మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Aug 12, 2020 , 02:54:32

ప్రయాణికులకు ‘ఆక్సిజన్‌'

ప్రయాణికులకు ‘ఆక్సిజన్‌'

  • నిజాంసాగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కు ఏర్పాటు
  • పార్కులో 400లకు పైగా మొక్కలు

నిజాంసాగర్‌ : హరితహారం కార్యక్ర మంలో భాగంగా నిజాంసాగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో పూలు, వివిధ రకాల మొక్కలు నాటారు. జూన్‌ 26వ తేదీన జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌శోభ, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌రాజు, ఎంపీపీ పట్లోల్ల జ్యోతి పార్కు పనులు ప్రారంభించారు. 

బస్టాండ్‌కు హరితశోభ

నిజాంసాగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌కు నిత్యం 18 డిపోలకు చెందిన బస్సులు రాకపోకలు సాగిస్తాయి. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఈ పార్కులో సేదతీరే అవకాశం ఉంటుంది. స్థానికులు ఉదయం వాకింగ్‌ చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ పార్కులో వివిధ రకాల మొక్కలు 400కుపైగా నాటారు. ఇప్పటికే ట్రాక్టర్ల ద్వారా మొరం వేసి స్థలాన్ని చదును చేసి ఉపాధి కూలీల ద్వారా సర్పంచ్‌ ఉమ మొక్కలు నాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. పార్కు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ పార్కులో వేప, కానుగ, మర్రి, జామ, మందారం, గులాబీ తదితర మొక్కలు నాటారు. 

రెండు ఎకరాల స్థలంలో పార్కు

బస్టాండ్‌ ఆవరణలో ఉన్న స్థలం గతంలో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలతో దర్శనమిచ్చేది. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బాన్సువాడ డీఎం సాయన్నతో గ్రామ పంచాయతీ, మండల శాఖ అధికారులు చర్చించారు. ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటారు. దాదాపు రెండు ఎకరాల స్థలంలో పార్కును ఏర్పాటు చేశారు.

మొక్కల సంరక్షణకు చర్యలు

నిజాంసాగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో రెండు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో ఆక్సిజన్‌ పార్కు ఏర్పాటు చేస్తే ప్రయాణికులు సేదతీరే అవకాశం ఉంది. బస్టాండ్‌కు నూతన శోభ రానుంది. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.

-సాయన్న, డీఎం , బాన్సువాడlogo