంత్రి వేము ల ప్రశాంత్‌ రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. వారం రోజుల క్రితం మంత్రి ఇచ్చిన సూచనలతో ఔషధ నియంత్రణ శాఖ అప్రమత్తమైంది. 

మొన్నటి వరకు నిరంతర తనిఖీలతో అదరగొట్టిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఆయా మెడికల్‌ షాపుల్లో పరిస్థితులను గాడిలోకి తీసుకువచ్చారు. లోపాలు ఉన్న షాపులకు నోటీసులు జారీ చేశారు. వీరంతా వారం రోజుల్లో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని దుకాణాల్లో కొవిడ్‌-19 ఔషధాల విక్రయాలకు రికార్డులే కనిపించలేవు. ఎవరికి అమ్మారు? ఎందుకు అమ్మారు? ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై ఆధారాలే లేవు. ఇలాంటి వారిపై సీరియస్‌గా చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎంబీబీఎస్‌ డాక్టర్‌ ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌, కొవిడ్‌ -19 పరీక్షల ఫలితాల రిపోర్టు, ఆధార్‌ కార్డు లేనిదే కరోనాకు సంబంధించిన మందులు విక్రయించొద్దని స్పష్టం చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మాత్రలను అనేక మంది ఇబ్బడి ముబ్బడిగా మొన్నటి వరకూ కొనుగోలు చేశారు. వీటికి కూడా నియంత్రణలోకి తెచ్చేందుకు ఔషధ నియంత్రణ శాఖ చర్యలు తీసుకుంది.

అర్హత ఒకరిది... నిర్వహణ మరొకరిది...

మెడికల్‌ షాపుల నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఫార్మసీ కోర్సు పూర్తి చేసి ధ్రువపత్రం కలిగిన వారు ఒకరుంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఔషధాలు  విక్రయిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఉభయ జిల్లా ల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముఖ్యం గా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బీ ఫార్మసీ, ఎమ్‌ ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వారు నెలకు కిరాయికి సర్టిఫికెట్లు ఇచ్చేసి ఇతరత్రా పనుల్లో బిజీ అవుతున్నారు. మార్కెట్లో ఎలాంటి విద్యార్హత లేని వారితో దుకాణాలు నడిపిస్తుండడం కనిపిస్తోంది. ఫార్మసీ కోర్సులు చదివిన వారు మాత్రమే దుకాణాలు నిర్వహించేలా అవగాహన కార్యక్రమాలను సైతం ఔషధ నియంత్రణ శాఖ చేపడుతున్నది.

నిరంతర తనిఖీలు చేస్తున్నాం...

కొవిడ్‌-19 నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. మందుల దుకాణాల్లో ఫార్మాసిస్టులే ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నాం. తనిఖీల్లో అనర్హులుంటే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్‌కు సంబంధించిన మందు ల విక్రయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే నిర్వాహకులకు అవగాహన కల్పించాం. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని చెప్పాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా ఏ ఔషధాన్ని విక్రయించడం తగదు. అలా ఎవరైనా విక్రయిస్తే మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

- రాజ్యలక్ష్మి, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ


logo