మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Aug 11, 2020 , 01:41:59

జిల్లాలో జోరుగా వానలు

జిల్లాలో జోరుగా వానలు

  • రెండు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు, చెక్‌ డ్యాంలు, నిండిన చెరువులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

నమస్తే తెలంగాణ యంత్రాంగం: జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉధృతం గా కాల్వలు, వాగులు పారుతున్నాయి. చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. పిల్ల కాలువల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతున్నది. వర్షపు నీళ్లు లోతట్టు ప్రాంతాలకు చేరాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బో ధన్‌ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరిం ది. అయితే ఈ నీటిని ఎక్కడా నిల్వకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఎడపల్లి, అంబం(వై) శివారు లో నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. ఆర్మూ ర్‌ మండలంలోని ఆలూర్‌, దేగాం, మిర్ధాపల్లి, మాక్లూర్‌ మండలంలోని కల్లెడి, రాంచంద్రాపల్లి తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. 

ఆలూర్‌ గ్రామంలోని చెక్‌డ్యాం పారుతున్నది. నందిపేట్‌  మండలంలో జోరు వాన కురిసింది. దీం తో జనం రోడ్లపైకి రాలేదు. తెలంగాణ, మహారాష్ట్రలో రెండు రోజులుగా దంచికొడుతున్న వర్షాలకు రెంజల్‌ మం డలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. నదిలోని జ్యోతిర్లింగాలు నీట మునిగిపోగా పురాతన శివాలయం చుట్టూ వరదనీరు కమ్ముకుంది. రెంజల్‌లో 140 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు తహసీల్దార్‌ గంగాసాగర్‌ తెలిపారు. రెంజల్‌లో వర్షానికి కూలిన పెంకుటిల్లును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. బోధన్‌ మండలంలోని లంగ్డాపూర్‌ వాగు పారుతున్నది. భీమ్‌గల్‌ మండలంలోని రెండు చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. 

కప్పల వాగుపై భీమ్‌గల్‌, గోన్‌గొప్పులలో నిర్మించిన రెండు చెక్‌డ్యాంలు మత్తడి దూకుతున్నాయి. చెక్‌డ్యాంల నిర్మాణానికి కృషి చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కమ్మర్‌పల్లిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 31.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వేల్పూర్‌ మండలంలోని మోతె పెద్ద చెరువుకు మాటు కాలువ ద్వారా వరద చేరుతున్నది. వేల్పూర్‌ మండలంలో 13.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. చందూర్‌లోని పెద్ద వాగు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పారుతున్నది. రుద్రూర్‌, వర్ని మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పారుతున్నాయి. రుద్రూర్‌లో 68 మి.మీ, వర్నిలో 66.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ రాంబాబు తెలిపారు. నవీపేట మండలంలో అత్యధికంగా 18.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఇరిగేషన్‌ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. జన్నేపల్లి వాగుతోపాటు అన్ని గ్రామాల్లోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. 

తాడ్‌గామలో పలు ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముప్కాల్‌ మండలంలో 23.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు మం డల ప్రణాళిక శాఖ ఏఎస్‌వో నరేశ్‌  తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఎగువప్రాం తం నుంచి వరద ఇందల్వాయి పెద్ద చెరువులోకి వచ్చి చేరుతున్నది. చెరువులోకి వరద చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలో వాగులు, కుంటలు, చెక్‌డ్యాములు వరదతో ప్రవహిస్తున్నాయి. బొడ్డుమామిడి చెరువు జలకళను సంతరించుకున్నది. జక్రాన్‌పల్లి మండలంలో 70.8 మి.మీ వర్షం కురిసింది. మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులకు వరద వచ్చి చేరుతున్నది. ఒర్రెలు, కాలువలు నిండుగా పారుతున్నాయి.  

బోధన్‌ డివిజన్‌లో వర్షపాతం నమోదు వివరాలు.. 

బోధన్‌ డివిజన్‌లో మండలాల వారీగా ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్‌ మండలంలో 58.2 మిల్లీమీటర్లు, రెంజల్‌లో 140.6 మి.మీ, ఎడపల్లిలో 78 మి.మీ, కోటగిరిలో 52 మి.మీ, రుద్రూర్‌లో 68.3 మి.మీ, వర్నిలో 66.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారు లు వెల్లడించారు. 


logo